Warner Bros.
-
థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ విడుదల
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదిలో తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడంతోపాటు అదే రోజు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ‘వండర్ ఉమెన్’ థియేటర్స్‌లోనూ, హెచ్‌బీఓ మ్యాక్స్‌లోనూ ఒకేరోజు విడుదల కానుంది. అదే పద్ధతిని వచ్చే ఏడాది సినిమాలకు కూడా పాటించనున్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సినిమాను థియేటర్స్‌లోనే ప్రదర్శించాలని అందరికీ ఉంటుంది. కానీ వచ్చే ఏడాది మొత్తం సగం సీటింగ్ కెపాసిటీతోనే థియేటర్స్ నడుస్తాయి. సో... ఏ విధంగా వీలుంటే ఆ విధంగా (ఇంట్లోనో, థియేటర్లోనో) సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది వార్నర్ బ్రదర్స్ విడుదల చేసే సినిమాల్లో ‘డ్యూన్, మ్యాట్రిక్స్ 4, టామ్ అండ్ జెర్రీ, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్, ది కంజ్యూరింగ్, ది సూసైడ్ స్క్వాడ్’ వంటి సినిమాలు ఉన్నాయి. -
బ్యాట్‌మ్యాన్ హీరోకు కరోనా?
హాలీవుడ్ నటుడు, బ్యాట్‌మ్యాన్ హీరో రాబర్ట్ పాటిసన్‌కు కరోనా సోకిందట. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ‘బ్యాట్‌మ్యాన్’ చిత్రీకరణను కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. ఈ విషయం గురించి చిత్రనిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ మాట్లాడుతూ – ‘‘బ్యాట్‌మ్యాన్’ చిత్రబృందంలో ఒక కీలక వ్యక్తికి కరోనా సోకడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అతన్ని ఐసోలేషన్‌లో ఉంచాం. మా చిత్రీకరణను కొన్ని రోజులు నిలిపివేస్తున్నాం’’ అన్నారు. కానీ ఆ కీలక వ్యక్తి ఎవరు అని ప్రకటించలేదు. అయితే కథానాయకుడు రాబర్ట్ పాటిసన్కే కరోనా సోకిందన్నది హాలీవుడ్ మీడియా కథనం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చిత్రీకరణ ప్రారంభం అయిన తొలి చిత్రం ‘బ్యాట్‌మ్యాన్’. మరి.. ఈ యూనిట్లో ఒకరికి కరోనా సోకడంతో మిగిలిన చిత్రబృందాలు వెనకడుగు వేస్తాయా? మరింత జాగ్రత్తలు పాటిస్తాయా? అని హాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. -
బ్యాట్‌మేన్ టీజర్ రెడీ
సూపర్ హీరో బ్యాట్‌మేన్ ని పలు చిత్రాల్లో చూశాం. ఇప్పుడు మరోసారి బ్యాట్మేన్ని చూడబోతున్నాం. ‘బ్యాట్‌మేన్’ టైటిల్‌తో సరికొత్త తరహాలో ఈ చిత్రాన్ని మాట్ రీవెస్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. రాబర్ట్ పాటిన్సన్ బ్యాట్‌మేన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లాక్డౌన్ ముందే ప్రారంభమయింది. లాక్డౌన్ వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించిన తొలి భారీ చిత్రమిదే. ఈ సరికొత్త బ్యాట్‌మేన్ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించడానికి డేట్ సిద్ధం చేసింది చిత్రబృందం. ఈ నెల 22న ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేయనున్నారు. ‘డీసీ ఫ్యాన్డమ్’ అనే ఆన్లైన్ ఈవెంట్ ఒకటి ఆగస్ట్ 22న జరగనుంది. ఈ ఈవెంట్లో ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. -
భవిష్యత్తుని చూపెట్టే టెనెట్
