విండోస్ 9 కాదు.. 10 వచ్చేసింది!
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యూజర్లను ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది. విండోస్ 9 వెర్షన్‌ను ప్రకటిస్తుందని అంతా ఎదురు చూస్తుంటే దాన్ని వదిలేసి ఏకంగా విండోస్ 10ను విడుదల చేసింది. ప్రజలకు ఏమాత్రం నచ్చని విండోస్ 8 స్థానంలో దాన్ని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీన విండోస్ 9ను విడుదల చేస్తుందని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో అనూహ్యంగా ఈ నిర్ణయం బయటకు వచ్చింది. టాబ్లెట్లు, ఫోన్లు, సాధారణ కంప్యూటర్లు.. అన్నింటికీ ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.
విండోస్ 10 ఇప్పటివరకు తాము విడుదల చేసిన వాటిలో అత్యుత్తమం అవుతుందని మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ టెర్రీ మయర్సన్ అన్నారు. రెండేళ్ల క్రితం విడుదలైన విండోస్ 8ను కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని సాంకేతిక అంశాల పరిశోధన సంస్థ ఫారెస్టర్ తెలిపింది. చాలామంది పీసీ యూజర్లు ఈ ఇంటర్ఫేస్ను ఏమాత్రం ఇష్టపడలేదు. ఇంతకాలం ఉన్న స్టార్ట్ బటన్ పాపప్ మెనూ లేకపోవడం వాళ్లకు లోటుగా కనిపించింది.
ఎక్స్‌బాక్స్ నుంచి పీసీ వరకు, ఫోన్ల నుంచి టాబ్లెట్ల వరకు, చిన్న చిన్న గాడ్జెట్లకు కూడా విండోస్ 10 సరిగ్గా సరిపోతుందని మయర్సన్ అంటున్నారు. యాపిల్ సంస్థ ఐఫోన్, ఐప్యాడ్లను విడుదల చేయడం, మరోవైపు గూగుల్ ఆండ్రాయిడ్ ఉత్పత్తులను విడుదల చేయడంతో విండోస్ పెద్దగా ఆదరణ పొందకపోవడం మైక్రోసాఫ్ట్‌ను కలవరపరుస్తోంది. దానికితోడు ఎక్స్పీ తర్వాత వచ్చిన ఉత్పత్తులేవీ పెద్దగా జనంలోకి వెళ్లలేదు. పదేళ్ల క్రితం పర్సనల్ కంప్యూటర్ల రంగంలో రారాజుగా ఉన్న విండోస్.. ఇప్పుడు కేవలం 14 శాతానికి మాత్రమే పరిమితమైందని గార్ట్నర్ సంస్థ తెలిపింది.