water nil
-
కల చెదిరింది !
- వర్షాలు లేక అడుగంటిపోయిన సీజీ ప్రాజెక్టు - మూడేళ్లుగా బీళ్లుగా మారిన 909 ఎకరాలు - వలసలే శరణ్యమంటున్న రైతన్నలు కదిరి: తనకల్లు మండల పరిధిలోని సీజీ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఆయకట్టుకు మూడేళ్లుగా నీటి విడుదల బంద్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు నిండితే 909 ఎకరాలు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగవుతుంది. తవళం, టీ.చదుం, బాలసముద్రం, ముండ్లవారిపల్లి పంచాయితీల పరిధిలోని 60 గ్రామాల రైతులు సీజీ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతూ వచ్చారు. మూడేళ్లుగా వర్షాలు సరిగా లేకపోవడంతో ప్రాజెక్టులో నీరు కరువైంది. 1927 అడుగుల నీటి మట్టం ఉండాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు 15 అడుగులకు పడిపోయింది. ఆ› ప్రాంతంలో సరాసరి వర్షపాతం 18 మిల్లీ మీటర్లు గతంలో నమోదయ్యేది. మూడేళ్లుగా చినుకు జాడలేక కనీస వర్షపాతం కూడా న మోదు కాకపోవడంతో ప్రాజెక్టు కళతప్పింది. కరవుకు అద్దం సాగు సందడితో కళకళలాడాల్సిన భూములు నేడు బీడుగా దర్శనమిస్తున్నాయి. ‘అయ్యా..ఇంతటి కరవు మేమెప్పుడూ చూడలేదు. రైతుకు ఎంత కష్టమొచ్చిందయ్యా..బోర్లన్నీ ఎండిపోయాయి. గతంలో ఎన్ని కరువులొచ్చినా ఎండిపోని బోర్లు ఈ మూడేళ్లలో ఎండిపోయాయి. ఇట్లే ఉంటే ఏం తినాలి..ఎట్లా బతకాలి’ అని కొక్కంటి క్రాస్‌కు చెందిన రైతు ఆదినారాయణ వాపోయాడు. ‘ప్రాజెక్టులో నీళ్లుంటే మండలమంతా పనులుండేవి. ఎవరింట్లో చూసినా ధాన్యానికి కొదవుండేది కాదు. ప్రాజెక్టు గేట్లెత్తి సరిగ్గా మూడేళ్లు దాటిపోయింది. ఈసారి కూడా వాన రాకపోతే గంజి నీళ్లే గతి’ అని టీ. సదుంకు చెందిన రైతు వెంకటరమణ తన గోడు వెల్లబోసుకున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏ రైతును కదిపినా, రైతు కూలీని పలకరించినా కన్నీటి గాథలే విన్పిస్తున్నాయి. నీరు చేరేది ఇలా... పాపాఘ్ని నది కర్ణాటకలోని కోలార్ జిల్లా నందికొండ వద్ద పుట్టి వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. అందులో ఒక చీలిక మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కందుకూరు చెరువులో కలుస్తుంది. అక్కడి మిగులు జలాలు అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో ఉన్న సీజీ ప్రాజెక్టులో కలుస్తాయి. ఈ మిగులు జలాల ఆధారంగానే ఎన్పీ కుంట మండలంలో పెడబల్లి ప్రాజెక్టు నిర్మించారు. ఆ మిగులు జలాలు వైఎస్సార్ జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టుకు చేరతాయి. టీడీపీ నేతల స్వార్థం చిత్తూరు జిల్లా కందుకూరు నుండి వచ్చే జలాలు సీజీ ప్రాజెక్టుకు రాకుండా చిత్తూరు జిల్లాకే పరిమితమయ్యే విధంగా అక్కడి అధికార టీడీపీ నాయకులు చర్యలు తీసుకున్నారు. ఆ జిల్లాలోని కమ్మచెరువుతో పాటు మరో 6 చెరువులకు ఆ నీటిని మళ్లించారు. ప్రస్తుతం కర్ణాటకలోని వందమానేరు నుండి వచ్చే మిగులు జలాలు మాత్రమే సీజీ ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తేగాని సీజీ ప్రాజెక్టుకు నీరు చేరే పరిస్థితి లేదు. మూడేళ్లుగా బీడే – వెంకటనారాయణ, రైతు, బాలసముద్రం ప్రాజెక్టుకింద ఉన్న నా మూడెకరాల పొలం మూడేళ్లుగా బీడుగానే ఉంది. ఒకసారి ప్రాజెక్టులో నీళ్లున్నాయని వరి పంట సాగుచేస్తే తీరా పంట చేతికొచ్చేసరికి ప్రాజెక్టులో నీళ్లు అయిపోయి పంట అంతా ఎండిపోయింది. ఆ తర్వాత ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. నేనే కాదు సుమారు వెయ్యి ఎకరాలు బీళ్లుగా ఉన్నాయి. శని పట్టుకుంది – రైతు బాషుసా»Œ , కొక్కంటి క్రాస్ సీజీ ప్రాజెక్టును 1954లో కట్టారు. 1994 తర్వాత వచ్చిన ఏడేళ్ల వరుస కరవుల్లో తప్ప ప్రాజెక్టులో ఎప్పుడూ నీళ్లుండేవి. ఆ కరవు మళ్లీ ఇప్పుడొచ్చింది. మూడేళ్లుగా మాకే కాదు.. రాష్ట్రమంతా శని పట్టుకుంది. నాకు ప్రాజెక్టు కింద రెండున్నర ఎకరాలు ఉంది. ఇంతకు ముందు బాగా వరి పండేది. ఇప్పుడు అది బీడుగా మారింది. -
ఊరు వలసెళ్లిపోతోంది..
