విద్యార్థి కూరుకుపోయిన బొడుబొడ గెడ్డ
అల్లూరి సీతారామరాజు: గెడ్డలో స్నానానికి దిగిన ఆశ్రమ విద్యార్థి కూరుకుపోయి మృతి చెందిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని గుంటసీమ పంచాయతీ జోగిపుట్టు గ్రామానికి చెందిన బుర్డి సంతోష్ (12) స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భల్లుగుడ వద్ద బొడబొడ గెడ్డ వద్దకు వెళ్లారు. సంతోష్ వారితో కలిసి గెడ్డలోకి స్నానానికి దిగాడు.
లోతులో కూరుకుపోయాడు. మిగతా వారంతా ఆశ్రమ పాఠశాలకు వచ్చేశారు. ఈ విషయాన్ని వారు గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో గెడ్డలో తేలిన విద్యార్థి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పంచాయతీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి వద్ద ఆధారాలను బట్టి ఆశ్రమ విద్యార్థిగా గుర్తించారు. వెంటనే జోగిపుట్టులో ఉన్న విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
వారు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాలకు తీసుకువచ్చి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతదేహాన్ని అరకు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
హెచ్‌ఎం అర్జున్ వివరణ
విద్యార్థి బయటకు వెళ్లిన విషయం తమకు తెలియదనిగిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం అర్జున్ వివరణ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తాను విధులు ముగించుకుని వెళ్లిపోయినట్టు చెప్పారు. విద్యార్థుల అటెండెన్సు తీసుకోవాలని వార్డెన్ రామును ఆదేశించినట్టు ఆయన తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పంచాయతీ కార్యదర్శి విజయ్ సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి తమ ఆశ్రమ విద్యార్థిగా గుర్తించామన్నారు. వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశామని చెప్పారు.
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ: ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు
డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాల విద్యార్థి గెడ్డలో పడి మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు తెలిపారు. విద్యార్థులు పాఠశాల నుంచి ఎప్పుడు, ఎలా బయటకు వెళ్లారనే సమాచారం సేకరిస్తున్నామన్నారు. మంగళవారం రాత్రి భోజన సమయంలో వార్డెన్ హాజరు వేసింది లేనిది కూడా పరిశీలిస్తామని చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: 'అమ్మవారి మాల' తీసి మరీ.. భార్యను కిరాతకంగా..
Comments
Please login to add a commentAdd a comment