Water reservoirs
-
తాగునీటి తంటాలు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వేసవి దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణకు దిగింది. నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో డెడ్‌స్టోరేజీ వరకు నీటిని పంపింగ్ చేసేందుకు అత్యవసర మోటార్లు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వేసవిలో తాగునీటి డిమాండ్ పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం సరఫరా చేస్తున్న 565 మిలియన్ గ్యాలన్స్ పర్ డే (ఎంజీడీ)లకు తోడు అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లకు సిద్ధమైంది. మహానగరానికి మంచి నీరు అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 516 అడుగులకు చేరింది. నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తుగా మోటార్లను బిగించి అత్యవసర పంపింగ్‌కోసం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ జలాశయంలో మినహా అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని జలమండలి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సగం వాటా కృష్ణా జలాలదే.. మహానగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అవుతున్న తాగునీటిలో సగం వాటా కృష్ణా జలాలదే. నాగార్జున సాగర్ నుంచి నిత్యం 270 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్ సమీపంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి పంప్ హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్‌లోకి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే పరిస్థితి ఉండదు. దీంతో సాగర్ నుంచి కష్ణాజలాల అత్యవసర పంపింగ్ తప్పనిసరి. గత ఐదేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించారు. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహా నగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 565 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103, ఉస్మా¯న్ సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. డెడ్ స్టోరేజీగా హిమాయత్‌సాగర్‌ను ఉంచినప్పటికీ వేసవిలో అవసరాల మేరకు ఈ రిజర్వాయర్ నుంచి పాతనగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి నుంచి తరలిస్తున్న 172 ఎంజీడీలో 40 ఎంజీడీలు మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారు. దానిని సైతం నగరానికి తరలించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు.. వేసవిని దృష్ట్యా డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధమైంది. నగరంలో ఇప్పటికే 72 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిమాండ్‌ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం జలమండలి చర్యలు చేపట్టింది. -
5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితులవల్ల దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు కనిష్టంగా ఉన్న నేపథ్యంలో మే 31 వరకూ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు నిర్వహించనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి మే 31 వరకూ తాగునీటి అవసరాలకు ఎన్ని నీళ్లు అవసరమో అక్టోబర్ 3లోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కోరింది. కమిటీలో సభ్యులందరూ ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యతను బట్టి, రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుని నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డుకు సిఫార్సు చేయడానికి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కృష్ణాబోర్డు ఛైర్మన్ ఏర్పాటుచేశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటిసారిగా జూలైలో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. తాగునీటి అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల నుంచి 12.7 టీఎంసీలను విడుదల చేయాలని సిఫార్సు చేయడంతో ఆ మేరకు నీటి విడుదల ఉత్తర్వులను జూలై 21న కృష్ణా బోర్డు జారీచేసింది. ఆ తర్వాత ఆగస్టు 21, 24న త్రిసభ్య కమిటీ రెండోసారి సమావేశమైంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటినిల్వ తక్కువగా ఉన్న నేపథ్యంలో.. తాగునీటి అవసరాల కోసం నిల్వచేయాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై సంప్రదింపులు జరపకపోవడంతో అప్పట్లో నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణాబోర్డు జారీచేయలేదు. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ దృష్టికి సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తీసుకెళ్లారు. తక్షణమే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించి.. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలను చర్చించి.. నీటి కేటాయింపులకు సిఫార్సు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఆదేశించారు. దాంతో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. -
111 రద్దుపై సుప్రీంకోర్టుకు..!
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చి న జీవో 111ను పూర్తిగా తొలగించడంపై స్వచ్ఛంద సంస్థలు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్‌ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల పర్యావరణ పరిరక్షణ సంస్థలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దూరదృష్టితో జీవో 111ను సమర్థించిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకుండానే ఏ విధమైన అధ్యయనం లేకుండానే జీవోను తొలగించిందన్నారు. జీవో 111పై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పర్యావరణానికి ముప్పు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారు. 1912లో మొదట గండిపేట్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి 1917లో పూర్తి చేశారు. ఆ తరువాత 1921లో హిమాయత్‌సాగర్ నిర్మాణం ప్రారంభించి 1927 నాటికి వినియోగంలోకి తెచ్చారు. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. ‘గోదావరి జలాల వల్ల భూగర్భ నీటిమట్టం పెరగదు. గతంలో నిర్మించిన ఏ ఎస్టీపీలు, రింగ్మెయిన్లు చెరువులను కాపాడలేకపోయాయి. ఇప్పటి కే నగరంలో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూతాపం విపరీతంగా పెరుగుతుంది’అని నిపుణులు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి హాని ఈ జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తివేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది హైదరాబాద్‌ను వరదల బారి నుంచి కాపాడేందుకు అప్పటి నిజాం నవాబు కట్టించిన జంట జలాశయాలు నగరాన్ని భూతా పం నుంచి రక్షిస్తున్నాయి. జీవ వైవిధ్యా న్ని రక్షించుకొనేందుకూ దోహదం చేస్తున్నాయి. జీవో 111ను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. సహజవనదరులను, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమం కాదు. – లూబ్నా సార్వత్, సామాజిక కార్యకర్త సూపర్ ఆర్డర్‌ను ఎలా ధిక్కరిస్తారు ఏ నగరంలో అయినా 20 శాతం నీటి వనరులు ఉండాలి. కానీ హైదరాబాద్‌లో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు కూ డా అలాగే మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సంపన్నులకు కొమ్ముకాసే పాలకులు పర్యావరణాన్ని కాపాడుతారనుకోవడం భ్రమే అవుతుంది. గతంలోనూ జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాం. జీవో 111ను సమర్థిస్తూ 2000 సంవత్సరంలో సుప్రీంకో ర్టు సూపర్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఎలా ధిక్కరిస్తారు. న్యాయనిపుణుల తో చర్చిస్తున్నాం. మరోసారి కోర్టుకెళ్తాం. – ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి -
గంగమ్మకే పెద్దమ్మ.. మన కృష్ణమ్మ!.. దేశంలోనే అగ్రగామిగా..
సాక్షి, అమరావతి: దేశంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా ఉన్న జలాశయాలతో కృష్ణా నది అగ్రగామిగా అవతరించింది. అతి పెద్ద నది అయిన గంగా, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ‘కృష్ణా నది చేరింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతో పాటు అన్ని నదీ పరివాహక ప్రాంతాల(బేసిన్)లో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణా నది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యంలో 19.65 శాతమన్నమాట. అత్యంత దిగువన బ్రహ్మపుత్ర హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగా నది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగా, గోదావరి కంటే కృష్ణా నదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో గంగా, గోదావరి రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదా నది నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నా బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలే కావడం గమనార్హం. -
చెరువులకు శాపం ఇలా.. రక్షణ చర్యలు తీసుకోవాలిలా...
సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారంలా ఉన్న జలాశయాల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో సర్కారు విభాగాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న వందలాది జలాశయాలు కబ్జాలతో కుంచించుకుపోయాయి. మరికొన్నింట గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల వ్యర్థజలాలు చేరి వాటిని కాలుష్య కాసారాలుగా మార్చివేశాయి. ఈ విషయంలో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, పీసీబీ, పరిశ్రమలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర విభాగాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయాల పరిరక్షణ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ పలు సందర్భాల్లో జారీచేసిన మార్గదర్శకాలను సర్కారు యంత్రాంగం అమలు చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. చెరువులకు శాపం ఇలా... ► పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతున్నాయి. దీంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనేఈ దుస్థితి తలెత్తింది. ► గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి. ► చాలా చెరువులు తమ ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కిశల్యమై కనిపిస్తున్నాయి. పైపై మెరుగులకే జీహెచ్ఎంసీ ప్రాధాన్యం ► రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మా త్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీ లో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. రక్షణ చర్యలు తీసుకోవాలిలా... ► చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్భన్‌లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. ► గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. ► జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. ► చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. ► గృహ,వాణిజ్య,పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ► ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. ► అన్యాక్రాంతం కాకుండా ఎఫ్టీఎల్ బౌండరీలు,రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి. జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. ► వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ► జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. ► కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. -
అంగారకుడిపై అతిపెద్ద జలరాశి
న్యూఢిల్లీ: అన్యగ్రహాలపై జీవాన్వేషణలో మరో అడుగు ముందుకు పడింది. అంగారకుడి ఉపరితలం కింద.. పైపొరల్లోనే అతిపెద్ద నీటి సముదాయం ఉన్నట్లు తాజాగా సైంటిస్టులు గుర్తించారు. ఈ రిజర్వాయిర్ దాదాపు హరియాణా రాష్ట్రమంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అంగారకుడి ధృవప్రాంతాల్లోనే నీటి జాడలు(ఐస్ రూపంలో) బయటపడ్డాయి. ప్రస్తుతం అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న టీజీఓ(ద ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్) సదరు గ్రహ మధ్య భాగంలో నూతన నీటి నిల్వలను కనుగొంది. తాజా పరిశోధనతో అంగారకుడి ఇతర ప్రాంతాల్లోనూ నీటి నిల్వలు ఉండే అవకాశాలున్నట్లు గుర్తించారు. విశేషాలు.. ►అంగారకుడిపైన ఉన్న వాలెస్ మెరైనెరిస్ ప్రాంతంలో ఉపరితలం కింద నీరు ఉన్నట్లు గుర్తించింది. ఈప్రాంతంలోని అంగారకుడి మట్టిలో హైడోజ్రన్ పాళ్లను బట్టి టీజీఏ నీటి నిల్వల నిర్ధారణ చేసింది. తాజా రిజర్వాయిర్ 45 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు తెలిసింది. ►నిజానికి అంగారకుడి మధ్య ప్రాంతంలో ఉండే అతి ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడ నీరు, మంచు ఉండే అవకాశం లేదని భావిస్తూ వచ్చారు. అయితే, ఈ ప్రాంతం మట్టిలోని దుమ్ము కణాల్లో ఐస్ ఉన్నట్లు అనుమానించి ఉపరితాలనికి మీటరు లోతున టీజీఓ పరిశోధన జరిపిందని, దీంతో గత పరిశోధనల్లో బయటపడని నీటి నిల్వలు ఇక్కడ బయటపడ్డాయని స్పేస్ సైంటిస్టు ఐగర్ మిత్రోఫనావ్ చెప్పారు. ► టీజీఓలోని ఫ్రెండ్(ఫైన్ రిజల్యూషన్ ఎపిథర్మల్ న్యూట్రాన్ డిటెక్టర్) టెలిస్కోపు సాయంతో నీటి ఆచూకీ కనుగొన్నారు. కొత్తగా బయటపడ్డ జలరాశి దాదాపు నెదర్లాండ్స్ అంత విస్తీర్ణంలో వ్యాపించి ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ► 2018–21 మధ్య టీజీఓ పంపిన పరిశీలనలను సైంటిస్టులు అధ్యయనం చేసి నీటి నిల్వపై నిర్ధారణకు వచ్చారు. ► గెలాక్టిక్ కాస్మిక్ కిరణాలు అంగారకుడిని ఢీకొన్నప్పుడు న్యూట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, తడి నేల కన్నా పొడి నేల నుంచి ఎక్కువ న్యూ ట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, దీన్ని బట్టి ఉపరితలం కింద నీటి పరిమాణాన్ని లెక్కిస్తారని మరో సైంటిస్టు అలెక్సీ మలఖోవ్ తెలిపారు. ► ప్రస్తుతం బయటపడ్డ రిజర్వాయర్‌లో నీరు ద్రవ లేదా ఐస్ స్థితిలో ఉండొచ్చని అంచనా. ఉపరితలంలోని ఇతర మినరల్స్‌తో ఈ నీటి అణువులు రసాయన బంధంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ► త్వరలో అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపే యోచనలో ఉన్న మానవాళికి తాజా వార్త ఆశాజనకంగా ఉంటుందని సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. -
నీరుంది.. లష్కర్లు లేరు !
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల ఆయకట్టు కాల్వలకు నీటి విడుదలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. కాల్వల నీటి నిర్వహణ అంశాన్ని మాత్రం విస్మరిస్తోంది. బ్యారేజీలు, రిజర్వాయర్లు, హెడ్ రెగ్యులేటర్ల పరిధిలోని గేట్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించడంలో చర్యలు తీసుకోవడం లేదు. గోదావరి, కృష్ణా నదులకు వరద పుంజుకునే సమయానికి నిర్వహణ అంశాలన్నింటినీ చక్కబెట్టాలని, అవసరమైన మేరకు లష్కర్లు, ఆపరేటర్లు, ఫిట్లర్లు, ఎలక్ట్రీషియన్లను నియమించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా అడుగు ముందుకు పడటం లేదు. లష్కర్లు లేని కారణంగా నీటినిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఇష్టారీతిగా కాల్వలకు గండ్లు పెడుతుండగా, మరికొన్ని చోట్ల దిగువకు నీరెళ్లకుండా అడ్డుకట్టలు వేస్తున్నారు. ఎదురుచూపులు.. ఎంతకాలం? రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు వరదలు, కాల్వలకు నీళ్లిచ్చే సమయంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, గేటు ఆపరేటర్లు, హెల్పర్లు, ఫిట్టర్, ఎలక్ట్రీíషియన్లు, లష్కర్ల పాత్ర కీలకం. కాల్వల ద్వారా నీటిని విడుదల చేశాక అవి చివరి ఆయకట్టు వరకు వెళ్లాలన్నా, ఎక్కడా కాల్వలు తెగకుండా, గండ్లు పెట్టకుండా చూసే బాధ్యత లష్కర్‌లపైనే ఉంటుంది. రాష్ట్రంలోని నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ సహా సుద్దవాగు, స్వర్ణ, మత్తడివాగు, పాలెంవాగు, తాలిపేరు, కిన్నెరసాని, లంకసాగర్, అలీసాగర్, గుత్పా, జూరాల, సింగూరు, కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో లష్కర్లు, ఇతర సిబ్బంది తగినంతగా లేరు. మెయిన్‌కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతీ 5 కిలోమీటర్లకు ఒక లష్కర్, బ్రాంచ్ కెనాల్ల పరిధిలో ప్రతీ 6 కి.మీ.లకు ఒక లష్కర్ ఉండాలి. కానీ, వారి జాడేలేదు. వీరు లేకుండా నీటి నిర్వహణ అసాధ్యం. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల కింద లష్కర్లు 3,671 మంది అవసరం కాగా కేవలం 1,450 మంది మాత్రమే ఉన్నారు. కనిష్టంగా మరో 2 వేల మందిని నియమించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కాల్వల కింద నీటి నిర్వహణకు 581 మంది లష్కర్లను నియమించాల్సి ఉంది. కనిష్టంగా 50 శాతం మందిని.. అంటే 291 మందినైనా నియమించాలని నీటిపారుదల శాఖ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రాజెక్టుల నుంచి కాల్వలకు నీరు విడుదలవుతున్నా లష్కర్లు లేక నిర్వహణ ఇబ్బందిగా మారింది. కల్వకుర్తి పరిధిలో కొన్నిచోట్ల రైతులు ప్రధాన కాల్వ మీదే క్రాస్ రెగ్యులేటర్‌కు అడ్డుగాషీట్‌లు వేయడంతో పంపులను పూర్తిగా నిలిపివేసి వాటిని తొలగించాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల ప్రధాన కాల్వకే గండిపెట్టి చెరువులకు నీటిని మళ్లిస్తున్నారు. కొన్నిచోట్ల కాల్వలు తెగిపోతుంటే వాటిని ఎవరు చూడాలి, ఎవరు మరమ్మతు చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో నీరందక దిగువ ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. -
కృష్ణా రివర్ నీటి కేటయింపులు
-
కనిపించని జలకళ
సాక్షి, ఖమ్మం : ఈ సీజన్లో జల కళతో ఉండాల్సిన సాగు నీటి రిజర్వాయర్లు, పెద్ద చెరువులు వర్షాభావంతో వట్టికుండలా మారుతున్నాయి. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన ఆయకట్టు భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వర్షం లేకపోవ డంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, పెద్ద చెరువుల్లో రోజురోజుకూ నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో 87,850 ఎకరాల ఆయకట్టు సాగుకు నోచుకోలేదు. చిన్న, మధ్య తరహా చెరువుల్లో నీరు లేకపోవడంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో పాలేరు, వైరా రిజర్వాయర్లు, లంకాసాగర్ ప్రాజెక్టు, 200 పైగా చిన్న, మధ్య తరహా చెరువులు ఉన్నాయి. కాలువ నీటితో వీటిని నింపాల్సి ఉంటుంది. అయితే సాగర్‌లో నీరు లేక ప్రధాన రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం తగ్గింది. మిగతా చిన్న చెరువులు కూడా చాలా వరకు ఎండిపోయాయి. ఇక వర్షాధారంగా నిండే కిన్నెరసాని రిజర్వాయర్‌లో కొంతమేర నీరుంది. బేతుపల్లి, గుమ్మడవల్లి పెద్దవాగు, మూకమామిడి ప్రాజెక్టులు, బయ్యారం పెద్ద చెరువులో నీటి నిలువ గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గింది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిధిలో మొత్తం 87,850 ఎకరాల ఆయకట్టు, నాగార్జునసాగర్ కాలువ పరిధిలో ఉండే చెరువులు, వర్షాధారంగా నిండే రిజర్వాయర్ల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ప్రస్తుతం వీటిలో నీరు లేక ఆ భూములన్నీ బీళ్లుగానే మారాయి. పాలేరు, వైరా, కిన్నెరసానిలో ఉన్న నీటిని ప్రస్తుతం తాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నారు. సాగునీటికి సరిపడేంత నీరు ఈ రిజర్వాయర్లలో లేకపోవడంతో ఏ పంటలు సాగు చేయాలో తెలియక ఆయకట్టు రైతులు అయోమయంలో ఉన్నారు. సాగర్ వస్తేనే పాలేరు, వైరా నిండేది.