కార్తెలు కరిగినా.. - చెరువుల్లోకి చేరని నీరు - మత్య్సకారుల వలసబాట - పట్టించుకోని ప్రభుత్వం గుమ్మఘట్ట: కరువు ప్రాంతంలో కల్పతరువైన వేదావతి పరివాహక ప్రాంతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటి కార్తెలన్నీ కరిగిపోతున్నా చెరువుల్లో మోకాలిలోతు నీరు చేరని దుస్థితి నెలకొంది. కర్ణాటక సరిహద్దున ఉన్న బీటీ ప్రాజెక్టులోకి సైతం చుక్కనీరు చేరక బీటలు వారింది. నీటి జాడ కనుమరుగై ఎడారిని తలపిస్తున్నాయి. నీటి నమ్ముకున్న మత్స్యకారుల బతుకుబజారుపాలైంది. ఈ దుస్థితి బీటీ ప్రాజెక్టుకే కాదు.. జిల్లాలో ఉన్న పేరూరు, చిత్రావతి, యోగివేమన, పెండేకల్లు, పీఏబీఆర్, మిడ్పెన్నర్ రిజర్వాయర్లకూ పాకింది. అలాగే 325 చెరువల్లోనూ 50 చెరువులకు సైతం అరకొర నీరు చేరలేదు. వీటిపై ప్రత్యేక్షంగా ఆధారపడిన వేలాది మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో వలసబాట పడుతున్నారు. కర్ణాటక రాష్ట్రం దాటుకుంటూ బీటీపీ రిజర్వాయర్ వద్ద తన సంతతి పెంచుకోవడానికి వచ్చిన పక్షులకు నీరు, గూడు, నీడ కరువైంది. ఆహారం దొరక్క పక్షులు అలమటిస్తున్నాయి. ఎండల తీవ్రతకు కొన్ని మృత్యువాత పడగా, మరిన్ని మారెకణం రిజర్వాయర్ వద్దకు తిరుగుముఖం పట్టాయి. ఇక్కడ కనిపిస్తున్న పక్షులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయని పలువురు మత్స్యకారులు చెపుతున్నారు. వలసలు మొదలయ్యాయ్.. : జిల్లా వ్యాప్తంగా లైసెన్సులు కలిగిన మత్స్యకారులు 10 వేల మందికి పైగా ఉండగా, ఇందులో సుమారు నాలుగు వేల మంది వలస వెళ్లి పోయారు. పీఏబీఆర్, మిడ్‌పెన్నార్, చిత్రవతి రిజర్వాయర్లకు తుంగభద్ర జలాలు, జీడిపల్లికి హంద్రీనీవా నీరు అందుతుండటంతో ఆ ప్రాంతాల్లో కొంత పరువాలేదనిపించినా మిగిలిన నాలుగ రిజర్వాయర్లతో పాటు సుమారు 280 చెరువుల పరిధిలో మత్స్య సంపద క్షీణించింది. నీరున్నచోటకెళ్లి అరకొరగా పట్టుకోవడం కన్నా కూలీ పనులు చేసుకోవడమే ఉత్తమమని భావించి హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు వంటి ప్రాంతాలకెళ్లిపోతున్నారు. దీనికి కారణం వర్షాభావంతో పాటు మత్స్య సంపదపై ప్రభుత్వం దృష్టి సారించక పోవడమే అని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్లలో ఇంతటి దుర్భర జీవితాలు అనుభవించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు కిలోల వరకు దిగుబడి సాధించాం జిల్లాలో మరెక్కడా లేనంతగా బీటీపీ రిజర్వాయర్‌లో ఐదు కిలోలకు పైగా చేపను ఉత్పత్తిచేసి విక్రయాలు చేపట్టాం. జిల్లా కేంద్రం నుంచి ఇక్కడి చేపల కొనుగోలుకు వ్యాపారులు క్యూ కట్టేవారు. ఇలాంటి తరుణంలో ప్రకృతి పగబడితే, ఎలాంటి రాయితీలు అందించక ప్రభుత్వం మరోలా దగా చేస్తోంది. మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలి. – వీరభద్ర, మత్స్యకారుడు, కోనాపురం వెయ్యి కుటుంబాలు వీధిన పడ్డాయి బీటీపీ రిజర్వాయర్‌ను నమ్ముకుని సుమారు వెయ్యి కుటుంబాల మత్స్యకారులు జీవనోపాధి పొందేవి. ప్రస్తుతం అడుగంటడంతో వలసలే శరణమయ్యాయి. రెండు రోజుల నుంచి 70 కుటుంబాల వారు వలసలు వెళ్లారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి రిజర్వాయర్ వద్ద చేపలు పట్టి దినకూలీగా బతకాల్సి వచ్చింది. ప్రభుత్వం తమ జీవనోపాధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తగిన ఆర్థిక సహాయంతో తమ కుటుంబాలను ఆదుకోవాలి. – రామంజనేయులు, మత్స్యకారుడు, తాళ్లకెర -
