
సాక్షి, న్యూఢిల్లీ: జీవరాశి మనగడకు జలమే ఆధారం.. నీరే ప్రాణధారం.. అది అమృత తుల్యం. విలువైన నీటిని తెలిసే కొందరు, తెలియక మరికొందరు వృథా చేస్తుంటారు. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నపుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చిన్నారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం, గోడల మీద పెయింటింగ్‌లు వేయడం ద్వారా ప్రచారం కల్పిస్తున్నాయి.
అలా ప్రతి నీటి బొట్టు ప్రాముఖ్యతను ఆకర్షణీయంగా తెలియజేసేలా జోద్‌పుర్‌లోని గోడల మీద వేసినదే ఈ పెయింటింగ్. క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్న మహేంద్రసింగ్ ధోని.. కుళాయి నుంచి జారుతున్న నీటి బొట్టును ఒడిసిపట్టుకొనేందుకు డైవ్ చేస్తున్నట్లుగా వేసిన ఈ సృజనాత్మక చిత్రానికి ఆలస్యం కాకముందే ఒడిసిపట్టుకో.. అంటూ సందేశాన్ని జోడించారు. ఈ చిత్రాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment