ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ‘పల్లా’దే గెలుపు
బంగారు తెలంగాణ సాకారానికి మండలిలో మెజారిటీ ఉండాలి
పట్టభద్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
ఆలేరు: నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రణాళిక ప్రకారం పనిచేస్తే టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు త థ్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. ఆలేరులో ఆదివారం రాత్రి నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామంలో గ్రాడ్యుయేట్లను నేరుగా కలవాలని, ఇందుకు గాను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే శాసనసభలో లాగానే శాసనమండలిలోనూ మెజార్టీ ఉండి తీరాలన్నారు. రాజకీయ స్వాతంత్య్రం సాధించుకున్నామని, ఇదే క్రమంలో ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ టీడీపీ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు మోచేతి నీళ్లు తాగడం బాధాకరమన్నారు.
టీడీపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు. అడుగడుగునా తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడ్డు తగులుతున్నా ఈ ప్రాంత టీడీపీ నాయకులకు బుద్ధిరావడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నా బీజేపీ నాయకులకు పట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనకడుగు వేయడం లేదని తెలిపారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ సాధనలో పట్టభద్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని పలువురు ఘనంగా సన్మానించారు. గొంగిడి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు శ్రావణ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు బొట్ల పరమేశ్వర్, ఎంపీపీలు కాసగల్ల అనసూర్య, గడ్డమీది స్వప్న, న్యాయవాది శీలం అశోక్‌రెడ్డి, నాయకులు ఆకవరం మోహన్‌రావు, పోరెడ్డి శ్రీనివాస్, దాసి సంతోష్, కొరకొప్పుల కిష్టయ్య, గడ్డమీది రవీందర్, సుంకరి సత్యనారాయణ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బండిరాజుల శంకర్, మిట్టపల్లి విజయ్‌కుమార్, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.