crane accident
-
పాదయాత్రగా వెళ్లి.. దుర్మరణం పాలై!
అక్కిరెడ్డిపాలెం: అతను స్వామి అయ్యప్ప మాల వేశారు. నిత్యం ఎంతో నిష్టతో పూజలు చేస్తున్నారు. మాలలో ఉండగానే పాదయాత్రగా వెళ్లి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం పాదయాత్రగా సింహాచలం బయలుదేరిన ఆయన.. మార్గమధ్యంలోనే దుర్మరణం పాలయ్యారు. క్రేన్ రూపంలో ఆయన్ని మృత్యువు కబళించింది. గాజువాక ట్రాఫిక్ ఎస్ఐ షేక్ యూసఫ్ తెలిపిన వివరాలివీ.. గాజువాక సింహగిరికాలనీకి చెందిన బెహరా మురళి(67) కోరమండల్‌లోని మణికంఠ కన్స్ట్రక్షన్లో సివిల్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతను స్వామి అయ్యప్ప మాలధారణ చేశారు. ఆదివారం ఉదయం సింహాచలం లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. పాతగాజువాక నుంచి షీలానగర్ వైపు వచ్చిన ఆయన.. చట్టివానిపాలెం, ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ మధ్యలో రోడ్డు పక్కన నడుస్తున్నారు. ఆ సమయంలో ఆటోనగర్ నుంచి వస్తున్న క్రేన్ మురళీని ఢీ కొట్టి అతనిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ షేక్ యూసఫ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన నాతయ్యపాలేనికి చెందిన హైడ్రా క్రేన్ ఆపరేటర్ అక్కిరెడ్డి దేముడును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతుడికి భార్య వరలక్ష్మి, వివాహితులైన కుమారుడు సతీష్, కుమార్తెలు రమ, వరలక్ష్మి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇది చదవండి: భూ వివాదంలో ఎస్సై అత్యుత్సహాం.. బలైన నిండు ప్రాణం! -
కిరాక్ వీడియో.. ట్రక్కును బయటకు తీస్తూ క్రేన్ గాల్లోకి ఎగిరి..
Crane Falls Off Bridge.. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి పడిపోయిన ట్రక్కును బయటకు తీసే క్రమంలో క్రేన్ బ్రిడ్జిపై నుండి పడిపోయింది. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తాల్చేర్ పట్టణంలో వంతెనపై నుండి ఓ ట్రక్కు నీటిలో పడిపోయింది. దీంతో, ఆ ట్రక్కును బయటకు తీసేందుకు రెండు క్రేన్స్ అక్కడికి చేరుకున్నాయి. కాగా, రెండు క్రేన్ల సాయంతో బెల్టులను ఉపయోగించి ట్రక్కును పైకి తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇంతలో ఒక క్రేన్‌కు ఉన్న బెల్టు తెగిపోయింది. దీంతో, మరో క్రేన్పైనే ట్రక్కు బరువు మొత్తం పడటంతో సదరు క్రేన్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. అనంతరం ఒక్కసైడ్కు ఒరిగి.. బ్రిడ్జిపై నుంచి నీటిలో పడిపోయింది. అయితే, ప్రమాదంలో క్రేన్లోని డ్రైవర్ సమయ స్పూర్తితో నీటిలో దూకాడు. దీంతో, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
టన్నెల్ పనుల్లో ప్రమాదం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్‌లోని పంప్‌హౌస్ వద్ద క్రేన్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్‌హౌస్‌లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్ సహాయంతో కాంక్రీట్ బకెట్‌ను కిందకు దింపుతుండగా క్రేన్‌వైర్ తెగడంతో అది టన్నెల్లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్‌ప్రెషర్ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్ (45), ప్రవీనేజ్ (38), కమ్లేశ్ (36), బిహార్‌కు చెందిన సోను కుమార్(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ బల్విందర్ సింగ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు. -
విషాదం: స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లలో అపశ్రుతి
భోపాల్ (మధ్యప్రదేశ్): దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సంబరాలు రేపు అంబరాన్నంటనున్నాయి. రేపటి ఉత్సవాల కోసం శనివారం ఏర్పాట్లు శరవవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో అపశ్రుతి దొర్లి ముగ్గురు మున్సిపల్ సిబ్బంది మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చారిత్రక నేపథ్యం ఉన్న మహారాజా బడా తపాలా కార్యాలయం (పోస్టాఫీస్) భవనంపై జెండా ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీతో భవనంపైకి ఎక్కిన సిబ్బంది జెండా ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ విరిగిపడింది. దీంతో ట్రాలీ అదుపు తప్పి ఆ నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరిదీ నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. జాతీయ పండుగ ఏర్పాట్లలో విషాదం అలుముకోవడంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తులసీరామ్ సిలావత్ ప్రకటించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ డిమాండ్ చేశారు. -
బావిలో పడిపోయిన క్రేన్
సాక్షి, హుస్నాబాద్: పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన యత్నం వారి ప్రాణాలనే హరించింది. బావిలో పనిచేస్తుండగా క్రేన్ మీద పడటంతో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాలో గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. లావుడ్య దేవోజీ, ఇస్లావత్ దుర్గా బావ, బావమరుదులు. ఇద్దరికీ కలిపి పక్కపక్కనే మూడున్నర ఎకరాల పొలం ఉంది. అందులో వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇటీవల పెరిగిన ఎండలకు బావిలో నీరు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు నీటి కోసం బావిని మరింత లోతుగా తవ్వేందుకు క్రేన్‌ను కిరాయికి తెచ్చుకున్నారు. కూలీలను పెట్టుకునే స్తోమత లేకపోవడంతో దేవోజీ భార్య చాంది (45), కుమారుడు సాయికుమార్, తన సోదరుడు లావుడ్య బీమా (50), బంధువులు ఇస్లావత్ ఎంక్యా, లావుడ్య సరోజనను సాయంగా రప్పించుకున్నారు. 15 రోజుల నుంచి బావిలో బండరాళ్లను తొలిచే పనులు చేస్తున్నారు. గురువారం రాళ్లను తవ్వేందుకు దేవోజీ, బీమా, ఎంక్యా బావిలోకి దిగారు. పైన క్రేన్ ఆపరేటర్‌కు సాయంగా దుర్గా, చాంది, సాయికుమార్, సరోజన ఉన్నారు. క్రేన్ డబ్బాలో పెద్ద బండరాయి వేసి బయటకుతీసే యత్నంలో పైభాగంలో క్రేన్‌పై అందరూ నిలుచొని బరువును సరిచూశారు. అనంతరం బండరాయిని క్రేన్ ద్వారా పైకి తెచ్చిన తర్వాత దాన్ని పక్కకుతోసే సమయంలో క్రేన్‌పై నిలబడిన చాంది కిందికి దిగింది. దీంతో బరువు అంచనా తప్పి క్రేన్ మొత్తం బావిలో పడిపోయింది. చాంది క్రేన్‌తో సహా బావిలోపడి ప్రాణాలు కోల్పోయింది. బావిలో పనిచేస్తున్న వారిపై ఒక్కసారిగా క్రేన్ పడటంతో బీమా అక్కడికక్కడే మరణించగా ఎంక్యాకు తీవ్ర గాయాలయ్యాయి. బావిపైన ఉన్న వారు కేకలు వేయడంతో తండా నుంచి స్థానికులు వచ్చారు. తాళ్ల సాయంతో బావిలో ఉన్న వారిని బయటకు తీసి 108 వాహనం ద్వారా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఇస్లావత్ ఎంక్యను వరంగల్ ఎంజీఎంకు తరలించగా, లావుడ్య సరోజనను కరీంనగర్ ఆస్పతికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం: వినయ్ చంద్
సాక్షి, విశాఖపట్నం: క్రేన్ నిర్మాణంలో లోపం కారణంగానే హిందూస్ధాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదానికి గురైందని విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. ఈ నెల 1న క్రేన్ ప్రమాదంలో చోటు చేసుకున్న ప్రమాదంలో పది మంది మృతి చెందడంతో.. ఐదుగురు ఆంధ్రా యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విశాఖ ఆర్డిఓ, ఆర్ అండ్ బి ఎస్ఈలతో కమిటీ నియమించామని తెలిపారు. ఆ కమిటీ బుధవారం షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను అందజేసిందని తెలిపారు. కమిటీ వారం రోజులపాటు క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి నివేదిక అందించిందని పేర్కొన్నారు. క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని, 70 టన్నుల లోడ్‌కి సంబంధించి క్రేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నిపుణుల కమిటీ నివేదికలో స్పష్టం చేసిందన్నారు. క్రేన్‌కి సంబంధించి కార్బన్ బ్రషెష్ పడిపోవడం, ఇన్సులేటర్స్ పాడై మూడుసార్లు మార్చారని తెలిపారు. గతంలో ట్రయల్ రన్ చేస్తున్న సమయంలోనే గేర్ బాక్స్‌లో ఆయిల్ లీకేజ్ జరిగిందని వివరించారు. (విశాఖ: షిప్ యార్డ్ ప్రమాదంపై నివేదిక) గేర్ బాక్స్ ఫెయిల్యూర్ వల్ల భారీ శబ్దంతో క్రేన్ కుప్పకూలిందన్నారు. ప్రమాదం కేవలం పది సెకన్లలోనే జరిగిపోయిందని, క్రేన్ స్ట్రక్చరల్ డిజైనింగ్, డ్రాయింగ్స్ థర్డ్‌పార్టీతో పరిశీలించలేదని స్పష్టం చేశారు. క్రేన్ నిర్మాణంలోనే లోపాలున్నాయని, సామర్థ్యానికి తగ్గట్లుగా క్రేన్ నిర్మాణం జరగలేదని తెలిపారు. నిపుణులతోనే తప్పనిసరిగా లోడ్ టెస్టింగ్ పరిశీలన జరపాలన్నారు. థర్డ్‌పార్టీ ఆధ్వర్యంలోనే ట్రయల్ రన్ నిర్వహించాలని నిపుణులు సూచించారని తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. -
విశాఖ: షిప్ యార్డ్ ప్రమాదంపై నివేదిక
సాక్షి, విశాఖపట్నం : విశాఖ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగట్టు క్రేన్ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ బృందం నివేదిక అందించింది. షిప్ యార్డ్‌కు అనుపమ క్రేన్ ఇంజనీరింగ్ సంస్థ క్రేన్ సమకూర్చినట్లు తెలిపింది. కాగా హిందూస్తాన్ షిప్ యార్డులో ఆగష్టు 1న క్రేన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో పదిమంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. (హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం) ప్రమాదం జరిగిన వెంటనే ఘటన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాల తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. -
హిందూస్థాన్ షిప్‌యార్డ్ మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
-
మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
సాక్షి, విశాఖపట్నం : హిందూస్థాన్ షిప్‌యార్డ్ ప్రమాదంపై యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల సహాయం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అలాగే మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. (చదవండి : కుప్పకూలిన భారీ క్రేన్) కాగా, షిప్ యార్డ్ మృతులకు రూ.50లక్షల పరిహార ప్రకటనపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్దమొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, బద్రీనాథ్, రఘు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ భారీ క్రేన్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. -
ఆ మృతులంతా భాస్కరరావు బంధువులే..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం జలంత్రకోట వద్ద జాతీయరహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను నిన్న(శనివారం) విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు క్రేన్ ప్రమాదంలో చనిపోయిన భాస్కరరావు బంధువులుగా గుర్తించారు. భాస్కరరావు మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన బంధువులు ఖరగ్ పూర్ నుంచి స్కార్పియోలో విశాఖకు బయల్దేరారు. కాగా ఆదివారం తెల్లవారుజామున జలంత్రకోట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. (చదవండి : కుప్పకూలిన భారీ క్రేన్) ఈ ప్రమాదంలో భాస్కరరావు అత్త నాగమణి, ఆమె కోడలు లావణ్య, స్కార్పియో డ్రైవర్ రౌతు ద్వారక మృతి చెందారు. భాస్కరరావు బావమరుదులు రాజశేఖర్, ఢిల్లీశ్వరరావు, నాగమణి పెద్ద కోడలు మైథలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షిప్‌యార్డ్ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో పొదినాను భాస్కరరావు(35) నివాసం ఉంటున్నాడు. లీడ్ ఇంజినీరింగ్ సంస్థలో మూడేళ్లుగా కాంట్రాక్ట్ పద్దతిపై పనిచేస్తున్నాడు. హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో శనివారం భారీ క్రేన్ కూలి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. (చదవండి : ఆ కుటుంబాలను కకావికలం చేసింది..) -
షిప్‌యార్డ్‌లో ప్రమాదంతో రోడ్డున పడ్డ కుటుంబాలు
-
ఆ కుటుంబాలను కకావికలం చేసింది..
పాతపోస్టాఫీసు/మునగపాక/ గోపాలపట్నం/తుమ్మపాల: హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్ కూలిన ఘటన.. 10 మంది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అందమైన జీవితాలు.. ఆనందంగా సాగుతున్న వేళ.. పిడుగులాంటి ఈ వార్త.. ఆ కుటుంబాలను కకావికలం చేసింది. ఎదిగిన పిల్లలను తల్లిదండ్రులకు కాకుండా చేసింది. ముక్కు పచ్చలారని చిన్నారులకు తండ్రి ప్రేమను దూరం చేసింది. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితంలో పెను తుపాను సృష్టించింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారు ఇలా అర్ధాంతరంగా దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. వారిని చూసిన వారు కూడా కన్నీరుమున్నీరయ్యారు. షిప్‌యార్డ్ దుర్ఘటనపై కేసు నమోదు మల్కాపురం (విశాఖ పశ్చిమ): షిప్‌యార్డ్‌లో శనివారం జరిగిన ఘోర ప్రమాదంపై సెక్యూరిటీ ఆఫీసర్ సుశీల్‌కుమార్ మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన అనుపమ క్రేన్ కంపెనీ యజమానిపై, గ్రీన్ ఫీల్డ్ కంపెనీ యజమానిపై సెక్షన్ 304ఏ కేసు నమోదు చేశారు. ఈ కేసు సౌత్ ఏసీపీ టేకు రామ్మోహన్రావు నేతృత్వంలో మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ దర్యప్తు చేస్తున్నారు. చిన్నాన్న వద్దే పెరిగాడు కంచరపాలెం ఊరశ్వి థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న బహదూర్ షా చైతన్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే కోల్పోయారు. చైతన్యకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వీరందరినీ చైతన్య చిన్నాన్న జగన్మోహనరావు తన ఇద్దరు కూతుళ్లతో పాటు పెంచి పెద్ద చేశారు. ఇంటిలో ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో అతని రోదనకు అంతులేకుండా పోయింది.గ్రీన్ఫీల్డ్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. బహదూర్షా చైతన్య (25) మృతుడు ఎవరూ సమాచారం ఇవ్వలేదు చిన్న తనం నుంచి చైతన్యను నేనే పెంచి పెద్ద చేశాను. నా కొడుకు మరణించిన విషయాన్ని టీవీలో చూసి తెలుసుకుని ఇక్కడకు వచ్చాను. షిప్‌యార్డ్ కంపెనీ సిబ్బంది గానీ, నా కొడుకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ సిబ్బంది గానీ సమాచారం ఇవ్వలేదు. ఎదిగిన కొడుకు మరణించడంతో నా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. –జగన్మోహనరావు, చైతన్య చిన్నాన్న ఆరోగ్యం బాగాలేదు.. సెలవు పెడతానన్నారు మృతుడు పీలా శివకుమార్ (35) కాంట్రాక్ట్ లేబర్. ఆయనకు భార్య సుమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెతో పాటు శివకుమార్ సోదరి శ్రీదేవి కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్నారు. భర్త మరణంతో ఇద్దరు పిల్లలతో తాను రోడ్డున పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 16 ఏళ్లుగా కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు.. ఉద్యోగానికి సెలవు పెడతానని చెప్పారు. కానీ తోటి స్నేహితులు ఉద్యోగానికి వెళ్లిపోతున్నారని చెప్పి వెళ్లారని.. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని రోదించారు. గోపాలపట్నంలోని జయప్రకాష్ నగర్లో పిల్లా శివకుమార్ కుటుంబం నివసిస్తోంది. ఆయన మృతి చెందడంతో ఆ కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి. మంచివాడిగా పేరు ఐబీసీ వెంకటరమణ (42) 13 ఏళ్లుగా షిప్‌యార్డ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. మంచివాడన్న పేరు సంపాదించుకున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా గాజువాకలో నివాసం ఉంటున్నారు. టీవీలో చూసి షాక్ అయ్యాను ఎప్పటిలా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం టీవీలో విషయం చూసి సంఘటనా స్థలంలో నా భర్త ఉన్నాడో లేడో తెలుసుకోడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నా బంధువులు మార్చురీ వద్దకు వచ్చి విషయం తెలుసుకుని చెబితే వచ్చాను. – సత్యశ్రీ నాగలక్ష్మి, మృతుడు వెంకటరమణ భార్య విషాదంలో ఉమ్మలాడ ఉమ్మలాడ గ్రామానికి చెందిన మొల్లేటి వెంకట సూర్యనారాయణ, కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సత్యనారాయణ డాక్‌యార్డులో పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు ఎం.ఎన్.వెంకటరావు (35). నాగేశ్వరరావు కూడా అని పిలుస్తుంటారు. ఆరేళ్ల పాటు దుబాయ్‌లో వెల్డర్‌గా పనిచేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాక డాక్‌యార్డులో రెండేళ్ల కిందట వెల్డర్‌గా చేరాడు. ఇటీవలే డాక్‌యార్డులో పని మానేసి.. షిప్‌యార్డ్‌కు కాంట్రాక్ట్ పనులు చేపట్టే గ్రీన్‌ఫీల్డ్ కంపెనీలో చేరాడు. శనివారం జరిగిన ప్రమాదంలో నాగేశ్వరరావు ప్రాణాలు విడిచాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. అందరితో సఖ్యతగా ఉండే నాగేశ్వరరావు మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన నాగేశ్వరరావు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడు నాగేశ్వరరావుకు భార్య లలిత, అయిదేళ్ల దమరుకేష్, మూడేళ్ల శ్రీజలు ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారులను చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఉమ్మలాడ సర్పంచ్ అభ్యర్థి సూరిశెట్టి రామకృష్ణ విషయం తెలిసిన వెంటనే కేజీహెచ్‌కు వెళ్లారు. విషాదవదనంలో కుటుంబసభ్యులు (ఇన్సెట్) క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన నాగేశ్వరరావు కుటుంబం రోడ్డున పడింది షిప్‌యార్డ్ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో పొదినాను భాస్కరరావు(35) నివాసం ఉంటున్నాడు. లీడ్ ఇంజినీరింగ్ సంస్థలో మూడేళ్లుగా కాంట్రాక్ట్ పద్దతిపై పనిచేస్తున్నాడు. భాస్కరరావు మరణంతో ఆ కుంటుంబం రోడ్డున పడింది. – వెంకటేశ్వరరావు, భాస్కరరావు సోదరుడు మిన్నంటిన రోదనలు షిప్‌యార్డ్‌లో జరిగిన ప్రమాదంలో అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన పల్లా నాగదేముళ్లు (35) దుర్మరణం చెందాడు. అందరితో సరదాగా ఉండే నాగు షిప్‌యార్డు ఫిట్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. మృతి చెందాడన్న వార్తతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగుకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో విశాఖలోనే నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు పల్లా సుబ్రహ్మణ్యం, దేముడమ్మతో పాటు సోదరుడు, సోదరి కూండ్రంలోనే ఉంటున్నారు. కుటంబానికి పెద్ద దిక్కుగా ఉండే కుమారుడు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కూండ్రం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఎలా బతుకుతారో.. కంటుముచ్చు సత్తిరాజు (51) గతంలో పని చేసిన ఎండీ సొసైటీ నుంచి ఎల్ సిరీస్ కంపెనీలోకి మారాడు. అతని తండ్రి ప్రమాదవశాత్తూ గతంలో చనిపోతే ఆ ఉద్యోగాన్ని సత్తిరాజుకు ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలతో మల్కాపురంలో కాపురం ఉంటున్నాడు. 30 ఏళ్లుగా కంపెనీలో పనిచేసినా ఏమాత్రం వెనకేయలేదని, రేపటి నుంచి భార్యా బిడ్డలు ఎలా బతుకుతారో అర్థం కావడం లేదని అతని తమ్ముడు లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. షిప్‌యార్డ్ ప్రమాద బాధితులను ఆదుకోండి: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మద్దిలపాలెం(విశాఖ తూర్పు): హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలియగానే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. -
కుప్పకూలిన భారీ క్రేన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ పారిశ్రామిక నగరంలో విషాదం చోటుచేసుకుంది. నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్‌యార్డులో శనివారం ఉ.11.50 గంటలకు భారీ క్రేన్ కుప్పకూలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది విగతజీవులుగా మారారు. 70 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్ శిథిలాల కింద చిక్కుకున్న వీరంతా విలవిల్లాడుతూ మృత్యుఒడిలోకి జారుకున్నారు. షిప్‌యార్డు పూర్తి నిషేధాజ్ఞలున్న ప్రాంతం కావడంతో మృతుల కుటుంబాలను సైతం లోపలికి అనుమతించలేదు. మృతుల్లో నలుగురు షిప్‌యార్డుకి చెందిన రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మిగిలిన వారంతా క్రేన్ నిర్వహణకు సంబంధించి ఏజెన్సీ సిబ్బందిగా గుర్తించారు. ట్రయల్ రన్ జరుగుతుండగా.. భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ భారీ క్రేన్ కుప్పకూలింది. నాలుగేళ్ల క్రితం షిప్‌యార్డు ‘వార్ఫ్/లెవల్ లఫింగ్ క్రేన్’ నిర్మాణానికి ముంబైకి చెందిన అనుపమ్ క్రేన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారీ లిఫ్టింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండేళ్ల క్రితం దీని కమిషనింగ్ పూర్తయింది. అయితే.. ఫుల్ లోడెడ్ ట్రయల్ అప్పట్లో నిర్వహించలేదు. కార్యకలాపాలు ప్రారంభించకుండానే సంస్థతో ఒప్పందం రద్దుచేసుకుంది. అప్పటి నుంచి క్రేన్ జెట్టీలోనే నిలిచిపోయింది. తాజాగా.. ఈ క్రేన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎస్ఎల్ (హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్).. గ్రీన్‌ఫీల్డ్స్ కార్పొరేషన్, లీడ్ ఇంజినీర్స్, క్వాడ్ సెవెన్ సెక్యూరిటీస్ సర్వీసెస్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలకు చెందిన సిబ్బందితో పాటు షిప్‌యార్డు రెగ్యులర్ ఉద్యోగులు మూడ్రోజుల నుంచి క్రేన్ సామర్థ్యానికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువారం 10 టన్నుల బరువు.. శుక్రవారం 20 టన్నుల బరువును లిఫ్ట్చేసేలా ట్రయల్ రన్ చేపట్టారు. ఇక శనివారం 30 టన్నుల సామర్థ్యం ఎత్తేందుకు ప్రయత్నించగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్, బేస్ పోర్షన్లు రెండూ ఒక్కసారిగా విరిగిపోయాయి. ప్రమాద సమయంలో క్రేన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. క్రేన్ శి«థిలాల కింద చిక్కుకున్న మృతదేహాల్ని వెలికితీసేందుకు రక్షణ శాఖ సిబ్బందికి సుమారు రెండు గంటలు పట్టింది. షిప్‌యార్డు 75 ఏళ్ల చరిత్రలో ఈ తరహా ప్రమాదం సంభవించడం ఇదే తొలిసారి అని అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. కాగా, ఘటనపై మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రమాదంపై విచారణకు కమిటీలు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రమాదానికి గల కారణాలు విచారించేందుకు రెండు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. హెచ్ఎస్ఎల్ ఆపరేషనల్ డైరెక్టర్ నేతృత్వంలో ఏడుగురు అధికారులతో కలిసి అంతర్గత కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రభుత్వం తరఫున కూడా హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశారు. దుర్ఘటనపై రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి దుర్ఘటనపై శనివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్విటర్లో దిగ్భ్రాంతి, తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై శాఖాపరమైన దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్షణ చర్యలు తీసుకోండి : సీఎం విశాఖలో క్రేన్ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఘటన వివరాలను తెలుసుకున్న ఆయన తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. మృతులు వీరే.. షిప్‌యార్డు ఉద్యోగులు.. సూపర్వైజర్ దుర్గాప్రసాద్ (32), ఐజీసీ వెంకటరమణ (42), సత్తిరాజు (51), టి. జగన్మోహన్రావు (41). గ్రీన్‌ఫీల్డ్ కార్పొరేషన్ సిబ్బంది.. ఎంఎన్ వెంకట్రావు (35), పీలా శివకుమార్ (35), బి. చైతన్య (25). లీడ్ ఇంజినీర్స్ సంస్థ సిబ్బంది.. పల్లా నాగదేముళ్లు (35), పి.భాస్కరరావు (35). క్వాడ్–7 సంస్థ ఉద్యోగి టి. వెంకటరత్నం (43). ప్రస్తుతం 10 మంది మాత్రమే మృతిచెందినట్లు ఆర్డీవో పెంచల్ కిశోర్ చెప్పారు. శిథిలాలు కింద ఎవరూ లేరనీ.. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లైతే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. క్రేన్ పక్కకి ఒరిగిపోవడంవల్లే.. ప్రమాదంపై హిందూస్థాన్ షిప్‌యార్డు స్పందించింది. ఇది దురదృష్టకరమైన ఘటన అంటూ ప్రకటన విడుదల చేసింది. లోడ్ టెస్టింగ్ సమయంలో క్రేన్ పక్కకి ఒరిగిపోవడంవల్లే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ప్రమాద కారణాలపై విచారణ చేపడుతున్నట్లు షిప్‌యార్డు అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. -
షిప్ యార్డు ప్రమాద ఘటనపై రెండు కమిటీలు
విశాఖపట్నం: హిందూస్తాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుని పదిమంది మృత్యువాత పడ్డారు. శనివారం భారీ క్రేన్ ట్రయల్ నిర్వహిస్తుండగా అది కుప్పకూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముందుగా పదకొండు మంది మృతి చెందినట్టు భావించిన సహాయ సిబ్బంది పూర్తిగా శిధిలాలు తొలగించడంతో 10 మృతదేహాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు వెంకట్రావు, చైతన్య, రమణ, పి.వి. రత్నం, పి నాగ దేవుళ్ళు, సత్తిరాజు, శివ కుమార్, కాకర్ల ప్రసాద్, జగన్, పి భాస్కర్ లుగా గుర్తించారు. (హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం) మృతుల్లో నలుగురు హిందుస్తాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు, ముగ్గురు ఎం ఎస్ గ్రీన్ ఫీల్డ్ ఉద్యోగులు,ఇద్దరు లీడ్ ఇంజినీరింగ్ కంపెనీ ఉద్యోగులు, మరొకరు ఎమ్మెస్ స్క్వాడ్ సెవెన్ కంపెనీ ఉద్యోగి ఉన్నారు. షిప్ యార్డు ప్రమాదంపై మల్కాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. షిప్ యార్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన రెండు కమిటీలు వారం రోజుల్లోగా నివేదికకు ఇవ్వాలని గడువు నిర్దేశించారు. (హిందుస్తాన్ షిప్ యార్డు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా) -
వైరల్ : క్షణాల్లో కుప్పకూలిన భారీ క్రేన్
సాక్షి, విశాఖపట్నం: హిందూస్తాన్ షిప్ యార్డులో శనివారం భారీ క్రేన్ కూప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ కుప్పకూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రేన్ పరిమాణం భారీగా ఉండటం, క్షణాల్లో కుప్పకూలడంతో దాని కింద ఉన్న కార్మికులు తప్పించుకునేందుకు వీలుపడలేదు. కళ్లు మూసి తెరిచేలోపల ఈ ప్రమాదం జరిగిపోయింది. ప్రమాద సమయంలో దాదాపు 18 మంది క్రేన్ కింద ఉన్నట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. (చదవండి : హిందుస్తాన్ షిప్ యార్డు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా) ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీచేశారు. (చదవండి : హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం) -
వైరల్ : క్షణాల్లో కుప్పకూలిన భారీ క్రేన్
-
విశాఖ ఘటన బాధాకరం: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: విశాఖ క్రేన్ కూలిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందుస్థాన్ పిప్యార్డ్ లిమిటెడ్‌లో జరిగిన క్రేన్ ప్రమాద ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ ఘటనలో సహయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం) సిబ్బంది, సందర్శకులు కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు. -
షిప్ యార్డు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, విశాఖపట్నం : హిందుస్తాన్ షిప్ యార్డులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ నుంచి విశాఖకు బయలుదేరారు. కాగా క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో 10 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికుల మృతిపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.(క్రేన్ కూలి 11 మంది కార్మికులు మృతి) -
విశాఖ: హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ప్రమాదం
-
హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: హిందూస్తాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో పదిమంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. ప్రమాద ఘటనపై మంత్రి అవంతి ఆరా.. షిప్‌యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్దరక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు -
స్టీల్ ప్లాంట్‌లో తెగిన క్రేన్,ఇద్దరు మృతి
-
తెగిపడిన క్రేన్ వైర్: ఇద్దరు మృతి
సాక్షి, మెదక్: జిల్లాలోని మనోహరబాద్ మండలం కళ్లకల్ మహాలక్ష్మి స్టీల్ ప్లాంట్‌లో బాయిలర్ క్రేన్ వైర్ తెగిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన మహేష్ యాదవ్, నల్గొండ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ సుమన్ గా గుర్తించారు. సామర్థ్యానికి మించి బరువు వేయడం వల్ల వైర్ తెగిపోయినట్లు సమాచారం. మానవ తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు సుమారు 8 గంటలు శ్రమించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
ఇంకా షాక్‌లోనే ఉన్నా
వారంరోజుల క్రితం ‘ఇండియన్ 2’ సెట్లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ క్రేన్ షూటింగ్ చేస్తున్న యూనిట్‌పై పడటంతో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇది జరిగి వారం అయింది. ‘‘ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను షాక్‌లోనే ఉన్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్, టీమ్‌లో ఇద్దరు చనిపోవడం నన్ను నిద్రలేని రాత్రులకు గురి చేస్తోంది. నేను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నప్పటికీ, ఆ క్రేన్ ఏదో నా మీద పడుంటే బావుండు అనిపిస్తోంది. చనిపోయినవారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను’’ అని బుధవారం ట్వీట్ చేశారు శంకర్. -
షాక్ అయ్యాం
బుధవారం రాత్రి చెన్నైలో ‘ఇండియన్ 2’ సెట్లో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ క్రేన్ కూలిన చుట్టుపక్కలే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తదితర తారాగణం ఉన్నారట. మరోవైపు దర్శకుడు శంకర్ తన టీమ్‌తో మానిటర్లో షాట్ చెక్ చేసుకుంటున్నారట. శంకర్ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి కమల్ స్పందిస్తూ– ‘‘నేను చాలా ప్రమాదాలను చూశాను కానీ ఇది చాలా తీవ్రమైనది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధను వర్ణించలేం’’ అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయిల విరాళం ప్రకటించారాయన. ‘‘ఈ ఘటనకు చాలా షాక్ అయ్యాను. ఇంకా తేరుకోలేకపోతున్నా. అంతా క్షణికంలో జరిగిపోయింది. ఆ ప్రమాదంలో ఏమీ జరగకుండా సురక్షితంగా ఉండి, ఈ ట్వీట్ చేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞురాలిని. ఈ ఘటనతో జీవితం విలువ, సమయం విలువ అర్థం అయింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలనుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు కాజల్. -
కుప్పకూలిన భారీ క్రేన్,డ్రైవర్ మృతి