ఓటరు జాబితాలో పొరపాట్లు లేకుండా చూడాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా సవరణలు చేపట్టి సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి, ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్డీఓ, తహశీల్దార్, ఉప తహశీల్దార్లతో కలిసి ముసాయిదా ఓటరు జాబితాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 3న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని అందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్లు ప్రత్యేకంగా పరిశీలించి ప్రత్యక్ష ప్రసారాల కోసం పోలింగ్ రోజున తగిన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో వికలాంగుల సౌకర్యార్థం ర్యాంప్‌లు ఉన్నదీ లేనిదీ పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు విద్యుత్ సౌకర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
గత ఎన్నికల్లో జరిగిన వ్యయాల పూర్తి బిల్లులను పంపిణీ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. అనంతరం ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించి త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ప్రకాశ్‌కుమార్, సిద్ధిపేట, మెదక్ ఆర్డీవోలు ముత్యంరెడ్డి, వనజాదేవి, వివిధ మండలాల తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.