ప్రమాదానికి కారణమైన క్రేన్. బెహరా మురళి (ఫైల్)
అక్కిరెడ్డిపాలెం: అతను స్వామి అయ్యప్ప మాల వేశారు. నిత్యం ఎంతో నిష్టతో పూజలు చేస్తున్నారు. మాలలో ఉండగానే పాదయాత్రగా వెళ్లి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం పాదయాత్రగా సింహాచలం బయలుదేరిన ఆయన.. మార్గమధ్యంలోనే దుర్మరణం పాలయ్యారు. క్రేన్ రూపంలో ఆయన్ని మృత్యువు కబళించింది.
గాజువాక ట్రాఫిక్ ఎస్‌ఐ షేక్ యూసఫ్ తెలిపిన వివరాలివీ.. గాజువాక సింహగిరికాలనీకి చెందిన బెహరా మురళి(67) కోరమండల్‌లోని మణికంఠ కన్‌స్ట్రక్షన్‌లో సివిల్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతను స్వామి అయ్యప్ప మాలధారణ చేశారు. ఆదివారం ఉదయం సింహాచలం లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు.
పాతగాజువాక నుంచి షీలానగర్ వైపు వచ్చిన ఆయన.. చట్టివానిపాలెం, ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ మధ్యలో రోడ్డు పక్కన నడుస్తున్నారు. ఆ సమయంలో ఆటోనగర్ నుంచి వస్తున్న క్రేన్ మురళీని ఢీ కొట్టి అతనిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ షేక్ యూసఫ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన నాతయ్యపాలేనికి చెందిన హైడ్రా క్రేన్ ఆపరేటర్ అక్కిరెడ్డి దేముడును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతుడికి భార్య వరలక్ష్మి, వివాహితులైన కుమారుడు సతీష్, కుమార్తెలు రమ, వరలక్ష్మి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇది చదవండి: భూ వివాదంలో ఎస్సై అత్యుత్సహాం.. బలైన నిండు ప్రాణం!
Comments
Please login to add a commentAdd a comment