warplanes bombed
-
Israel-Hamas war: గాజాపై దాడులు... 42 మంది దుర్మరణం
ఖాన్ యూనిస్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. షతీ శరణార్థుల శిబిరం, పొరుగునున్న తుఫాపై శుక్ర, శనివారాల్లో జరిగిన దాడుల్లో కనీసం 42 మంది దుర్మరణం పాలైనట్టు పాలస్తీనా మీడియా విభాగం పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచి గాజాలో మృతుల సంఖ్య 37,500 దాటింది. దాదాపు లక్ష మంది దాకా గాయపడ్డారు’’ అని వివరించింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు పశ్చిమ రఫాలోకి మరింతగా చొచ్చుకొస్తున్నాయి. పైనుంచి యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు, గత అక్టోబర్ నుంచి నిరంతరాయంగా జరుగుతున్న దాడుల దెబ్బకు గాజాలో ఆరోగ్య వ్యవస్థ నేలమట్టమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్త ప్రకటించింది. ‘‘ఇప్పటిదాకా కనీసం 9,300 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బందీలుగా పట్టుకుంది. వారితో అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తోంది’’ అని పాలస్తీనా శనివారం ఆరోపించింది. -
తైవాన్ దిశగా చైనా నౌకలు, యుద్ధ విమానాలు
తైపీ: తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ దేశం చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం, బుధవారం పెద్ద సంఖ్యలో నావికాదళం నౌకలను, ఫైటర్ జెట్లు, బాంబర్లతో కూడిన యుద్ధ విమానాలను తైవాన్ దిశగా పంపించింది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శత్రువుల దండయాత్ర నుంచి తనను తాను కాపాడుకోవడమే లక్ష్యంగా తైవాన్ ప్రతిఏటా నిర్వహించే సైనిక విన్యాసాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తన నౌకలను, యుద్ధ విమానాలను తైవాన్ దిశగా నడిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ 38 యుద్ధ విమానాలను, 9 నౌకలను తైవాన్ వైపు మళ్లించింది. అంతేకాకుండా మరో 30 విమానాలు దూసుకొచ్చాయి. ఇందులో జె–10, జె–16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విమానాలు చైనా–తైవాన్ మధ్య జలసంధిలో అనధికారిక సరిహద్దు అయిన మిడ్లైన్ను దాటి ముందుకెళ్లినట్లు సమాచారం. చైనాకు చెందిన హెచ్–6 బాంబర్లు కూడా దక్షిణ తైవాన్ సమీపంలో సంచరించినట్లు తెలుస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని డ్రాగన్ చెబుతోంది. ఎప్పటికైనా కలిపేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. -
సిరియాలో వైమానిక దాడులు: 45 మంది మృతి
బీరట్: సిరియాపై ఒప్పందానికి రష్యా, అమెరికా అంగీకరించిన ఒక రోజు తరువాత అక్కడి ఓ మార్కెట్, రెబెల్ల అధీనంలోని ఇద్లిబ్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో శనివారం జరిగిన వైమానిక దాడుల్లో 45 మంది చనిపోయారు. మరో 90 మంది గాయపడటానికి కారణమైన ఈ దాడికి పాల్పడింది ఎవరో తెలియరాలేదు. కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోవడంతో మృతుల్లో సాధారణ పౌరులు ఎందరన్నది స్పష్టం కాలేదు. దాడుల్లో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. సిరియాలో సోమవారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమవుతుందని జెనీవాలో చర్చల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం అమలైతే ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాలపై దాడులను ఆపాలి. ఫలితంగా యుద్ధ ప్రభావిత పౌరులకు అవసరమైన సాయం అందుతుందని భావిస్తున్నారు.