దిష్టిబొమ్మలా ప్రాజెక్టులు
- నీరులేని ముచ్చుకోట, చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌లు - రూ. వందల కోట్ల ప్రభుత్వ సొమ్ము వృథా - నీరిచ్చి ఆదుకోవాలంటున్న ప్రజలు, రైతులు పెద్దపప్పూరు : మండలంలోని మూడు తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌లున్నా ఎలాంటి ప్రయోజనం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. నాయకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో వందలకోట్ల వ్యయంతో నిర్మించిన మూడు తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌లు నీరులేక నిరుపయోగంగా మారాయి. ప్రాజెక్ట్‌లను నీటితో నింపితే పెద్దపప్పూరు మండలంలోని ప్రతి ఎకరా పంట పొలాలతో సస్యశ్యామలం అవుతుంది. 2005లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా మండలంలోని చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను చేపట్టారు. ఇందులో చాగల్లు ప్రాజెక్ట్ పనులు పూర్తవడంతో రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. దాదాపు రూ. 244 కోట్ల వ్యయంతో 1.5 టీఎంసీ కెపాసిటీతో ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్‌ను నీటితో నింపితే దాదాపు 10 గ్రామాలకు సాగు, తాగునీటి సమస్యలు తీరతాయి. ప్రాజెక్ట్ కింద దాదాపు 6 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు 1 ఎకరా ఆయకట్టుకు నీటిని అందించలేని దుస్థితి. రెండోది పెండేకల్లు ప్రాజెక్ట్. మండలంలోని కుమ్మెత వద్ద దీని నిర్మాణం చేపట్టారు. పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. దాదాపు రూ.109 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్ పూర్తయితే పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాలకు తాగు, సాగునీటికి ఉపయోగం. తాడిపత్రి మండలంలో భూసేకరణ పనుల్లో జాప్యం జరగడంతో ప్రధాన కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడోది ముచ్చుకోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి దాదాపు 33 సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో దాదాపు రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు నీటి కేటాయింపులు లేకపోవడంతో రిజర్వాయర్ నిరుపయోగంగా మారింది. రిజర్వాయర్‌కు నీరు చేరితే మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, నామనాంకపల్లి, చిక్కేపల్లితో పాటు పుట్లూరు మండలంలోని రెండు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి సాగునీటికి అనుకూలం అని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయింపులు లేకపోవడంతో మూడు ప్రాజెక్ట్‌లు నిరుపయోగంగా మారాయి. అధికారులు, నాయకులు ప్రాజెక్ట్‌లను నీటితో నింపితే మండలంలోని అన్ని గ్రామాలు పాడిపంటలతో సస్యశ్యామలమవుతాయి. ప్రాజెక్ట్‌లను నింపాలి మండలంలోని చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌లతో పాటు ముచ్చుకోట రిజర్వాయర్‌ను నీటితో నింపాలి. ప్రాజెక్ట్‌లలో నీరు చేరితే అన్ని గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. నీరు లేక వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్‌లు నిరుపయోగంగా మారాయి. నాయకులు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొవాలి. - రఘునాథరెడ్డి, రైతు, పెద్దపప్పూరు