walking devotees
-
పాదయాత్రగా వెళ్లి.. దుర్మరణం పాలై!
అక్కిరెడ్డిపాలెం: అతను స్వామి అయ్యప్ప మాల వేశారు. నిత్యం ఎంతో నిష్టతో పూజలు చేస్తున్నారు. మాలలో ఉండగానే పాదయాత్రగా వెళ్లి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం పాదయాత్రగా సింహాచలం బయలుదేరిన ఆయన.. మార్గమధ్యంలోనే దుర్మరణం పాలయ్యారు. క్రేన్ రూపంలో ఆయన్ని మృత్యువు కబళించింది. గాజువాక ట్రాఫిక్ ఎస్ఐ షేక్ యూసఫ్ తెలిపిన వివరాలివీ.. గాజువాక సింహగిరికాలనీకి చెందిన బెహరా మురళి(67) కోరమండల్‌లోని మణికంఠ కన్స్ట్రక్షన్లో సివిల్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతను స్వామి అయ్యప్ప మాలధారణ చేశారు. ఆదివారం ఉదయం సింహాచలం లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. పాతగాజువాక నుంచి షీలానగర్ వైపు వచ్చిన ఆయన.. చట్టివానిపాలెం, ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ మధ్యలో రోడ్డు పక్కన నడుస్తున్నారు. ఆ సమయంలో ఆటోనగర్ నుంచి వస్తున్న క్రేన్ మురళీని ఢీ కొట్టి అతనిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ షేక్ యూసఫ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన నాతయ్యపాలేనికి చెందిన హైడ్రా క్రేన్ ఆపరేటర్ అక్కిరెడ్డి దేముడును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతుడికి భార్య వరలక్ష్మి, వివాహితులైన కుమారుడు సతీష్, కుమార్తెలు రమ, వరలక్ష్మి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇది చదవండి: భూ వివాదంలో ఎస్సై అత్యుత్సహాం.. బలైన నిండు ప్రాణం! -
నడక భక్తులకు రోజుకు 20 వేల మందికే దర్శనం
- కాలిబాట దివ్యదర్శనానికి టైం స్లాట్ నిర్ణయించిన టీటీడీ సాక్షి, తిరుమల: శ్రీవారి కాలిబాట దివ్యదర్శనాన్ని ఇకపై టైం స్లాట్‌లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.300 టికెట్ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు 2500 మంది భక్తులకు కేటాయించి సజావుగా శ్రీవారి దర్శనం కేటాయిస్తున్నారు. దీనివల్ల క్యూలైన్లు కనిపించవు. అదే తరహాలోనే రోజులో 20వేల మంది కాలిబాట భక్తులకు టైం స్లాట్ కేటాయించనున్నారు. దివ్యదర్శనం టోకెన్‌తో క్యూలోకి ప్రవేశించిన భక్తుడికి అత్యధికంగా రెండున్నర గంటల్లోనే శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టారు. ఈ కొత్త విధానం ఈనెల 17వ తేది సోమవారం నుండి గురువారం వరకు నాలుగురోజుల పాటు అమలు చేయాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నిర్ణయించారు. ఇక వారాంతంలో.. (శుక్ర, శని, ఆదివారాల్లో) కాలిబాట దివ్యదర్శనం రద్దు అమలు చేయనున్నారు. దీనివల్ల ఆ మూడురోజుల్లో నడిచివచ్చిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం, లడ్డూ టోకెన్లు జారీ చేయరు. తిరుమలలో పెరిగిపోతున్న క్యూలైన్లు, ఫలితంగా భక్తుల ఇబ్బందుల కారణంగా కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకూ రూ.300 టికెట్ల తరహాలోనే టైం స్లాట్ తప్పనిసరి అని ‘సాక్షి’ ముందే చెప్పింది. ఇందులో భాగంగా సమగ్ర డేటాతో పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు టీటీడీ కూడా ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి టైం స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈనెల 16న తిరుమల శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు.