Woman story
-
ఆత్మస్థైర్యం.. అక్షరం నేర్చిన పాదం
అల్లంత దూరన సన్నని తీగపై అటు ఇటూ పట్టు తప్పకుండా నడుస్తున్న పాదాలు.. తీగపై నడక ఆగిపోగానే డబ్బులు ఏరుకుంటున్న ఆటగాళ్లను చూసి ఆమె ఓ కల కన్నది. ‘నాకు రెండు చేతులు లేకపోతేనేం... పాదమే చేయిగా మారదా’ అనుకుంది. పట్టుబట్టింది. సాధన చేసింది. పాదం రాతతోనే తన తల రాతను మార్చుకుంది ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో ఉంటున్న కామిని శ్రీవాస్తవ. కాళ్లతో రాయడం మొదలుపెట్టినప్పుడే చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెను మెచ్చుకుంది. జీవితాన్ని నిలబెట్టుకోవడం అంటే ఏంటో చూపాక ఎన్నో అవార్డులూ, ప్రశంసలూ అందుకుంది కామిని శ్రీవాస్తవ. నాలుగేళ్ల వయసులో రైలు ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న శ్రీవాస్తవకు ముందున్న జీవితం గురించి ఆప్పుడేమీ తెలియదు. నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల. తల్లిదండ్రికి గారాబు తనయ. తండ్రి రైల్వేలో డ్రైవర్. ఓ రోజు మారాం చేస్తే తనతో పాటు డ్యూటీకి తీసుకెళ్లాడు. కానీ, అనుకోకుండా అక్కడ జరిగిన ప్రమాదంలో రెండు చేతులు, ఎడమపాదం ఐదు వేళ్లూ తెగిపోయాయి. అయితేనేం మొక్కవోని ఆమె ధైర్యం ఉన్నతశిఖరాలను చేర్చిన విధానం ఇలా వివరిస్తుంది.. ‘‘ఆ సమయంలో జీవితం ఏంటి అనే పెద్ద విషయాలు ఏమీ తెలియవు. కానీ, అందరిమాదిరిగా నాకు చేతులు లేవు. ఏ పనీ చేయలేకపోతున్నాను. నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకు ఇదే బాధ. చేతులు లేకుంటే ప్రతి పనికీ ఇతరులపై ఆధారపడాల్సిందే. కొన్నాళ్లు డిప్రెషన్ నన్ను కమ్మేసింది. ఎవరితోనూ మాట్లాడకుండా రోజుల తరబడి గడిపాను. ఆలోచనలో పడేసిన సందర్భాలు.. ఓ రోజు మార్కెట్‌కు వెళుతున్నప్పుడు ఒక దగ్గర రెండు పోల్స్‌పైన కట్టిన సన్నని తీగపై ఒక అమ్మాయి అటూ ఇటూ నడవడం చూశా. చుట్టూ జనాలు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ‘కాళ్లు అంత శక్తిమంతమైనవా!’ అనుకున్నాను. అదే విషయం మా నాన్నను అడిగాను. మా నాన్న ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్‌లో ఛాంపియన్. అతను కూడా సన్నని తాడు మీద నడిచి చూపించాడు. సంకల్పం ఉంటే ఏమైనా చేయచ్చు అని కళ్లకు కట్టాడు. అప్పటి నుంచి కాళ్లతో పనులు చేయడం నేర్చుకున్నాను. అక్షరాలు రాయడం సాధన చేశాను. ఈ విషయంలో ఒక పోరాటయోధురాలిగా మారిపోయాను. చేతులు మినహా నా శరీరం అంతా బాగుందని నేను అంగీకరించాను. అసలు చేతులు అనేవి పుట్టుకతోనే లేకపోతే... అనే ఆలోచన వచ్చాక ఏ పనైనా అవలీలగా చేయగలను అనిపించింది. పనిలో పదోన్నతులు.. డిగ్రీ చేశాక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం మొదలుపెట్టాను. అందులో.. చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ నూట్రిషన్ విభాగంలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆ విభాగంలోనే మరికొన్నాళ్లకు ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చింది. ఉద్యోగంతో పాటు ఎకనామిక్స్, సోషియాలజీలో ఎంఏ చేశాను. ఇందిరా మహిళా సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ స్కీమ్ కింద అధ్యయన బృందంలో సభ్యురాలిగా ఇండోనేషియాకు వెళ్లొచ్చాను. కుటుంబం.. అవార్డులు.. నాకు అడుగడుగునా అండగా నిలిచే భర్త లభించాడు. ఇరవై ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఉమ్మడి కుటుంబంలోనే మా జీవనం ఆనందంగా సాగిపోయింది. అత్తమామలు, ఆడపడచులు.. అందరూ నన్ను బాగాచూసుకున్నారు. చిన్నప్పటి నుంచి నాకు చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం. నా రచనలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రసారం చేయబడ్డాయి. అనేక వార్తాపత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాను. కవితా సంకలనాలు రాశాను. వాటిలో ‘ఖిల్తే ఫూల్ మెహక్తా అంగన్’, ‘డోర్’ కథా సంకలనం, భారతరత్న ఇందిర, అస్మాప్త రహీన్’నవలలు ప్రచురించబడ్డాయి. ఎన్నో సత్కారాలు అందుకున్నాను. నా ఉద్యోగం, అభిరుచి రెండింటికీ సమాన ప్రాముఖ్యతను ఇచ్చాను. దీని ఫలితంగా 1994లో మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాల్ శర్మచే జాతీయ అవార్డు, ఆ తర్వాత ముఖ్యమంత్రులు, గవర్నర్ల చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నాను. సాహిత్యరంగంలో అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. నా పట్టుదల, శ్రమ అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని అనేవారు. నమ్మకమే మనం.. ఈ రోజు నేను ఈ దశకు చేరుకున్నాన ంటే నా చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయసహకారాల వల్లనే అనుకుంటాను. ఇప్పటికి నాలుగు పుస్తకాలు రాసి, ప్రచురించాను. ప్రతిరోజూ నా రచనను సోషల్ మీడియా మాధ్యమంగా పంచుకుంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామన్నదే చాలా పెద్ద విషయం. దుఃఖంలో కూడా సంతోషంగా జీవించాలి. అంతులేని దుఃఖం తర్వాత నా మీద నాకు ఎనలేని ఆత్మవిశ్యాసం పెరిగింది. అందుకే నన్ను నేను ఎప్పుడు వికలాంగురాలిని అనుకోలేద’’ని ఒక్కో మెట్టును అధిగమించిన విధానాన్ని కళ్లకు కడతారు శ్రీవాస్తవ. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామన్నదే చాలా పెద్ద విషయం. దుఃఖంలో కూడా సంతోషంగా జీవించాలి. అంతులేని దుఃఖం తర్వాత నా మీద నాకు ఎనలేని ఆత్మవిశ్యాసం పెరిగింది. అందుకే నన్ను నేను ఎప్పుడూ వికలాంగురాలిని అనుకోలేదు – శ్రీవాస్తవ -
ఓ స్త్రీ కథ
ఇంట, బయట, ఆఫీసుల్లో, కార్ఖానాల్లో..గుడిలో, బడిలో, మడిలో..అంతటా ఆమే.అవని అంతా ఆమే.ఆమె లేనిది ఏమీ లేదు.ఆమె ఉన్న చోట లేనిదంటూ ఏదీ లేదు. ఈ ఆలోచన దూరదర్శన్ ఛానెల్‌ని 90ల కాలంలో అమాంతం ఆకాశమంత ఎత్తు పెంచేసింది. ఏక్ ఔరత్ కి కహాని అంటూ చిన్నతెర ఓ స్త్రీ కథను చెప్పడం మొదలుపెట్టింది.అది ‘శాంతి’గా అందరి మదిని తట్టి లేపింది. ఇలా మొదలు... దేశంలో అతి పెద్దదైన బాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు స్నేహితులతో ‘శాంతి’ కథ ప్రారంభమవుతుంది. ఈ ఇద్దరు స్నేహితుల పేర్లు కామేష్ మహదేవన్, రాజేష్ సింగ్. ఒకరు రచయిత, ఇంకొకరు దర్శకనిర్మాత. ఈ ఇద్దరూ అత్యంత విలాసవంతమైన శాంతి మాన్షన్‌లో నివసిస్తుంటారు. శాంతి ఓ జర్నలిస్ట్ ప్రతీ ఒక్కరి వెనకాల ఓ గతం ఉంటుంది. ఆ గతాన్ని తెలుసుకొని, ఆ రహస్యాలను తన రచనల ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తుంటుంది జర్నలిస్ట్ శాంతి. సంపన్నుల ఇళ్లలో పనిచేసే సర్వెంట్స్ సమస్యల మీద కామేష్, రాజ్‌లు ఓ సినిమా తీసి, మంచి పేరు సంపాదిస్తారు. సెలబ్రిటీలైన వీరిద్దరి బయోగ్రఫీలు రాయాలని అనుకుంటుంది శాంతి. ఓ రోజు కామేష్, రాజ్‌లను కలిసి మంచి సినిమా తీశారని అభినందిస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి కుటుంబాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం కామేష్, రాజ్‌లకు తెలియదు. గత కాలపు నీడల జాడలు కామేష్ పెద్ద కొడుకు రమేష్ బుద్ధిమాంద్యుడని, చిన్న కొడుకు సోమేష్ తన స్క్రిప్ట్‌ని చివరికి తండ్రి కూడా తిరస్కరించడంతో తీవ్ర మనోవేదనకు లోనై కుంగిపోయి ఉన్నాడని తెలుసుకుంటుంది. కామేష్ భార్య ఆయేషా గతంలో ఓ సినీ నిర్మాత కూతురు. ఆ నిర్మాత కెరీర్‌ను ఈ ఇద్దరు స్నేహితులు కలిసి నాశనం చేశారనే విషయం స్పష్టం అవుతుంది. తన దత్తత కూతురు నిధి భర్త కామేష్ అక్రమసంతామని చెబుతుంది ఆయేషా. కామేష్ కుటుంబం తర్వాత రాజ్ సింగ్ కుటుంబ సభ్యులను కలుసుకుంటుంది. రాజ్‌సింగ్ భార్య మనశ్శాంతి కోసం సాధువులను కలుసుకోవడానికి తరచూ ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటుంది. ఆమెను కలుసుకున్న శాంతికి ఎన్నో నిగూఢమైన విషయాలు తెలుస్తాయి. తన కొడుకు నిహాల్, అమెరికన్ ఫ్రెండ్ మైఖేల్‌కి తనకు పుట్టిన సంతానం అని శాంతి ముందు బయట పెడుతుంది రాజ్‌సింగ్ భార్య. కూతురు మాయ తల్లి దూరం అవడంతో డిప్రెషన్ బారిన పడుతుంది. స్త్రీలోలుడు అయిన పెద్ద కొడుకు రోహణ్ మోడల్ సశ ను పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఉంటాడు. అత్యంత విలాసవంతమైన శాంతి మాన్షన్‌లో ఉన్న వీరందరి గత జీవితాలను తెలుసుకునే క్రమంలో తన పుట్టుకకు కారణం ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోతుంది శాంతి. ఒకప్పుడు శాంతి మాన్షన్ నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేసేది శాంతి తల్లి. ఆ మాన్షన్‌లోనే ఈ సినీ నిర్మాత, రచయిత కామేష్, రాజ్‌లు ఆమెపై లైంగిక దాడి చేస్తారు. గర్భవతి అయిన ఆమె ఒంటరిగా కూతుర్ని కని, పెంచి పెద్ద చేస్తుంది. పురుషాధిక్య సమాజంలో ఒంటరిగా ఒక తల్లి ఏ విధంగా జీవించిందో ఆమె పాత్ర స్పష్టం చేస్తుంది. సామాజిక, రాజMీ య శక్తులుగా ఎదిగిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె తన కూతురు పెంపకంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. స్త్రీ ఆధారిత సీరియల్స్‌కు చుక్కాని పాతికేళ్ల క్రితం సామాజిక సమస్యలను కళ్లకు కట్టిన తొలి డెయిలీ సీరియల్ శాంతి. 780 ఎపిసోడ్స్‌తో సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమైన శాంతి ఆ తర్వాత వచ్చిన స్త్రీ ఆధారిత సీరియల్స్‌కి స్ఫూర్తిగా నిలిచింది. అక్కణ్ణుంచే స్త్రీని శక్తిమంతురాలిగా, ప్రధాన పాత్రధారిణిగా చూపించడం మొదలుపెట్టింది చిన్నతెర. అలా ఆ తర్వాత వరసగా దూరదర్శన్‌లో వచ్చిన సీరియల్స్‌లో ‘రజని’ ఒకటి. ఓ మధ్యతరగతి గృహిణి సమాజంలోని అసమానతలను తొలగించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం ఈ సీరియల్లో చూస్తాం. అటు తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ పాత్రను కళ్లకు కట్టిన ‘ఉడాన్’ సీరియల్‌కి దర్శకత్వ ప్రతిభను అందించింది కవితా చౌదరి భట్టాచార్య. ఈ సీరియల్లో లింగవివక్ష, మహిళా సాధికారిత.. వంటి పాయింట్స్‌ను బేసిక్‌గా తీసుకున్నారు. ఇది మొట్టమొదటి మహిళా ఓరియెంటెడ్ టీవీ షోగా దూరదర్శన్ హిస్టరీలో చేరింది. ఒక మహిళా పోలీస్ అధికారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్ సీరియల్‌ని తీశారు. మహిళ ఎదగడానికి ఎలాంటి అడ్డంకులు లేవని, వారి కలలకు, ఆకాంక్షలకు అకాశమే హద్దు అని ఓ మహిళ ఈ సీరియల్‌ని డైరెక్ట్ చేసి చూపించారు. ఆ తర్వాత నేవీ అధికారిణిని పరిచయం చేస్తూ వచ్చిన ‘ఆరోహణ్’ సీరియల్ కూడా అదే బాటలో నడిచింది. ‘ఔరత్’ సీరియల్ ద్వారా కుటుంబంలో మహిళకు విద్య, సాధికారతతోపాటు పెళ్లి చేసుకోవడానికి వరుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మహిళకు ఇచ్చి తీరాలని లాయర్ పాత్ర ద్వారా చూపించారు. ఇలా మహిళా అభ్యున్నతి కోసం పాటు పడే స్త్రీ ఆధారిత కథలు రావడం శాంతి సీరియల్ నుంచే మొదలయ్యాయి. – ఎన్.ఆర్. చాలామందికి ఆమె శాంతిగానే పరిచయం. మందిరాబేడి అనగానే శాంతి పేరు కూడా స్ఫురణకు వస్తుంది. ప్రేక్షకుల మదిలో అంతగా నిలిచిపోయేలా దర్శకుడు ఆది పోచా శాంతి పాత్రను మలచిన తీరు అమోఘం. 1994లో వచ్చిన శాంతి సీరియల్ ద్వారా మందిరాబేడి దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలైంది. ఇండియన్ టెలివిజన్‌లో ఒక జర్నలిస్టు పాత్రను పరిచయం చేసిన మొట్టమొదటి సీరియల్ శాంతి. అప్పటికే అడ్వరై్టజింగ్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నారు మందిరాబేడి. ఆ క్రమంలో దర్శకుడు ఆది పోచా దృష్టిలో పడ్డారు ఆమె. ట్రౌజర్, టీ షర్ట్–జీన్స్, సల్వార్, కమీజ్‌లతో మందిరాబేడికి ఆడిషన్ టెస్ట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మందిరాబేడి మాట్లాడుతూ – ‘శాంతి సీరియల్ తర్వాత నా వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. శాంతిలో ఏదో చిన్న పాత్ర ఇస్తారు అనుకున్నాను. కానీ, నేనే ‘శాంతి’ అన్నారు డైరెక్టర్. నమ్మలేకపోయా. నాకు ఈ ఫీల్డ్‌లో విధమైన బ్యాక్‌గ్రౌండ్ లేదు. నటనలో ఎన్నో ఏళ్లు ఎంతో కష్టపడితే గాని ఇలాంటి పాత్రలు రావు. అలాంటిది శాంతి పాత్ర నన్ను వరించింది. శాంతి చాలా ౖస్రాంగ్ ఉమెన్. ఎన్నో సమస్యలను సాల్వ్ చేస్తుంది. శాంతి నన్ను శక్తిమంతురాలిని చేసింది’ అన్నారామె. -
‘అనంత’ స్థైర్యం
సండే స్పెషల్ ఆమె సొంతం! ఆడ.. పిల్ల. పురిట్లో ఇలాంటి నిట్టూర్పులు ఇప్పటికీ వింటున్నాం. ఇంటికి లక్ష్మీ కళ వచ్చిందని సంతోషపడే వాళ్లు ఉన్నప్పటికీ.. ఆడపిల్ల పుట్టుకను జీర్ణించుకోలేని కుటుంబాలే సమాజంలో అధికం. దేశాధినేతలుగా రాణిస్తున్నా.. అంతరిక్షాన్ని చుట్టేస్తున్నా.. అద్భుతాలు ఆవిష్కరిస్తున్నా.. ఇప్పటికీ ఆమె పట్ల వివక్ష కొనసాగుతోంది. కాలు బయటపెట్టాలంటే ఆంక్షల సంకెళ్ల కట్టడి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అవకాశాలను అందిప్చుకుంటూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది మహిళ. ఆ రంగాలు పురుషులకే పరిమితం అనే భావనను చెరిపేస్తూ.. అవకాశం వస్తే తామూ తీసిపోమంటూ సవాల్ విసురుతున్నారు. ఈ కోవలోనే కొందరు మహిళలు ఆటో రంగాన్ని జీవనోపాధిగా ఎంచుకొని ‘అనంత’ స్థైర్యం కనబరుస్తున్న తీరు అభినందనీయం. ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేం కదన్నా.. ఈ చిత్రంలోని మహిళ పేరు భాగ్యలక్ష్మి. అనంతపురంలోని ఉమానగర్‌కు చెందిన ఈమె డిగ్రీ వరకు చదువుకున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుని, ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. భాగ్యలక్ష్మి ఎంత ధైర్యవంతురాలో.. అంతే సున్నిత మనస్కురాలు. ఓ సారి రోడ్డు ప్రమాదం జరిగితే బాధితులను తన ఆటోలోనే సర్వజనాస్పత్రికి చేర్చింది. ఆ సందర్భంగా ఆటోలో రక్తపు మరకలు పడితే.. ఆస్పత్రి ఆటోస్టాండ్ వద్దనున్న ఆటోడ్రైవర్లు ‘ఎందుకమ్మా ఇలాంటి కేసులను ఎక్కించుకొస్తావు.. ఇంకోసారి తీసుకురావద్దు’ అని చెప్పారు. అందుకామె ‘ప్రాణం పోతుంటే చూస్తే ఉండలేం కదన్నా..’ అంటూ తనలోని మానవత్వాన్ని చాటుకుంది. ఇలాంటి భాగ్యలక్ష్మిలు అనంతపురం పట్టణంలో సొంతంగా బతుకు బండి లాగిస్తున్నారు. వీరి విజయగాథే ఈ వారం సండే స్పెషల్. - సాక్షి, అనంతపురం -
హగ్ చేసుకున్నట్టు భావించండి!
టిఫానీ మిల్లర్ తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఎప్పటిలాగే పిజ్జాహౌస్కు లంచ్ కోసం వెళ్లింది. అక్కడ ఆమెను ఓ దృశ్యం కట్టిపడేసింది. ఓ వృద్ధుడు మరో కురువృద్ధుడికి అన్నం తినిపిస్తున్నాడు. వీల్‌చైర్‌లో ఉన్న కురువృద్ధుడికి ఆహారం తినిపించి, నీళ్లను తాగించి.. అనంతరం నోటిని తుడిచాడు. కురువృద్ధుడైన తన తండ్రి భుజించిన తర్వాత 60 ఏళ్ల వయస్సున్న అతను ఆహారం తీసుకున్నాడు. మానవ ఆత్మీయతానుబంధాలు ఉట్టిపడే ఆ ఘట్టం చూసిన తర్వాత మిల్లర్ ఉండబట్టలేకపోయింది. వెంటనే వారి వద్దకు వెళ్లి మీరు చూపిన ఆత్మీయతానురాగాలు తనను కదిలింపజేశాయని, వారికి కృతజ్ఞతలు తెలిపింది. అందుకు బదులుగా ఆ వ్యక్తి మిల్లర్‌కు 'థాంక్స్' చెప్పాడు. 'ఇలాంటి మాటలు నేను నిత్యం వింటూ ఉంటాను' అని చెప్పాడు. ఆ తర్వాత మిల్లర్ తన టేబుల్ దగ్గరికి వచ్చేసింది. కాసేపటి తర్వాత మిల్లర్ దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి 'మీరు నన్ను అభినందించారు. ప్రతిగా నేను మిమల్ని ఆభినందిస్తాను' అంటూ ఓ నాప్కిన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆ నాప్కిన్పైన 'సీవైహెచ్' అనే అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల అర్థం 'కన్సిడర్ యువర్ సెల్ప్ హగ్డ్' (మిమ్నల్ని ఆలింగనం చేసుకున్నట్టు భావించండి) అని చెప్పాడు. అతడి ఆత్మీయత మిల్లర్‌ను కంటతడి పెట్టేలా చేసింది. అతన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. అతని తండ్రి కొరియన్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడని తెలుసుకుంది. మానవతను గుర్తుచేసిన ఈ ఘట్టాన్ని అమెరికాలోని మిల్‌విల్లే వాసురాలైన ఆమె ఓ ఫేస్బుక్ పేజీలో ప్రచురించింది. అప్పటినుంచి ఈ ఆత్మీయ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.