‘అనంత’ స్థైర్యం
సండే స్పెషల్
ఆమె సొంతం!
ఆడ.. పిల్ల. పురిట్లో ఇలాంటి నిట్టూర్పులు ఇప్పటికీ వింటున్నాం. ఇంటికి లక్ష్మీ కళ వచ్చిందని సంతోషపడే వాళ్లు ఉన్నప్పటికీ.. ఆడపిల్ల పుట్టుకను జీర్ణించుకోలేని కుటుంబాలే సమాజంలో అధికం. దేశాధినేతలుగా రాణిస్తున్నా.. అంతరిక్షాన్ని చుట్టేస్తున్నా.. అద్భుతాలు ఆవిష్కరిస్తున్నా.. ఇప్పటికీ ఆమె పట్ల వివక్ష కొనసాగుతోంది. కాలు బయటపెట్టాలంటే ఆంక్షల సంకెళ్ల కట్టడి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అవకాశాలను అందిప్చుకుంటూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది మహిళ. ఆ రంగాలు పురుషులకే పరిమితం అనే భావనను చెరిపేస్తూ.. అవకాశం వస్తే తామూ తీసిపోమంటూ సవాల్ విసురుతున్నారు. ఈ కోవలోనే కొందరు మహిళలు ఆటో రంగాన్ని జీవనోపాధిగా ఎంచుకొని ‘అనంత’ స్థైర్యం కనబరుస్తున్న తీరు అభినందనీయం.
ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేం కదన్నా..
ఈ చిత్రంలోని మహిళ పేరు భాగ్యలక్ష్మి. అనంతపురంలోని ఉమానగర్‌కు చెందిన ఈమె డిగ్రీ వరకు చదువుకున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుని, ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. భాగ్యలక్ష్మి ఎంత ధైర్యవంతురాలో.. అంతే సున్నిత మనస్కురాలు. ఓ సారి రోడ్డు ప్రమాదం జరిగితే బాధితులను తన ఆటోలోనే సర్వజనాస్పత్రికి చేర్చింది. ఆ సందర్భంగా ఆటోలో రక్తపు మరకలు పడితే.. ఆస్పత్రి ఆటోస్టాండ్ వద్దనున్న ఆటోడ్రైవర్లు ‘ఎందుకమ్మా ఇలాంటి కేసులను ఎక్కించుకొస్తావు.. ఇంకోసారి తీసుకురావద్దు’ అని చెప్పారు. అందుకామె ‘ప్రాణం పోతుంటే చూస్తే ఉండలేం కదన్నా..’ అంటూ తనలోని మానవత్వాన్ని చాటుకుంది. ఇలాంటి భాగ్యలక్ష్మిలు అనంతపురం పట్టణంలో సొంతంగా బతుకు బండి లాగిస్తున్నారు. వీరి విజయగాథే ఈ వారం సండే స్పెషల్.
- సాక్షి, అనంతపురం