water resources ministry
-
జన భాగస్వామ్యంతోనే జల సంరక్షణ
న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వం తీసుకొనే చర్యలే సరిపోవని, ప్రజలందరి భాగసామ్యంతోనే అది సాధ్యమవుతుందని, ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జల సంరక్షణ ఉద్యమంతో అనుసంధానమైతేనే ప్రజలకు ఇందులోని తీవ్రత, ప్రాధాన్యం తెలుస్తుందని అన్నారు. కార్యక్రమ ఉద్దేశం అర్థమైతే వారు దాన్ని సొంతం చేసుకుంటారని తెలిపారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల తొలి జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్యానికి నీరు ఒక కీలకాంశం కావాలని చెప్పారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి పంపకాలపై ముందుగానే దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మధ్య నడుమ దశాబ్దాలుగా జల వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వాటర్ విజన్–2047’ మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం జలం అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. మనం నిర్దేశించుకున్న సమ్మిళిత లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 25 ఏళ్లలో సాగించబోయే ‘అమృతకాల’ ప్రయాణంలో ‘వాటర్ విజన్–2047’ అనేది అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ శాతం పనులు జల సంరక్షణ దిశగానే జరగాలని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. ప్రజలతోపాటు సామాజిక సంస్థలు, పౌర సంస్థలు సైతం జల సంరక్షణ ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం అంటే దాని అర్థం ప్రభుత్వపరంగా పారదర్శకత తగ్గించడం కాదన్నారు. అలాగే మొత్తం బాధ్యతను ప్రజలపై మోపడం కాదని తేల్చిచెప్పారు. జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో అమృత సరోవరాలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇప్పటికే 25,000 సరోవరాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి సరోవరం కనీసం ఎకరం వైశాల్యంలో ఉంటుందని, ఇందులో 10,000 క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయొచ్చని అన్నారు. జల సంరక్షణకు జియో–సెన్సింగ్, జియో–మ్యాపింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు వాడుకోవాలని సూచించారు. టెక్నాలజీ–పరిశ్రమలు–స్టార్టప్‌లను అనుసంధాస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. నమామి గంగా మిషన్ తరహాలో నదుల ప్రక్షాళనకు రాష్ట్రాలు సైతం నడుం బిగించాలని ప్రధానమంత్రి విన్నవించారు. నదుల, జల వనరులను కాపాడుకోవాలన్నారు. ప్రతి రాష్ట్రంలో చెత్త నిర్మూలన, మురుగునీటి శుద్ధి కోసం నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తాజా నీటిని సంరక్షించుకోవడం, మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడం పర్యావరణానికి చాలా మేలు చేస్తుందని వివరించారు. ‘ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీమ్’ కింద 70 లక్షల హెక్టార్లకుపైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. -
అద్భుతమైన క్యాచ్ అందుకున్న ధోని..
సాక్షి, న్యూఢిల్లీ: జీవరాశి మనగడకు జలమే ఆధారం.. నీరే ప్రాణధారం.. అది అమృత తుల్యం. విలువైన నీటిని తెలిసే కొందరు, తెలియక మరికొందరు వృథా చేస్తుంటారు. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నపుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చిన్నారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం, గోడల మీద పెయింటింగ్‌లు వేయడం ద్వారా ప్రచారం కల్పిస్తున్నాయి. అలా ప్రతి నీటి బొట్టు ప్రాముఖ్యతను ఆకర్షణీయంగా తెలియజేసేలా జోద్‌పుర్‌లోని గోడల మీద వేసినదే ఈ పెయింటింగ్. క్రికెట్లో వికెట్ కీపర్‌గా అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్న మహేంద్రసింగ్ ధోని.. కుళాయి నుంచి జారుతున్న నీటి బొట్టును ఒడిసిపట్టుకొనేందుకు డైవ్ చేస్తున్నట్లుగా వేసిన ఈ సృజనాత్మక చిత్రానికి ఆలస్యం కాకముందే ఒడిసిపట్టుకో.. అంటూ సందేశాన్ని జోడించారు. ఈ చిత్రాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. -
‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ
-
‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ
సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో ఏర్పాటు ► ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర జల వనరుల శాఖ ► గతంలో రాష్ట్రం అభ్యంతరం తెలిపిన సభ్యుల తొలగింపు ► ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి, గోదావరి నుంచి కృష్ణాకు నీటి తరలింపు అంశాలపై అధ్యయనం ► 90 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కృష్ణా జలాల నిర్వహణ ఎలా ఉండాలో తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిం చింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ చైర్మన్ గా సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు ఎం.గోపాలకృష్ణన్, రూర్కీ సైంటిస్ట్ డాక్టర్ ఆర్పీ పాండే, చీఫ్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ శుక్లా, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్ ఎన్ఎన్ రాయ్ సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీ మనోజ్ శర్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమావళి, మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు, గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్–1980కి అనుగుణంగా గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై అధ్యయనం చేస్తుంది. ఈ అంశాలపై అధ్యయనం చేసి అందించే నివేదిక, సూచించే విధానానికి అనుగుణంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నడుచుకోనుంది. ఈ కమిటీ తన నివేదికను 90 రోజుల్లో కేంద్ర జల వనరుల శాఖకు అందించాల్సి ఉంటుంది. కమిటీ అధ్యయనానికి అవసరమైన సంపూర్ణ సహకారం, సమాచారాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సి ఉంటుంది. కమిటీ అవసరమనుకుంటే సీడబ్ల్యూసీ, ఇతర రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీల సహకారాన్ని సైతం తీసుకుంటుంది. ఆ సభ్యుల తొలగింపు.. నిజానికి కృష్ణా జలాల వివాద పరిష్కారానికి కమిటీని నియమిస్తామని జూన్ 21, 22 తేదీల్లో జరిగిన కేంద్ర జల వనరుల శాఖ సమావేశంలోనే నిర్ణయం జరిగింది. దీనికి అనుగుణంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ మొహిలే అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలోని ఇద్దరు సభ్యులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. గత కమిటీలో ఉన్న మొహిలే రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో జల వనరుల అంశానికి టెక్నికల్ మెంబర్‌గా పని చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఏకపక్షం గా ఉందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఇక మరో సభ్యుడిగా ఉన్న ఎంకే గోయల్ రూర్కీ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో శాస్తవేత్తగా ఉంటూ, కృష్ణా బేసిన్ లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీలో పని చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలం గాణకు సంబంధం లేని తటస్థ నిపుణులతో కమిటీని వేయాలని తెలంగాణ సూచించగా, అందుకు అనుగుణంగానే కేంద్రం నిర్ణయం చేసింది. -
జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల కోత
న్యూఢిల్లీ: బడ్జెట్లో జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల్లో భారీ కోత పడింది. ఈ శాఖకు ప్రస్తుత బడ్జెట్లో రూ.4.232.43 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో సింహభాగం నిధులను మోదీ ప్రభుత్వ మానస ప్రాజెక్టు అయిన ‘గంగా నది ప్రక్షాళన’కు ఇవ్వడం విశేషం. గంగానది ప్రక్షాళన ప్రణాళికకు రూ.2,100 కోట్లు కేటాయించారు. 2014-15కు సంబంధించిన సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.600 కోట్లు అదనం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోసం రూ.100 కోట్ల నిధులను కేటాయించారు. నదుల అనుసంధానంపై సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పనకు రూ.100 కోట్లు కేటాయించారు.