టైమ్ ట్రావెల్ సినిమా అనగానే మన ‘ఆదిత్య 369’ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గుర్తుకు వస్తారు. హాలీవుడ్ సినిమాల్లో టైమ్ ట్రావెల్ అనగానే క్రిస్టోఫర్ నోలన్ గుర్తుకు వస్తారు. ‘మెమెంటో’, ‘బ్యాట్‌మెన్ సిరీస్’లతో పాటు ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్స్టెల్లార్’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిస్టోఫర్. కాగా ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ తదితర చిత్రాల్లో టైమ్ ట్రావెల్ నేపథ్యం ఉంటుంది. దాంతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘టెనెట్’ కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని చాలామంది ఊహించారు. ‘‘ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండదు. అలాగే నా గత కొన్ని చిత్రాల్లోలా ఇందులో నేను ఫిజిక్స్ పాఠం చెప్పటం లేదు. అయితే గతం నుండి భవిష్యత్తుని చూడటం ఈ సినిమాలో ఉంటుంది. కానీ అదొక జర్నీలా ఉండదు. ఇది ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పగలను అన్నారు క్రిస్టోఫర్. తన భార్య ఎమ్మా థామస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు నోలన్. ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలను కుంటోంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ థియేటర్లు రీ ఓపెన్ అవుతాయో అక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. విడుదల తేదీని వాయిదా వేయాలనుకోవడంలేదని హాలీవుడ్ టాక్. -
హాలీవుడ్ మళ్లీ పిలిచింది
హాలీవుడ్ సినిమాల్లో మన ఇండియన్ తారలు అప్పుడప్పుడు మెరుస్తూనేఉన్నారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ ఇలా హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూనే వచ్చారు. ప్రియాంక అయితే ఏకంగా హాలీవుడ్‌కే మకాం మార్చేశారు. తాజాగా సీనియర్ నటి డింపుల్ కపాడియా ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. హాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో డింపుల్ నటించనున్నారు. ఇంగ్లీష్ సినిమాలో నటించడం ఆమెకు ఇది మొదటిసారేం కాదు, ‘లీలా’ (2002) అనే ఆంగ్ల చిత్రంలో ఆల్రెడీ నటించారామె. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే తాజా చిత్రంలో ఆస్కార్ విజేత డేవిడ్ వాషింగ్టన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘టెనిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుమారు ఏడు దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నారట. వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. -
జూలై సెంటిమెంట్
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తదుపరి సినిమా ఏంటా? అని ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నోలన్ ఎప్పటిలానే ఏం చేస్తున్నాడో, ఎవరితో చేస్తున్నాడో అన్న విషయం ఇంకా ప్రకటించలేదు. కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించేశారు. 2020 జూలై 17న నోలన్ కొత్త చిత్రం రాబోతోందని నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ కంపెనీ ప్రకటించింది. నోలన్ రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలను ఈ నిర్మాణ సంస్థే నిర్మించింది. నోలన్ తన సినిమాలను జూన్– జూలై సీజన్లో రిలీజ్ చేయడానికి ఇష్టపడతారు. ఆ సెంటిమెంట్‌నే మళ్లీ రిపీట్ చేశారు. నోలన్ గత ఐదు చిత్రాల్లో 4 సినిమాలు జూలైలో రిలీజ్ కావడం విశేషం. -
ఈ వారం హిట్స్