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండితేనే జిల్లాలోని పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్ల పరిధిలో సాగు నీటికి నీరు విడుదల కానుంది. అప్పటి వరకు రైతులు సాగు కోసం ఎదురు చూడాల్సిందే. ఇక్కడ బోరుబావుల కింద వరినార్లు పోసినా నాట్లకు మాత్రం సాగర్ నీరు రావాల్సిందే. పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 14 అడుగుల నీరు మాత్రమే ఉంది. దీని కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో 20 వేల ఎకరాల ఆయకట్టు సాగు కావాలి. ఇక్కడ ప్రధానంగా వరి, చెరుకు పంటలు సాగు చేస్తారు. అయితే వర్షాభావంతో కనీసం రిజర్వాయర్‌లోకి పై నుంచి వరద నీరు కూడా రాలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటిని ఖమ్మం నగరానికి తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. వైరా రిజర్వాయర్ నీటి నిలువ 18.3 అడుగులు కాగా, ప్రస్తుతం 11.10 అడుగుల నీరుంది. ఈ రిజర్వాయర్ పరిధిలో 17,390 ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి నిలువ తక్కువగా ఉండడంతో ఆయకట్టుకు కాకుండా వైరా, తల్లాడ, కొణిజర్ల, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు మండలాల్లోని గ్రామాలకు తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టులో వరినార్లు పోసిన రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 16 అడుగులు కాగా ప్రస్తుతం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. నీటి నిలువ డెడ్ స్టోరేజీకి చేరడంతో 8 వేల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న నీటిని పెనుబల్లి, వేంసూరు మండలాల్లోని 43 గ్రామాలకు తాగునీటి కోసం సరఫరా చేస్తున్నారు. పరవళ్లు తొక్కని కిన్నెరసాని.. కిన్నెరసాని రిజర్వాయర్ పరిధిలో ఏటా ఈ సీజన్లో 10 వేల ఎకరాాలు సాగవుతుంది. కుడి కాలువ కింద మూడు వేలు, ఎడమ కాలువ కింద 7 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 382 అడుగుల నీరుంది. 400 అడుగుల నీరుంటేనే ఈ రెండు కాలువలకు విడుదల చేస్తారు. పై నుంచి వరద నీరు రాకపోవడంతో రిజర్వాయర్ నిండే పరిస్థితి లేదు. ఉన్న నీటిని కేటీపీఎస్, ఎన్ఎండీసీ, నవభారత్ పరిశ్రమలకు, పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు తాగునీరు విడుదల చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతుపల్లి చెరువు నీటి సామర్థ్యం 16 అడుగులు. కేవలం వర్షాధారంగా నిండే ఈ చెరువు ప్రస్తుత నీటి మట్టం 8 అడుగులు. దీంతో ఈ చెరువు పరిధిలో ఉన్న 6 వేల ఎకరాల ఆయకట్టుకు చుక్కనీరు విడుదల చేయలేదు. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామ సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు 16 వేల ఎకరాలు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా ప్రస్తుతం 14 అడుగులు మాత్రమే ఉంది. గతేడాది ఈ సమయానికి 2 సార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. నీళ్లు తక్కువగా ఉండడంతో ఈ ఖరీఫ్‌లో కనీసం వరినార్లు కూడా పోయలేదు. బయ్యారం పెద్దచెరువు నిండేదెప్పుడు..? గార్ల, బయ్యారం మండలాల్లోని సాగు భూములకు బయ్యారం పెద్దచెరువు నీరే ఆధారం. ఈ చెరువు అలుగు పోస్తేనే నీటిని కిందకు విడుదల చేస్తారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం16.3 అడుగులు కాగా ఇప్పుడు కేవలం 4.1 అడుగులు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే నెలలో చెరువు పూర్తిగా నిండి అలుగుపోసింది. చెరువులోకి నీరు వస్తే పంటలు వేసుకోవచ్చనే ఆశతో గార్ల, బయ్యారం మండలాల్లోని 7,200 ఎకరాల ఆయకట్టును రైతులు దున్ని సిద్ధం చేశారు. ముల్కలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 28 అడుగులు కాగా ప్రస్తుతం 2 అడుగుల మేర నీరుంది. దీని ఆయకట్టు 3,260 ఎకరాలు. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో వర్షాలు ఎప్పుడు పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా రిజర్వాయర్లు, పెద్ద, చిన్న చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో ఈ ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది.