white collar crime
-
రూ. 9675,67,35,596
సాక్షి, హైదరాబాద్: రూ. పదుల కోట్లు.. రూ. వందల కోట్లు కూడా కాదు... రూ. 9675,67,35,596! భాగ్యనగరంలో వైట్ కాలర్ కేటుగాళ్లు బాధితుల నుంచి ఈ ఏడాది కొల్లగొట్టిన సొమ్ము విలువ ఇది!! హైదరాబాద్ నగర పోలీసు విభాగం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2023కుగాను విడుదల చేసిన వివిధ నేరాల వార్షిక నివేదికలో వైట్ కాలర్ నేరాల కేసులకు సంబంధించి ఈ ఆశ్చర్యకర గణాంకాలున్నాయి. బుధవారం వరకు నమోదైన కేసులు, లెక్కల ప్రకారం చూస్తే నేరాల్లో ప్రజలు కోల్పోయిన మొత్తం రూ. 9714,05,44,337గా ఉంది. ఇందులో వైట్ కాలర్ అఫెండర్స్‌గా పిలిచే మోసగాళ్లు, ఆర్థిక నేరగాళ్లు స్వాహా చేసిన మొత్తం రూ. 9675,67,35,596 (99.6 శాతం)గా తేలింది. కారణాలు అనేకం... శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ... ఇదీ వైట్‌కాలర్ నేరగాళ్ల తీరు. దొంగతనం, దోపిడీ వంటి నేరాలు చేయాలంటే దానికి భారీ తతంగం అవసరం. టార్గెట్‌ను ఎంచుకోవడం, రెక్కీ చేయడం, పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం... ఇలా ఎన్నో ముందస్తు ప్రక్రియలు పూర్తి చేయాలి. ఇంత చేసినా ఆ నేరంలో సఫలీకృతం అవుతాడనే నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో చేయడానికి ముందో, చేస్తూనో చిక్కే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ విజయవంతంగా నేరం చేసినా కొల్లగొట్టే సొత్తు విలువ తక్కువే. దీంతో వైట్‌కాలర్ నేరగాళ్లు ఎదుటి వ్యక్తినో, వ్యక్తుల్నో లేదా సంస్థనో పక్కాగా నమ్మించి మోసగించే పంథాకు తెరతీస్తున్నారు. ఈ తరహా నేరాల్లో ‘ప్రతిఫలం’ రూ. కోట్లలో ఉంటుండటంతో వైట్‌కాలర్ నేరగాళ్లు ఓపక్క నేరుగా, మరోపక్క ఆన్లైన్ ద్వారా అందినకాడికి దండుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరవాత సైబర్ నేరాలూ అదే స్థాయిలో పెరిగిపోయాయి. చిక్కడం అరుదే.... సైబర్ నేరాలతోపాటు కొన్ని రకాలైన మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, కొన్నిసార్లు స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక అనేక కేసులు నమోదు కావట్లేదు. రిజిస్టర్ అయినా సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలకు తోడు.. నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టులేక కొలిక్కిరావట్లేదు. సైబర్ నేరాల్లో 30 శాతం కూడా కేసులు నమోదు కావట్లేదు. నమోదైన నేరాల్లో కూడా కొలిక్కి వస్తున్నవి 10 శాతానికి మించట్లేదు. శిక్షలు తక్కువే.. వైట్‌కాలర్ నేరాల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు అవసరమైన స్థాయిలో ఇతర విభాగాల సహకారం లభించట్లేదు. కేసు నమోదు, దర్యాప్తు పూర్తై కోర్టు విచారణ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు వేచి ఉండేందుకు ఆసక్తి చూపని బాధితులు మధ్యలోనే మోసగాళ్లతో రాజీ పడుతున్నారు. కోల్పోయిన మొత్తంలో 50–60 శాతం తిరిగి వస్తే చాలనే ధోరణితో ఉంటున్నారు. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏటా జరుగుతున్న నేరాల్లో బాధితులు కోల్పోతున్న సొమ్ములో 95 శాతానికిపైగా మోసగాళ్ల వద్దకు చేరుతోంది. -
‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి..
సాక్షి, అమరావతి బ్యూరో: అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి రూ. లక్షలు కాజేసి పరారీలో ఉన్న మాయలేడి కోసం నగర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మైలవరం, విజయవాడ నగరంలోని పలువురు ఈ మాయలేడి బారిన పడి రూ.లక్షలు నష్టపోయిన వైనంపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘మాయలేడితో ఖాకీల మిలాఖత్!’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. ఈ వార్తపై తక్షణం స్పందించిన నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు సత్వర చర్యలు చేపట్టారు. చట్టపరంగా నిందితురాలికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పరారీలో ఉన్న మాయలేడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మాయలేడిపై ఉన్న కేసుల వివరాలు.. ∙విజయవాడలోని మధురానగర్‌కు చెందిన ఒక మహిళ, ఆమె కుమార్తె, కుమారుడిపై విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లోని పలు పోలీస్స్టేషన్లతో పాటు జిల్లాలోని మైలవరం పోలీసుస్టేషన్లో పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మైలవరం పట్టణానికి చెందిన ఓ మహిళ వద్ద నుంచి రియల్ఎస్టేట్ వ్యాపారం పేరిట రూ. 28 లక్షలు మాయమాటలు చెప్పి కాజేసింది. ఈ విషయంలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసుస్టేషన్లో 2019లో 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో అండర్ ట్రైల్ నడుస్తోంది. ∙2017 మే నెలలో కూడా బాధితురాలిని కొట్టి, బెదిరించిన కేసులోనూ మాయలేడిని సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసూ కోర్టు అండర్ ట్రైల్లో ఉంది. పెనమలూరుకు చెందిన ఓ నిరుద్యోగికి హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ. 24 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యవహారంలోనూ 2020 డిసెంబరులో పెనమలూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న మాయలేడిని జనవరి 11న హైదరాబాద్‌లో మెహదీపట్నం ఫ్లై ఓవర్ సమీపంలో పెనమలూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను విజయవాడ ఆరో అదనపు ఎంఎం కోర్టు జడ్జి రిటర్న్ చేయడంతో ఆమె స్టేషన్‌బెయిల్‌పై విడుదలైంది. తర్వాత తనతో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసిన కానూరుకు చెందిన ఒక మహిళను సైతం పైవిధంగానే మోసం చేసింది. బాధితురాలి కుమారుడు, కుమార్తెకు హైకోర్టు, నీటిపారుదుల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చి రూ. 19.90 లక్షలు కాజేసింది. అనంతరం మోసపోయిన విషయం తెలుసుకున్న మహిళ ఫిర్యాదుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెక్ట్ షీట్... పదే పదే మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్న మాయలేడిని పలుమార్లు నగర పోలీసులు హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఆమెపై పెనమలూరు పోలీసులు ఈ ఏడాది మార్చి 23న సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. వైట్ కాలర్ నేరాల్లో ఆరితేరిన ఒక మహిళపై ఇలాంటి షీట్ ఓపెన్ చేయడం కమిషనరేట్ పరిధిలో ఇదే ప్రప్రథమం. కాగా మాయలేడి తన భర్తపైనే పెనమలూరు పోలీసుస్టేషన్లో 498 కేసు పెట్టింది. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. పెనమలూరు పోలీసుస్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో మాయలేడిపై మరోమారు చీటింగ్ కేసు నమోదు చేశాం. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. కోవిడ్ నేపథ్యంలోనూ ఆమెను అరెస్టు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆమెను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – బత్తిన శ్రీనివాసు చదవండి: పండ్ల మార్కెట్‌కు వెళ్లిన వ్యక్తి.. బావిలో శవమై..! -
వైట్‌కాలర్ నేరస్తురాలిపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలిసారిగా వైట్‌కాలర్, ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ మహిళపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. వైట్‌కాలర్, ఆర్థిక నేరాలతో బాధితులు భారీగా నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం చేసిన తర్వాత తొలిసారిగా సిద్ధిపేట జిల్లాకు చెందిన జొన్నగారి అరుణా రెడ్డిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. 2009 నుంచి పలువురు వ్యక్తులను మోసం చేసిన అరుణా రెడ్డిపై రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో పాటు నల్లగొండ జిల్లాలో దాదాపు పది చీటింగ్ కేసులు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం... అరుణా రెడ్డి భర్త మధుసూదన్ రెడ్డి మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మదుసూధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అరుణా రెడ్డికి అదే ఫ్యాక్టరీలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. తన తండ్రి భూమి పత్రాలు గ్యారంటీగా పెట్టి యూకో బ్యాంక్ నుంచి 2003లో రూ.40 లక్షల రుణం తీసుకుంది. ఈఎంఐలు చెల్లించకపోవడంతో.. యూకో బ్యాంక్ మేనేజర్ భూ పత్రాలను పరిశీలించారు. అరుణారెడ్డి, ఆమె సోదరి నకిలీ భూపత్రాలు సమర్పించి బ్యాంక్‌ను మోసం చేశారని సీబీఐకి మేనేజర్ ఫిర్యాదు చేయడంతో అధికారులు వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. దీంతో అరుణారెడ్డి ఉద్యోగాన్ని కోల్పోయింది. 2007లో నగరానికి చెందిన గోపీ, సయ్యద్ అంజద్, కరుణాకర్‌తో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టింది. బంగారు ఆభరణాలు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతూ రియల్టర్‌గా పరిచయం చేసుకొని ఎంతో మందికి కుచ్చుటోపీ పెట్టింది. అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఉన్నాయంటూ తక్కువ ధరకే ఇస్తానంటూ పలువురి నుంచి లక్షల్లో వసూలు చేసింది. జ్యువెల్లరీ వ్యాపారులతో పరిచయం ఉందని, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ భారీగా డబ్బు వసూలు చేసేది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన వారిని బెదిరించేది. ట్రావెల్స్ నుంచి అద్దెకు వాహనాలు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. దీంతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నాలుగు కేసుల్లో విచారణ జరుగుతోంది. గత ఆరునెలల్లో ఆరు కేసులు నమోదు కావడంతో మల్కాజ్గిరి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరుణారెడ్డిపై సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిందితురాలిని చంచల్గూడలోని స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్‌కు తరలించారు. -
ఎమ్మెల్యేలకు 'వైట్ కాలర్ వల'
బ్యాంకు ఖాతాలో రూ. 2.50 లక్షల జమ చేయాలని మెసేజ్! సొమ్ము జమచేసి ఆఖరి నిమిషంలో మేల్కొన్న ఓ ఎమ్మెల్యే? కాకినాడ : నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఆర్థిక శాఖలో కార్యదర్శులకు నేనే మీడియేటర్‌ని. వర్క్స్ ఇప్పిస్తుంటా. మీ నియోజకవర్గానికి రూ.2.80 కోట్లు ప్రత్యేక గ్రాంట్‌గా ఇప్పిస్తా. ఇందుకోసం రూ. 2.5 లక్షలు సిద్ధం చేసుకోండి. మీ ఖాతాలో ఉంచుకొండి. మీ జిల్లాలో ఎమ్మెల్యేలందరికీ చెప్పా. అందరూ ఓకే చెప్పారు. మీరే ఆలస్యం... - ఇదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాకినాడకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్! మీరు ఖాతాలో రూ.2.5 లక్షలు వేశారా? అయితే రేపటి నుంచి బ్యాంకులకు సెలవులు. ప్రాసెసింగ్‌కు లేట్ అయిపోతోంది. బాస్ ఇమీడియట్గా డబ్బులు కావాలంటున్నారు. ఒక ఖాతా నంబరు మెసేజ్ చేస్తా. అందులో జమ చేయండి. ఎలాగూ బ్యాంకు ఖాతానే కాబట్టి మీరు సందేహించాల్సిన అవసరం లేదు... - ఇదీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ అదే వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్! దీంతో హడావుడిగా సదరు ఎమ్మెల్యే ఆ అపరిచితుడు మెసేజ్ పంపిన ఖాతా నంబరులో రూ. 2.5 లక్షలు జమ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...ఆ అపరిచితుడు రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశాడు. వారిలో ఎక్కువ మంది రూరల్ ఏరియాకు చెందినవారే. తొలుత సొంత ఖాతాలో జమ చేసుకొని ఉంచమన్న అతను...తర్వాత మధ్యాహ్నం మరో ఖాతా నంబరు ఇచ్చి జమ చేయమనడంతో కొంతమంది ఎమ్మెల్యేలకు సందేహం వచ్చింది. ఆర్థిక శాఖలోని ఓ ఉన్నతాధికారిని సంప్రదించారు. అవన్నీ ఫేక్ కాల్స్...మోసపోవద్దని ఘాటుగానే హెచ్చరించడంతో అప్రమత్తమయ్యారు. విషయం ఆర్థిక మంత్రి దృష్టికి వెళ్లింది. ఆయన ఆ ఖాతా గురించి ఆరా తీశారు. ఆ ఖాతా విశాఖలోని ఓ బ్యాంక్‌కి చెందినదని, సదరు ఖాత ఓ మహిళ పేరున ఉన్నట్లు తెలిసింది. ఆ ఖాతాలో మంగళవారం సాయంత్రమే రూ. 2.50 లక్షలు జమ అయ్యిందని బ్యాంకు మేనేజరు మంత్రికి చెప్పారు. ఆ సొమ్ము జమ చేసిన వ్యక్తి కాకినాడకు చెందిన ఎమ్మెల్యే అని తెలుసుకున్న మంత్రి... ఆఖాతాను వెంటనే స్తంభింపజేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. జరిగిన మోసం గురించి మంత్రి వెంటనే సదరు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. ఆఖరి నిమిషంలో ఆగిపోయాం... అపరిచిత వ్యక్తి నుంచి మాకు ఫోన్ వచ్చింది. అతను చెప్పినట్లే ఖాతాలో సొమ్ము జమ చేయడానికి సిద్ధమయ్యాం. ఆఖరి నిమిషంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించాం. అది ఫేక్ కాల్ అని ఆయన చెప్పడంతో ఆఖరి నిమిషంలో సొమ్ము జమ చేయకుండా ఆగిపోయాం. - పిల్లి సత్యనారాయణమూర్తి (కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త)