చిక్కుల్లో నటుడు చలపతి
హైదరాబాద్: అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావుకు చుక్కెదురైంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా చలపతిరావు చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో ఆయనపై పలువురు మేధావులు, రచయిత్రులు, మహిళా నాయకులు మండిపడుతున్నారు. మహిళల గౌరవానికి భంగకరంగా, వెకిలిగా మాట్లాడిన ఆయనపై మహిళా సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.
ఈ మేరకు నటుడు చలపతిరావుపై జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన లో ఫిర్యాదు చేశాయి. భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త దేవి తదితరులు పోలీసులకు తమ ఫిర్యాదును అందించారు. మహిళలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రమదాక్షరీ ఉమెన్ రైటర్స్ ఫేస్ బుక్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్లో అమ్మాయిలు మానసిక ప్రశాంతతకు హానికరమా అని యాంకర్ ప్రశ్నించినపుడు చలపతిరావు అమ్మాయిలపై చాలా అవమానకరంగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.