Wildlife Photographer of the Year -2014
-
పాము.. పురస్కారం..
నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీవారు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో మనోళ్లు తీసిన చిత్రాలూ అవార్డులను అందుకున్నాయి. ఈ ఫొటో చూడండి. సడన్‌గా చూస్తే.. ఏదో మొక్క అని అనుకుంటాం. సరిగ్గా చూస్తే.. పచ్చటి పరిసరాల్లో కలిసిపోయిన పచ్చ రంగు పాము మనకు కనిపిస్తుంది. ఈ ఫొటోను తీసిన ఎస్.ఎస్.రవిప్రకాశ్ కూడా తొలిసారి చూసినప్పుడు దీన్ని అలాగే అనుకున్నారట. కర్ణాటకలోని బెంగ ళూరుకు చెందిన రవిప్రకాశ్ తీసిన ఈ చిత్రం ఉభయచరాలు, సరీసృపాలు విభాగంలో విజేతగా నిలిచింది. తన తోటలోనే ఈ చిత్రాన్ని తీశానని.. ఈ పాములు తాము వేటాడే బల్లులు, కప్పలు వంటి వాటి కోసం ఇలా చాలాసేపు కదలకుండా బొమ్మలా ఉండిపోతాయని రవిప్రకాశ్ తెలిపారు. ఆ విషయాన్ని తెలియజెప్పేలా తానీ చిత్రాన్ని తీశానని చెప్పారు. -
గుడ్ మార్నింగ్..
ఉషోదయ వేళ.. పక్కనే సముద్రుడి ఘోష.. అయినా ఇవేమీ పట్టనట్లు కొన్ని బద్దకంగా బండ మీద దొర్లుతుంటే.. మరికొన్నిటికి ఇంకా తెలవారనే లేదు. సివంగులు తమ పిల్లలతో ఉన్న ఈ ఫొటోను అమెరికాకు చెందిన ఫొటో జర్నలిస్ట్ మైఖేల్ నిక్ నికోల్స్ తీశారు. ‘ద లాస్ట్ గ్రేట్ పిక్చర్’ పేరిట తీసిన ఈ చిత్రం నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వారు కలసి నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014 గ్రాండ్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారంతోపాటు బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ విజేతగా ఎన్నికైంది. మైఖేల్ ఈ చిత్రాన్ని టాంజానియాలోని సెరెన్గెటీ జాతీయ పార్కులో తీశారు. కొన్ని నెలలుగా తాను వాటి చుట్టూ తిరుగుతూ ఫొటోలు తీశానని.. అలాంటి సమయంలోనే ఈ అద్భుత చిత్రం చేజిక్కిందని నిక్ తెలిపారు. -
మొబైల్..మంకీ..
ఇప్పుడంతా ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్ల హవానే.. ఇందుకు నరులే కాదు.. వానరులూ అతీతం కాదన్నట్లు ఈ ఫొటో కనిపిస్తుంది కదూ.. చల్లని నీటిలో ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఫేస్బుక్లో స్టేటస్ అప్డేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ మంకీ ఫొటోను నెదర్లాండ్స్‌కు చెందిన మార్సెల్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. నేషనల్ హిస్టరీ మ్యూజియంతో కలసి బీబీసీ వారు నిర్వహిస్తున్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ -2014లో పీపుల్స్ చాయిస్ అవార్డు విభాగం తుది జాబితా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 ఫొటోల్లో ఇదీ ఒకటి. ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సెప్టెంబర్ 5తో ఓటింగ్ ముగుస్తుంది. అక్టోబర్‌లో విజేతల వివరాలను ప్రకటిస్తారు.