
న్యూఢిల్లీ: అన్యగ్రహాలపై జీవాన్వేషణలో మరో అడుగు ముందుకు పడింది. అంగారకుడి ఉపరితలం కింద.. పైపొరల్లోనే అతిపెద్ద నీటి సముదాయం ఉన్నట్లు తాజాగా సైంటిస్టులు గుర్తించారు. ఈ రిజర్వాయిర్ దాదాపు హరియాణా రాష్ట్రమంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అంగారకుడి ధృవప్రాంతాల్లోనే నీటి జాడలు(ఐస్ రూపంలో) బయటపడ్డాయి. ప్రస్తుతం అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న టీజీఓ(ద ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్) సదరు గ్రహ మధ్య భాగంలో నూతన నీటి నిల్వలను కనుగొంది. తాజా పరిశోధనతో అంగారకుడి ఇతర ప్రాంతాల్లోనూ నీటి నిల్వలు ఉండే అవకాశాలున్నట్లు గుర్తించారు.
విశేషాలు..
►అంగారకుడిపైన ఉన్న వాలెస్ మెరైనెరిస్ ప్రాంతంలో ఉపరితలం కింద నీరు ఉన్నట్లు గుర్తించింది. ఈప్రాంతంలోని అంగారకుడి మట్టిలో హైడోజ్రన్ పాళ్లను బట్టి టీజీఏ నీటి నిల్వల నిర్ధారణ చేసింది. తాజా రిజర్వాయిర్ 45 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు తెలిసింది.
►నిజానికి అంగారకుడి మధ్య ప్రాంతంలో ఉండే అతి ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడ నీరు, మంచు ఉండే అవకాశం లేదని భావిస్తూ వచ్చారు. అయితే, ఈ ప్రాంతం మట్టిలోని దుమ్ము కణాల్లో ఐస్ ఉన్నట్లు అనుమానించి ఉపరితాలనికి మీటరు లోతున టీజీఓ పరిశోధన జరిపిందని, దీంతో గత పరిశోధనల్లో బయటపడని నీటి నిల్వలు ఇక్కడ బయటపడ్డాయని స్పేస్ సైంటిస్టు ఐగర్ మిత్రోఫనావ్ చెప్పారు.
► టీజీఓలోని ఫ్రెండ్(ఫైన్ రిజల్యూషన్ ఎపిథర్మల్ న్యూట్రాన్ డిటెక్టర్) టెలిస్కోపు సాయంతో నీటి ఆచూకీ కనుగొన్నారు. కొత్తగా బయటపడ్డ జలరాశి దాదాపు నెదర్లాండ్స్ అంత విస్తీర్ణంలో వ్యాపించి ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.
► 2018–21 మధ్య టీజీఓ పంపిన పరిశీలనలను సైంటిస్టులు అధ్యయనం చేసి నీటి నిల్వపై నిర్ధారణకు వచ్చారు.
► గెలాక్టిక్ కాస్మిక్ కిరణాలు అంగారకుడిని ఢీకొన్నప్పుడు న్యూట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, తడి నేల కన్నా పొడి నేల నుంచి ఎక్కువ న్యూ ట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, దీన్ని బట్టి ఉపరితలం కింద నీటి పరిమాణాన్ని లెక్కిస్తారని మరో సైంటిస్టు అలెక్సీ మలఖోవ్ తెలిపారు.
► ప్రస్తుతం బయటపడ్డ రిజర్వాయర్‌లో నీరు ద్రవ లేదా ఐస్ స్థితిలో ఉండొచ్చని అంచనా. ఉపరితలంలోని ఇతర మినరల్స్‌తో ఈ నీటి అణువులు రసాయన బంధంలో ఉన్నట్లు భావిస్తున్నారు.
► త్వరలో అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపే యోచనలో ఉన్న మానవాళికి తాజా వార్త ఆశాజనకంగా ఉంటుందని సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు.