ఇక స్టీరింగ్ లేని బస్సులు!
వాగానింజన్: రోడ్లపైకి డ్రైవర్ లేని బస్సులు రాబోతున్నాయి. స్టీరింగ్ లేని బస్సులు వాటంతట అవే ప్రయాణికులను తీసుకొని వెళ్లి వారి గమ్య స్థానాలకు చేర్చనున్నాయి. నెదర్లాండ్స్‌లోని వాగానింజన్ పట్టణంలో శుక్రవారం ప్రయోగాత్మకంగా ఈ బస్సులను నడుపుతున్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ తరహా ప్రయాణికులను చేరవేసే డ్రైవర్ లెస్ బస్సులను ప్రవేశపెడుతున్న దేశంగా నెదర్లాండ్స్ రికార్డు సృష్టిస్తోంది.
ప్రయాణికులు వచ్చి కూర్చోగానే వాటంతట అవే వెళ్లే విపాడ్ పబ్లిక్ షెటిల్ సర్వీస్‌లను ఆరుగురు ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా రూపొందించారు. ఇవి గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. రోడ్లపై సమీపంలో ఉన్న ఇతర వాహనాలు, పరిసరాలను గుర్తించడానికి ఈ ఎలక్ట్రిక్ బస్సులు అత్యాధునిక కెమేరాలు, రాడార్, లేజర్ సెన్సార్లను ఉపయోగించుకుంటాయి. బస్సులోని ఆన్ బోర్డ్ కంప్యూటర్ క్యాబిన్ బ్రేకులను నియంత్రిస్తుంది. విపాడ్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు అవసరమైతే అందులో నుండే కంట్రోల్ రూం ను కాంటాక్ట్ చేసే సౌకర్యం కల్పించారు.
విపాడ్ సర్వీస్ పై అక్కడి అధికారి ఐరిస్ ఇవాన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా డ్రైవర్ లెస్ వాహనాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మొట్టమొదటిసారిగా వీటిని మేం ప్రవేశపెడుతున్నాం అని తెలిపారు. రాబోయే నెలల్లో ఈ బస్సులను విస్తరించనున్నట్లు ఇవాన్ వెల్లడించారు.