
ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. ఎటు నుంచి ఏ విపత్తు వస్తుందో ఎవరికి తెలియదు. ఆపద కాలంలో మనల్ని ధైర్యంగా ఉంచడమే కాకుండా.. ప్రత్యర్థి, ఆగంతకుల బారి నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు ఆత్మ రక్షణ తోడ్పడుతుంది. అచ్చం ఇలాంటి కోవకే చెందిన ఓ ఘటన రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. తనతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు ఓ మహిళ వెయిట్రస్ దిమ్మతిరిగే పంచ్‌లతో సమాధానమిచ్చింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రెస్టారెంట్‌లోని టేబుల్ వద్ద ఇద్దరు వ్యక్తుల కూర్చొని ఉండగా.. వారి ముందు ఓ లేడీ వెయిట్రస్ నిల్చొని ఉంది. టేబుల్‌లో కొన్ని ఖాళీ బీర్ సీసాలు కూడా ఉన్నాయి. ఇంతలో ఇద్దరు కస్టమర్లలో ఒక వ్యక్తి నిలబడి వెయిట్రస్ చేయి బలవంతంగా పట్టుకున్నాడు. రెండోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా సదరు యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. అంతటితో ఆగకుండా అతని ముఖంపై పిడిగుద్దులు గుద్ది, కడుపులో తన్ని కింద పడేసింది.
ఇది చూసిన రెండో వ్యక్తి మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయినా బెదరని వెయిట్రస్ అతన్ని ధైర్యంగా ఎదుర్కొంది. సినిమాలో హీరోకు ఏమాత్రం తీసిపోకుండా అతనిపై శివంగిలా విరుచుకుపడింది. ఆమె పైకి కుర్చీ విసరగా.. యువతి తన కాలితో ఒక్క కిక్ ఇవ్వగానే ఎగిరి కిందపడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
దీనిని ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫేర్ చేయగా.. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉండగా యువతి ధైర్య సాహసాలను చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటూ పోకిరీలతో పోరాడిన యువతిని ‘ఫిమేల్ బ్రూస్ లీ’ అంటూ కొనియాడుతున్నారు.
Female Bruce Lee 💪💪 pic.twitter.com/Fg3Ben0IpQ
— CCTV IDIOTS (@cctvidiots) April 15, 2023