కళ్లు తెరిచి.. నీళ్లు ఒడిసి పట్టి..!
♦ కరువుతో మేల్కొన్న దక్షిణ మధ్య రైల్వే
♦ నీటి పునర్వినియోగంపై దృష్టి
♦ సికింద్రాబాద్‌లో రోజుకు రెండున్నర లక్షల లీటర్ల రీసైక్లింగ్
♦ త్వరలో నాంపల్లి, విజయవాడ, తిరుపతి, వరంగల్‌లో రీసైక్లింగ్
సాక్షి, హైదరాబాద్: నీటిఎద్దడిపై దక్షిణ మధ్య రైల్వే కళ్లు తెరిచింది. కరువును ఎదుర్కొనేందుకు నడుంబిగించింది. నీటి వృథాను అరికట్టడంపై దృష్టి సారించింది. అనుకున్నదే తడవుగా దానికి శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌లో గరిష్ట సామర్థ్యంతో నీటి పునర్వినియోగాన్ని ప్రారంభించటమే కాకుండా హైదరాబాద్ , విజయవాడ, తిరుపతి, వరంగల్ స్టేషన్లలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు పనులు ప్రారంభించింది. రైళ్ల నిర్వహణలో నీటి ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ప్రయాణికుల అవసరాలు, బోగీల శుభ్రతకు భారీ పరిమాణంలో నీటిని వినియోగిస్తుంటారు. సికింద్రాబాద్ స్టేషన్లో నిత్యం 35 లక్షల లీటర్ల నీటి వినియోగం ఉంటుంది. ప్రయాణికుల అవసరాలకు 25 లక్షల లీటర్లు, స్టేషన్లో తాగునీటి కోసం 9 లక్షల లీటర్లు, బోగీలను శుభ్రం చేయడానికి, ట్రాక్ క్లీనింగ్, స్టేషన్ ఫ్లోర్ కడగటానికి మిగతా నీరు ఖర్చవుతోంది. కోచ్‌లు, స్టేషన్ ఫ్లోర్లు కడిగేందుకు వాడే నీళ్లు వృథాగా డ్రైనేజీ పాలవుతున్నాయి. గతంలోనే సికింద్రాబాద్ స్టేషన్లో వాటర్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటైనా దాని వినియోగం అంతంత మాత్రమే. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా ఆదేశంతో దాన్ని గరిష్టస్థాయిలో వినియోగించటం ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు రెండున్నర లక్షల లీటర్ల నీటిని ఈ ప్లాంటుకు తరలించి రీసైకిల్ చేసి తిరిగి వినియోగిస్తున్నారు. కోచ్‌లలోకి నీటిని నింపే సమయంలో కొంత నీరు కారిపోతుంది. ఫ్లోర్ కడిగినప్పుడు ఆ నీళ్లు డ్రైనేజీలోకి చేరుతుంది. రైలు కోచ్‌లను శుభ్రపరిచినప్పుడూ ఆ నీరంతా నేల పాలవుతుంది. ఇప్పుడు ఈ మూడు రకాల వృథాను ప్రత్యేక కాలువల ద్వారా ఈ రీసైక్లింగ్ యూనిట్‌కు చేరుస్తున్నారు. రీసైకిల్ చేసి రోజుకు రెండున్నరలక్షల లీటర్ల నీటిని మళ్లీ కోచ్‌లను, ఫ్లోరింగ్‌ను, పట్టాలను శుభ్రపరచటంతోపాటు మొక్కలకు వాడుతున్నారు.
త్వరలో మిగతా చోట్ల...
విజయవాడలో రోజుకు 40 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇక్కడ రోజుకు దాదాపు మూడున్నర లక్షలు, తిరుపతిలో లక్షన్నర, నాంపల్లిలో లక్ష లీటర్ల నీళ్లు వృథా అవుతున్నాయి. ఈ మూడు స్టేషన్లలో త్వరలోనే రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిం దిగా జీఎం ఆదేశించారు. వరంగల్, కాజీపేట స్టేషన్లలో కూడా వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొనటంతో కొత్త యూనిట్ల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు.
రీసైక్లింగ్ ఇలా...
రీసైక్లింగ్ యూనిట్‌కు చేరిన నీటి నుంచి తొలుత వ్యర్థాలను తొలగిస్తారు, ఆ తర్వాత గ్రీజ్, చమురు వ్యర్థాలను వేరు చేస్తారు. అనంతరం దుర్వాసన, మలినాలను తొలగిస్తారు. అనంతరం నీటిని క్లోరినేషన్ చేస్తారు. దానికి ఆలం చేరుస్తారు. అనంతరం దాన్ని ప్రత్యేక ఇసుక ఫిల్టర్ల ద్వారా పంపి శుభ్రపరుస్తారు. దాన్ని కార్బన్ ఫిల్టర్లతో మరోసారి శుద్ధి చేస్తారు.