నడక భక్తులకు రోజుకు 20 వేల మందికే దర్శనం
- కాలిబాట దివ్యదర్శనానికి టైం స్లాట్ నిర్ణయించిన టీటీడీ
సాక్షి, తిరుమల: శ్రీవారి కాలిబాట దివ్యదర్శనాన్ని ఇకపై టైం స్లాట్‌లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.300 టికెట్ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు 2500 మంది భక్తులకు కేటాయించి సజావుగా శ్రీవారి దర్శనం కేటాయిస్తున్నారు. దీనివల్ల క్యూలైన్లు కనిపించవు. అదే తరహాలోనే రోజులో 20వేల మంది కాలిబాట భక్తులకు టైం స్లాట్ కేటాయించనున్నారు.
దివ్యదర్శనం టోకెన్‌తో క్యూలోకి ప్రవేశించిన భక్తుడికి అత్యధికంగా రెండున్నర గంటల్లోనే శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టారు. ఈ కొత్త విధానం ఈనెల 17వ తేది సోమవారం నుండి గురువారం వరకు నాలుగురోజుల పాటు అమలు చేయాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నిర్ణయించారు.
ఇక వారాంతంలో.. (శుక్ర, శని, ఆదివారాల్లో) కాలిబాట దివ్యదర్శనం రద్దు అమలు చేయనున్నారు. దీనివల్ల ఆ మూడురోజుల్లో నడిచివచ్చిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం, లడ్డూ టోకెన్లు జారీ చేయరు. తిరుమలలో పెరిగిపోతున్న క్యూలైన్లు, ఫలితంగా భక్తుల ఇబ్బందుల కారణంగా కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకూ రూ.300 టికెట్ల తరహాలోనే టైం స్లాట్ తప్పనిసరి అని ‘సాక్షి’ ముందే చెప్పింది. ఇందులో భాగంగా సమగ్ర డేటాతో పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు టీటీడీ కూడా ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి టైం స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈనెల 16న తిరుమల శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు.