పింఛన్.. టెన్షన్
సాక్షి, ఖమ్మం: పింఛన్ అందుతుందో లేదో తెలియక లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో పింఛన్ల (ఆసరా) పథకం కింద 3.17 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 90వేల పై చిలుకు దరఖాస్తులు అర్హత లేనివిగా అధికారులు తిరస్కరించారు. ఈ పరిస్థితులతో అర్హులైనవారు తమకు అర్హత కల్పించాలని డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖమ్మం నగరానికి సంబంధించి వేలాది మంది మళ్లీ దరఖాస్తులు పట్టుకొని ఇటీవల పరిశీలన చేసిన భక్తరామదాసు కళాక్షేత్రం వద్దకు వెళ్లి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు.
అక్కడ వారికి సమాధానం చెప్పేవారే లేకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదనతో వెనుదిరిగి పోతున్నారు. దరఖాస్తుల స్వీకరణ.. ఆతర్వాత పరిశీలన దాదాపు పూర్తి కావచ్చింది. ఇక్కడికి ఎవరైనా వెళ్తే కార్పొరేషన్ లేదా, డీఆర్డీఏకు వెళ్లండంటూ అక్కడ ఉండే ఒక్కరిద్దరూ కింది స్థాయి సిబ్బంది సమాధానం చెబుతున్నారు.
పీడీ అక్కడ..ఇక్కడ..
జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాస్నాయక్కు పీడీ బాధ్యతలు అప్పగించడంతో ఆయన అక్కడ.. ఇక్కడ విధులు నిర్వహించడం భారంగా మారింది. పింఛన్ల మంజూరు, నూతనంగా అమల్లోకి తెస్తున్న కల్యాణలక్ష్మి అన్నీ డీఆర్డీఏ పరిధిలోకి రావడంతో ఈ శాఖ అధికారులు హైరానా పడుతున్నారు. దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో అర్జీలు పెట్టుకున్న వారికి లేఖలు రాయాలని ప్రభుత్వం తాజాగా అధికారులను ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు తలపట్టుకుంటున్నారు.
ఇక కార్పొరేషన్ కమిషనర్గా మెప్మా పీడీ వేణుమనోహర్రావుకు బాధ్యతలు అప్పగించారు. పింఛన్ దరఖాస్తులకు సంబంధించి ఇప్పటివరకు సిబ్బంది తమ ఇళ్ల వద్దకు పరిశీలనకు రాలేదని, తమకు పింఛన్ రాదా..? అంటూ చాలా మంది ప్రతిరోజూ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నా.. అధికారులు మాత్రం భక్తరామదాసు కళాక్షేత్రానికి వెళ్లండంటూ సమాధానం చెబుతున్నారే తప్పా.. ఇలా వచ్చే ఫిర్యాదులను మాత్రం కార్పొరేషన్లో నమోదు చేసుకోవడం లేదు.
దీంతో ఇక్కడి వచ్చే వారంతా అటు భక్తరామదాసు కళాక్షేత్రం బాటపడుతున్నారు. అక్కడ కింది స్థాయి సిబ్బంది ఇచ్చే సమాచారంతో ఇతర శాఖల అధికారుల కోసం పడిగాపులుగాస్తున్నారు. ఇవే ఇలా ఉంటే కల్యాణలక్ష్మీ పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పూర్తి స్థాయి అధికారులు లేకపోతే ఇది కూడా పింఛన్ల దరఖాస్తుల మాదిరిగా ప్రహాసనంగా మారనుంది.