సూయిసైడల్ స్క్వాడ్ : ట్రైలర్ నిడివి : 2 ని. 31 సె. హిట్స్ : 2,26,64,135 నాలుగు రోజుల్లో రెండు కోట్లు! పెద్ద హిట్టే. నో డౌట్.. సినిమా కూడా హిట్ అయినట్లేనని హాలీవుడ్ క్రిటిక్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న టూడీలో, త్రీ డీలో, ఐమాక్స్ త్రీడీలో విడుదల కాబోతున్న అమెరికన్ సూపర్‌హీరో ఫిల్మ్ ‘సూయిసైడల్ స్క్వాడ్’ ట్రైలర్ ఇది. కథ, దర్శకత్వం డేవిడ్ ఏయర్. డిసి కామిక్స్ ఆధారంగా ఆయన కథ అల్లుకున్నారు. కథేమిటో పూర్తిగా బయటికి రాలేదు కానీ, ప్రభుత్వ సీక్రెట్ ఏజెన్సీ ఒకటి కొంతమంది సూపర్ విలన్లతో ‘సూయిసైడ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అత్యంత ప్రమాదకరమైన పనులను చేయిస్తుంటుంది ఒక గాసిప్. వార్నర్ బ్రదర్స్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నారు. సెలెనా గోమెజ్ : హ్యాండ్స్ టు మైసెల్ఫ్ నిడివి : 3 ని. 47 సె. హిట్స్ : 60,85,799 అమెరికన్ సింగర్ సెలెనా గోమెజ్ రెండో స్డూడియో ఆల్బమ్ ‘రివైవల్’లోని మూడో పాట ‘హ్యాండ్స్ టు మైసెల్ఫ్’ యూట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. అప్లోడ్ అయిన మూడు రోజుల్లోనే హిట్స్ అరవై లక్షలు దాటాయి. అప్‌బీట్‌లో సాగే ఈ డాన్స్, సింథ్పాప్.. సంగీత ప్రియులనే కాకుండా, విమర్శకులనూ ఆకట్టుకుంటోంది. ‘కాంట్ కీప్ మై హ్యాండ్స్ టు మైసెల్ఫ్.. నో మేటర్ హౌ హార్డ్ అయామ్ ట్రయింగ్..’ అంటూ పాట మొదలౌతుంది. పాప్ రూపంలోని మార్ధవ గీతం ఇది. సెలైంట్‌గా మనసును కొల్లగొడుతుంది.. సెలెనా రూపంలాగే! ది ఎమోజీ ఛాలెంజ్ నిడివి : 4 ని. 30 సె. హిట్స్ : 22,77,801 ఇదొక గెస్ గేమ్. ఆడే ఆట కాదు. చూసే ఆట. ప్యూడైపీ అనే స్వీడన్ కమెడియన్ (అసలు పేరు ఫెలిక్స్ అర్విద్ జెల్బర్గ్) తన స్నేహితురాలితో కలిసి ఆడిన ఈమోజీ ప్లే. కొన్ని ఎమోజీలను పక్కపక్కన పెట్టి వాటి అర్థాన్ని ఊహించడం ఇందులోని ఆసక్తికరమైన అంశం. కాస్త కష్టంగా, కాస్త సరదాగా, కొంచెం బ్రెయిన్ టీజర్‌గా, కొంచెం చిలిపిగా ఈ ఆట సాగిపోతుంది. 26 ఏళ్ల ప్యూడైపీ ‘లెటజ్ ప్లే’ పేరుతో యూట్యూబ్‌లో ఇలాంటి గేమ్స్ ఇంకా అనేకం అప్లోడ్ చేశాడు. తెరె బిన్ లాడెన్ : డెడ్ ఆర్ అలైవ్ (ట్రైలర్) నిడివి : 2 ని. 38 సె. హిట్స్ : 15,09,907 నిజ జీవితంలో బిన్ లాడెన్‌ది సీరియస్ క్యారెక్టర్. ‘తెరె బిన్ లాడెన్-డెడ్ ఆర్ ఎలైవ్’ చిత్రంలో మాత్రం అతడిది హ్యూమరస్ క్యారెక్టర్. ఈ ట్రైలర్ చూస్తే కామెడీ ఎంత టెరిఫిక్‌గా ఉంటుందో తెలుస్తుంది! 2010లో వచ్చిన ‘తెరె బిన్ లాడెన్’కి ఈ మూవీ సీక్వెల్. చాలా వరకు అవే పాత్రలు ఉంటాయి. కానీ స్క్రీన్‌ప్లే పాత వాసనలు కనిపించవు. ఒసామా బిన్ లాడన్ని చంపేశామని అమెరికా చెబుతుంటే, కాదు అతడు బతికే ఉన్నాడు అనే వాదన ఒకటి మొదలౌతుంది. ఇంతకీ లాడెన్ బతికే ఉన్నాడా? చనిపోయాడా అనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. దర్శకత్వం అభిషేక్ శర్మ. చిత్రం విడుదల ఫిబ్రవరి 19. -
ఆ నేడు 6 అక్టోబర్, 1927
సినిమా... మాట్లాడింది! కథ, కథనంతో మాత్రమే కాదు...అప్పటి వరకు పరిచయం లేని సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన వార్నర్ బ్రదర్స్ వారి ‘ది జాజ్ సింగర్’ న్యూయార్క్‌లో విడుదలైన రోజు ఇది. సౌండ్-ఆన్-డిస్క్ టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ‘ఫస్ట్ ఫీచర్-లెంగ్త్ టాకింగ్ పిక్చర్’గా చరిత్రకెక్కింది. అల్ జోల్సన్, వార్నర్ ఒలాండ్, బాబీ గోర్డాన్... మొదలైన వారు నటించిన ‘ది జాజ్ సింగర్’కు ఎలెన్ క్రాస్ల్యాండ్ దర్శకత్వం వహించారు. ‘ది జాజ్ సింగర్’ ఘన విజయం ‘సెలైంట్ మోషన్ పిక్చర్’ శకానికి తెర పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఒక నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను బ్రిటిష్ సినీ చరిత్రకారుడు రేచల్ లొ ‘టర్నింగ్ పాయింట్’గా అభివర్ణించారు. ‘అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’ ‘ది బెస్ట్ అమెరికన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్‌టైమ్’లో అగ్రభాగాన నిలిచింది ‘ది జాజ్ సింగర్’.