రిజర్వేషన్ లేకుండానే.. రైట్‌రైట్
11 నుంచి పుష్కరాలకు ఆర్టీసీ బస్సులు
రీజియన్ వ్యాప్తంగా 175 సర్వీసులు
అనంతపురం న్యూసిటీ : ఆర్టీసీ బస్సుల్లో విజయవాడకు చేరాలంటే గగనమవుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు నడుపుతామని ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా.. ఆచరణ లో కార్యరూపం దాల్చలేదు. అనంతపురం నుంచి విజయవాడకు నెల రోజులుగా రిజర్వేషన్ సౌకర్యం లేకుండానే బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికులు విజయవాడకు వెళ్లాలంటే బస్టాండ్‌లో సీటు వేసేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. పుష్కరాల నేపథ్యంలో రిజర్వేషన్‌ను బ్లాక్ చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే విజయవాడకు వెళ్లే బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం రద్దు చేశామని చెప్తున్నారు. అనంతపురం రీజియన్‌లో అనంతపురం, హిందూపురం, పుట్టపర్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి డిపోల నుంచి రోజూ 8 బస్సులు విజయవాడకు వెళ్తాయి.
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
అమరావతి రాజధాని అయినప్పటి నుంచి విజయవాడకు రాకపోకలు పెరిగాయి. ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు దీన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నా..ఆర్టీసీ పెద్దగా పట్టించుకోలేదు. పేరుకు మాత్రం బస్‌భవన్ నిబంధనలు అని చెప్తున్నారు. దీంతో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. పుష్కరాల నేపథ్యంలో ఇప్పట్లో విజయవాడకు రిజర్వేషన్ సౌకర్యంతో బస్సులు నడిపే పరిస్థితి కనిపించలేదు.
రిజర్వేషన్ లేకుండానే..
అనంతపురం ఆర్టీసీ రీజియన్ పుష్కరాలకు 175 ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులు తిప్పనుంది. రిజర్వేషన్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్‌లోకి బస్సులు వచ్చిన వెంటనే పరుగులు తీయాల్సి వస్తోంది.
11 నుంచి నడవనున్న బస్సులు
ఈ నెల 12 నుంచి 23 వరకు పుష్కరాలు ఉండడంతో ఆర్టీసీ ఈ నెల 11 నుంచి బస్సులు తిప్పనుంది. విజయవాడతో పాటు శ్రీశైలం, కర్నూలు బీచ్‌పల్లికి బస్సులు నడుస్తాయి. విజయవాడ సిటీలోకి బస్సులు వెళ్లవు. గోరంట్ల మహా పుష్కరఘాట్ వరకు మాత్రమే వెళ్తాయి. అక్కడి నుంచి ఫ్రీ సిటీ సర్వీసులు ఉంటాయి.
పోస్టర్ విడుదల
పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ కల్పిస్తున్న ప్రత్యేక బస్సులకు సంబంధించిన పోస్టర్లను డీఎం బాలచంద్రప్ప సోమవారం ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రత్యేక బస్సుల కోసం సంప్రదించాలన్నారు. రెగ్యులర్ బస్సులు తిరుగుతాయన్నారు. అసిస్టెంట్ మేనేజర్ గౌడ్, కంట్రోలర్లు శివలింగప్ప, పీసీకే స్వామి తదితరులు పాల్గొన్నారు.
రద్దీకనుగుణంగా బస్సులు
పుష్కరాలకు రద్దీకనుగుణంగా బస్సులు నడుపుతాం. రీజియన్ వ్యాప్తంగా సుమారు 175 బస్సులు నడపనున్నాం. ప్రయాణికుల అవసరాన్ని బట్టి వారు కోరితే మరిన్ని బస్సులు నడిపేందుకు అందుబాటులో ఉంచుతాం.
– శశికుమార్, డిప్యూటీ సీటీఎం