సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల ఆయకట్టు కాల్వలకు నీటి విడుదలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. కాల్వల నీటి నిర్వహణ అంశాన్ని మాత్రం విస్మరిస్తోంది. బ్యారేజీలు, రిజర్వాయర్లు, హెడ్ రెగ్యులేటర్ల పరిధిలోని గేట్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించడంలో చర్యలు తీసుకోవడం లేదు. గోదావరి, కృష్ణా నదులకు వరద పుంజుకునే సమయానికి నిర్వహణ అంశాలన్నింటినీ చక్కబెట్టాలని, అవసరమైన మేరకు లష్కర్లు, ఆపరేటర్లు, ఫిట్లర్లు, ఎలక్ట్రీషియన్లను నియమించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా అడుగు ముందుకు పడటం లేదు. లష్కర్‌లు లేని కారణంగా నీటినిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఇష్టారీతిగా కాల్వలకు గండ్లు పెడుతుండగా, మరికొన్ని చోట్ల దిగువకు నీరెళ్లకుండా అడ్డుకట్టలు వేస్తున్నారు.
ఎదురుచూపులు.. ఎంతకాలం?
రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు వరదలు, కాల్వలకు నీళ్లిచ్చే సమయంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, గేటు ఆపరేటర్లు, హెల్పర్లు, ఫిట్టర్, ఎలక్ట్రీíషియన్లు, లష్కర్‌ల పాత్ర కీలకం. కాల్వల ద్వారా నీటిని విడుదల చేశాక అవి చివరి ఆయకట్టు వరకు వెళ్లాలన్నా, ఎక్కడా కాల్వలు తెగకుండా, గండ్లు పెట్టకుండా చూసే బాధ్యత లష్కర్‌లపైనే ఉంటుంది. రాష్ట్రంలోని నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ సహా సుద్దవాగు, స్వర్ణ, మత్తడివాగు, పాలెంవాగు, తాలిపేరు, కిన్నెరసాని, లంకసాగర్, అలీసాగర్, గుత్పా, జూరాల, సింగూరు, కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో లష్కర్‌లు, ఇతర సిబ్బంది తగినంతగా లేరు. మెయిన్‌కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతీ 5 కిలోమీటర్లకు ఒక లష్కర్, బ్రాంచ్ కెనాల్‌ల పరిధిలో ప్రతీ 6 కి.మీ.లకు ఒక లష్కర్ ఉండాలి. కానీ, వారి జాడేలేదు.
వీరు లేకుండా నీటి నిర్వహణ అసాధ్యం. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల కింద లష్కర్‌లు 3,671 మంది అవసరం కాగా కేవలం 1,450 మంది మాత్రమే ఉన్నారు. కనిష్టంగా మరో 2 వేల మందిని నియమించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కాల్వల కింద నీటి నిర్వహణకు 581 మంది లష్కర్‌లను నియమించాల్సి ఉంది. కనిష్టంగా 50 శాతం మందిని.. అంటే 291 మందినైనా నియమించాలని నీటిపారుదల శాఖ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రాజెక్టుల నుంచి కాల్వలకు నీరు విడుదలవుతున్నా లష్కర్‌లు లేక నిర్వహణ ఇబ్బందిగా మారింది. కల్వకుర్తి పరిధిలో కొన్నిచోట్ల రైతులు ప్రధాన కాల్వ మీదే క్రాస్ రెగ్యులేటర్‌కు అడ్డుగాషీట్‌లు వేయడంతో పంపులను పూర్తిగా నిలిపివేసి వాటిని తొలగించాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల ప్రధాన కాల్వకే గండిపెట్టి చెరువులకు నీటిని మళ్లిస్తున్నారు. కొన్నిచోట్ల కాల్వలు తెగిపోతుంటే వాటిని ఎవరు చూడాలి, ఎవరు మరమ్మతు చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో నీరందక దిగువ ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment