Wholesale markets
-
రిలయన్స్ డీల్‌కు మెట్రో ఏజీ సమ్మతి!
న్యూఢిల్లీ: జర్మనీ కంపెనీ మెట్రో ఏజీకి చెందిన దేశీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 మిలియన్ యూరోలకు (రూ.4,060 కోట్లు) సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని వారాల నుంచి డీల్‌పై మెట్రో ఏజీ, రిలయన్స్ రిటైల్ మధ్య చర్చలు నడుస్తున్నాయని, గత వారమే రిలయన్స్ రిటైల్ డీల్‌కు మెట్రో ఏజీ అంగీకారం తెలిపినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. మెట్రో క్యాష్ అండ్ క్యారీకి దేశవ్యాప్తంగా ఉన్న 31 హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలు, భూమి, ఇతర ఆస్తులు ఈ ఒప్పందంలో భాగంగా ఉండనున్నట్టు చెప్పాయి. ఈ సమాచారాన్ని ఇరు కంపెనీల ప్రతినిధులు తిరస్కరించడం కానీ, అంగీకరించడం కానీ చేయలేదు. మార్కెట్ ఊహాగానాలపై స్పందించబోమని స్పష్టం ఏశాయి. -
లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రజలకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించిన వ్యక్తులకు లాక్డౌన్ నుంచి మినహాయింపును ఇస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో వ్యవసాయ కూలీలు, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లను నడిపించే మార్కెట్ కమిటీ, ప్యాకేజింగ్ యూనిట్లు లాక్డౌన్ నుంచి మినహాయింపు పొందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మార్కెట్ కమిటీలు నిర్వహించే మండీలు, కనీస మద్దతు ధరకు సంబంధించిన వ్యవహారాలు నిర్వర్తించే విభాగాలు కూడా దీని నుంచి మినహాయింపు పొందాయి. వీరితోపాటు వ్యవసాయ సంబంధిత పనుల్లో పాల్గొనే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలకు కూడా మినహాయింపు లభించింది. వ్యవసాయ సంబంధిత యంత్రాలు, వాటి తయారీ, ఎరువులు పురుగు మందుల తయారీ, ప్యాకేజింగ్ యూనిట్లు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు పొందాయి. అత్యవసర సరుకులు, మందులను రవాణా చేసే ఈ కామర్స్ సంస్థలకు కూడా మినహాయింపు ఉంది -
కేరళ వరదలు: యూపీలో ఘాటెక్కిన ధరలు
లక్నో : గడిచిన వందేండ్లలో ఎన్నడూలేనంతగా వరదలు సృష్టించిన బీభత్సానికి కేరళ వాణిజ్య పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కాఫీ, టీ, యాలకులు, మిరియాలు, రబ్బరు, అరటి తోటలన్నీ నేలకొరిగాయి. ఆరుగాలం కష్టించిన రైతన్నలకు ఇక కన్నీళ్లే మిగిలాయి. దీంతో ఒక్కసారిగా ధరల వాత కూడా మోగిపోతుంది. కేరళ వరదలతో ఉత్తరప్రదేశ్‌లో ధరలు హీటెక్కాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ మార్కెట్ అన్నింటిల్లోనూ మసాలా దినుసుల ధరలు ఘాటుఘాటుగా ఉన్నాయని తెలిసింది. కేరళ మసాలా దినుసుల ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తిదారిగా ఉంది. కేరళ నుంచి సప్లై ఆగిపోవడంతో, తూర్పు యూపీలో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా ఉంటున్న వారణాసిలోని దీననాథ్ మార్కెట్లో మసాలా దినుసుల ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. కేరళను ముంచెత్తిన వరదలతో గత రెండు వారాల నుంచి దీననాథ్ మార్కెట్లోకి మసాలా దినుసుల సరఫరా తగ్గిపోయిందని ట్రేడర్ రామ్ జి గుప్తా తెలిపారు. ఈ కొరతతో ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు చెప్పారు. నల్లమిరియాల ధరలు కేజీకి 315 రూపాయల నుంచి 400 రూపాయలకు పెరిగాయని, యాలుకల ధరలు కేజీకి 1300 రూపాయల నుంచి 1700 రూపాయలు పెరిగినట్టు మరో ట్రేడర్ అనిల్ కేసరి తెలిపారు. ఇక లవంగం ధరలు కేజీ 600 రూపాయలుంటే, ఇప్పుడు 700 రూపాయలున్నట్టు చెప్పారు. ఇతర మసాలాల ధరలు కూడా ఇదే విధంగా పెరిగాయని చెప్పారు. ఇక ఫతేపూర్ జిల్లా హోల్‌సేల్ మార్కెట్లో కూడా మసాలాల ధరలు దాదాపు 30 శాతానికి పైగా ఎగిసినట్టు తెలిసింది. ధరల పెంపుపై స్పందించిన స్థానిక వర్తకులు.. యాలుకల ధరలు కేజీకి 1200 రూపాయల నుంచి 1600 రూపాయలు పెరిగినట్టు చెప్పారు. ఒకవేళ మసాలాలు త్వరగా మార్కెట్‌కు రాకపోతే, వీటి ధరలు 50 శాతానికి పైగా పెరిగే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. బరేలి హోల్‌సేల్ మార్కెట్లో కూడా వీటి ధరలు 15 శాతం కాకపుట్టిస్తున్నాయి. కేరళలో సృష్టించిన ఈ ప్రకృతి విలయతాండవం దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కూడా ప్రభావం చూపుతుంది. మసాలాలు మాత్రమే కాక, కొబ్బరి సప్లై కూడా నిలిచిపోయిందని అలహాబాద్ జిల్లా హోల్‌సేల్ మార్కెట్ చెబుతోంది. మార్కెట్లో వీటి కొరత ఎక్కువగా ఉండటంతో, ధరలు మరింత హీటెక్కుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఈసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
టమాటాల చోరీ..!
సాక్షి, ముంబై: వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ దొంగతనం నిజంగానే జరిగింది. టమాటాల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో దొంగల కన్ను ఇప్పుడు టమాటాలపై పడింది. హోల్‌సేల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు ట్రక్కులు తీసుకొచ్చి మరీ టామాటాల పెట్టెలను ఎత్తుకెళ్తున్నారు. తీరా వాటిని రిటెయిల్ మార్కెట్లో బయటికంటే తక్కువ ధరకు అమ్మేసి.. సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం తెల్లవారు జామున మీరారోడ్డులోని కాశీగావ్ హోల్‌సేల్ మార్కెట్లో సుమారు 720 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకెళ్తే... హోల్‌సేల్ వ్యాపారి అశోక్‌కుమార్ ప్రజాపతి కిలో రూ. 60 ధరతో కొనుక్కొచ్చిన టమాటాలను పెట్టెల్లో నింపి హోల్‌సేల్‌గా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. యజమాని లేని సమయం చూసి దుండగులు ట్రక్కు వేసుకొని వచ్చి క్షణాల్లో పెట్టెలను అందులోకి ఎక్కించుకొని పరారయ్యారు. దీనిని పలువురు చూసినా కొనుగోలు చేసినవారే వాటిని తీసుకెళ్తున్నారమోనని భావించారు. తీరా ప్రజాపతి అక్కడికి వచ్చి చూస్తే కనీసం ఒక్క పెట్టె కూడా కనిపించలేదు. గత 12 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నానని, ఏ ఒక్కరోజు కూడా ఇలా జరగలేదని వాపోయాడు. టమాటాలను గుర్తించకున్నా వాటిని నింపిన పెట్టెలను గుర్తుపట్టగలననే నమ్మకంతో సమీపంలోని రిటెయిల్ మార్కెట్లలో వెతికాడు. దీంతో దహిసర్‌లోని రావల్పాడా మార్కెట్లో తన టమాటాలను గుర్తుతెలియని వ్యక్తులు విక్రయించినట్లు గుర్తించాడు. వెంటనే కాశీమీరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీని యన్ పోలీస్ ఇన్స్పెక్టర్ అనిల్ కదమ్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో చోటుసుకుందని చెప్పారు. అక్కడ 24 పెట్టెల్లో టమాటాలు ఉన్నాయనీ, ప్రతి పెట్టెలో 30 కిలోల టమాటలు ఉన్నాయనిచెప్పారు. చోరీకి గురైన టమాటాల విలువ సుమారు రూ. 60 వేల వరకు ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి వాటిని ఎత్తుకెళ్లిన దుండగులు ఒక్కో పెట్టెను రూ. 500 నుంచి రూ. 600 వరకు విక్రయిం చిన ట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.