Women Police Stations
-
కొత్త జిల్లాల్లో కానరాని మహిళా ఠాణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళా పోలీస్ ఠాణాల ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ ఠాణాల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియని దుస్థితి ఏర్పడింది. ఐదేళ్లు పూర్తి కావచ్చినా నూతన జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై పోలీస్ శాఖ ఉలుకూపలుకు లేకుండా ఉండటం చర్చనీయాంశమైంది. కొత్త జిల్లాల్లో అవసరమే.. కొత్త జిల్లాలుగా ఏర్పడిన కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, నారాయణపేట, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో మహిళా ఠాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని కమిషనరేట్లలో ఒకే ఒక మహిళా ఠాణా ఉంది. ఉదాహరణకు రామగుండం కమిషనరేట్‌లో మహిళా పోలీస్‌స్టేషన్ మంచిర్యాలలో ఉండగా, పెద్దపల్లి జిల్లా నుంచి అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి డీసీపీ పరిధిలో మరో ఠాణా ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు. మహిళా స్టేషన్లలో పురుష ఇన్స్పెక్టర్లు.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న మహిళా స్టేషన్లలో కొన్ని చోట్ల పురుష ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించడం వివాదాస్పదమవుతోంది. మహిళలు తమ సమస్యలను పురుషులకు ఎలా చెప్పుకుంటారన్న కనీస అవగాహన లేకుండా పోస్టింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉదాహరణకు సైబరాబాద్ పరిధిలోని మహిళా ఠాణాకు పురుష ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. అలాగే కరీంనగర్ కమిషనరేట్‌లో ఉన్న మహిళా ఠాణా ఎస్హెచ్ఓగా పురుష ఇన్స్పెక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. రామగుండం కమిషనరేట్‌లోని ఉమెన్స్ పోలీస్‌స్టేషన్‌కు కూడా పురుష ఇన్స్పెక్టర్ బాధ్యతలు నిర్వర్తించడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ కమిషనరేట్‌లో ఉన్న రెండు మహిళా ఠాణాల్లో ఇద్దరు ఎస్హెచ్ఓలూ పురుష ఇన్స్పెక్టర్లే కావడం విమర్శలకు దారితీస్తోంది. పెరుగుతున్న మహిళా సిబ్బంది.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన పోలీస్ నియామకాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేసింది. సివిల్ (లా అండ్ ఆర్డర్) విభాగంలో 33 శాతం, ఆర్మ్డ్ (ఏఆర్) కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీనితో పోలీస్ శాఖలో మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామకాల్లో పోలీస్ శాఖలోకి వచ్చిన మహిళా అధికారులంతా నాన్ ఫోకల్ పోస్టుల్లో, డిప్యూటేషన్ విభాగాల్లో కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న మహిళా ఇన్స్పెక్టర్లను కనీసం మహిళా ఠాణాల్లో ఎస్‌హెచ్‌ఓలుగా నియమించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
మహిళల భద్రతకు 3వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌తోపాటు 8 మహానగరాల్లో మహిళల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. దీన్లో భాగంగా వివిధ సౌకర్యాల కల్పనకు ‘నిర్భయ’ నిధుల నుంచి రూ.3,000 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఆపదలో ఉన్నట్లు బాధితులు సమాచారం పంపే ప్యానిక్ బటన్స్, మహిళా పోలీస్ గస్తీ బృందాలతోపాటు ఫోరెన్సిక్, సైబర్ క్రైం నిపుణులతో కూడిన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాలు, స్మార్ట్ ఎల్ఈడీ వీధి దీపాలను అందుబాటులోకి తేనున్నట్లు హోం శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ప్రతిపాదిత చర్యలివీ.. ► మహిళలకు సమగ్ర భద్రతే లక్ష్యంగా ప్రకటించిన ఈ పథకంలో షీ–టీమ్స్ తరహాలో మహిళా పోలీసు గస్తీ బృందాలు, అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందించేందుకు ‘అభయం’ పేరుతో పోలీస్ వ్యాన్ల ఏర్పాటు. ► బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, చిన్నారులకు భద్రతను కల్పించేందుకు, వారిలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నేరాలకు అవకాశమున్న చోట్ల ‘రక్షిత’ ప్రాంతాల అభివృద్ధి, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానిస్తారు. ► ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతా చర్యలు, ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను అప్రమత్తం చేసే ప్యానిక్ బటన్లను అమర్చడం, సురక్షిత ప్రాంతాల్లో టాయిలెట్లు, చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాల(డార్మిటరీలు)ను అందుబాటులోకి తెస్తారు. ► బాధితులు నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వటానికి, తక్షణ సాయం పొందటానికి వీలుగా మహిళా హెల్ప్ డెస్క్‌లు, మహిళా కౌన్సిలర్లు, సైబర్ క్రైం, ఫోరెన్సిక్ నిపుణుల నియామకం. ఏ నగరానికి ఎంత? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ ఘటన నేపథ్యంలో 2013లో కేంద్రం నిర్భయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన కార్యక్రమానికి ‘నిర్భయ’ నిధి నుంచి రూ.2,919.55 కోట్లను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. 2018–19, 2020–21 సంవత్సరాల్లో అమలయ్యే ఈ పథకానికి గాను ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, చెన్నైకి రూ.425.06 కోట్లు, అహ్మదాబాద్‌కు రూ.253 కోట్లు, కోల్‌కతా రూ.181.32 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు , హైదరాబాద్‌కు రూ.282.50 కోట్లు, లక్నోకు రూ.195 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60: 40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. నేషనల్ క్రైం రికార్డ్స్’ బ్యూరో గణాంకాల ప్రకారం.. 2015లో మహిళలపై దేశవ్యాప్తంగా 3,29,243 నేరాలు జరగ్గా 2016 నాటికి 3,38,954కు పెరిగాయి. -
మహిళా పోలీస్స్టేషన్ల జాడేదీ!
వనపర్తికి చెందిన లలిత భర్త నుంచి ప్రాణహానీ ఉందని, వరకట్న వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలనుకుంది. కానీ వనపర్తి జిల్లా మొత్తంలో ఎక్కడా మహిళా ఠాణా లేదు. సివిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోరని, సివిల్ అధికారులతో తన ఇబ్బందులు ఎలా చెప్పుకోవాలో తెలియక సతమతమవుతూ పుట్టింటికి దారిపట్టింది. నిర్మల్ జిల్లాలో కృష్ణవేణి పరిస్థితి దాదాపు ఇలాంటిదే. భర్త పెట్టే హింసలు, వికృతచేష్టలను ఎవరితో చెప్పుకోలేక నరకం అనుభవిస్తోంది. మహిళలకంటూ ప్రత్యేకమైన పోలీస్స్టేషన్లు ఉంటే వారు సమస్యలను పూర్తి స్థాయిలో మహిళా సిబ్బందికి లేదా మహిళా అధికారులకు చెప్పుకోగలుగుతారు. అలాంటిది సివిల్ పోలీస్‌స్టేషన్‌లో పురుష అధికారులకు ఎలా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇదే సమస్య రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో తీవ్రతరమవుతోంది. సాక్షి, హైదరాబాద్ : మహిళలపై వేధింపులు, వరకట్న కేసులు, విడాకులు.. పలు రకాలైన మహిళలకు సంబంధించిన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ మహిళా పోలీస్స్టేషన్లు కనుమరుగమ య్యే పరిస్థితి కనిపిస్తోంది. పాత జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఉండగా, కొత్త జిల్లాల్లో మాత్రం ఒక్క మహిళా పోలీస్‌స్టేషన్ కూడా ఏర్పాటు కాలేదు. అయితే పోలీస్ నియామకాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఇస్తున్న నేపథ్యంలో మహిళా పోలీస్ స్టేషన్ల అవసరం పెద్దగా లేదని భావిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. నియమాకాల్లో 33 శాతం రిజర్వేషన్‌కు, మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు లింకు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో 1,484 మందే మహిళా సిబ్బంది ఉన్నారు. అంటే మొత్తం పోలీస్ బలగాల్లో 3.13 శాతం మాత్రమే. ఇందులో కూడా ఎక్కువ శాతం కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లే ఉన్నారు. అధికారుల విషయానికొస్తే 17 మంది మహిళా ఇన్స్పెక్టర్లు, 34 మంది ఎస్ఐలు, 58 మంది ఏఎస్ఐలు ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో తప్ప మిగతా ప్రాంతాల్లో మహిళా అధికారులకు మహిళా పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్వోలుగా పోస్టింగ్స్ ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. శాంతి భద్రతలకే పెద్దపీట.. మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయకపోతే శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్ అధికారి నేతృత్వంలోనే మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తారు. అయితే ప్రతిక్షణం బందోబస్తు, నేర నియంత్రణ ఇతరత్రా వ్యవహారాలతోనే సంబంధిత అధికారి బిజీగా ఉంటారు. మరి మహిళల సంబంధిత కేసులను ఎప్పుడు పర్యవేక్షిస్తారనేది ప్రశ్నగానే మిగులుతోంది. హెల్ప్‌డెస్క్‌తో సరి? మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారితోపాటు మరో ఇద్దరు ఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది వరకు కానిస్టేబుళ్లు ఉంటారు. రిజర్వేషన్ పెంపుతో నూతన పోలీస్స్టేషన్లు ఏర్పాటైతే వారిని ఎస్‌హెచ్‌ఓలుగా మహిళా ఎస్ఐలను నియమించొచ్చు. అలా కాదని నూతన జిల్లాల్లో మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయకుండా, శాంతి భద్రతల పోలీస్స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హెల్ప్ డెస్కుల్లో కానిస్టేబుల్/హెడ్‌కానిస్టేబుల్ ర్యాంకు సిబ్బందిని కూర్చోబెట్టాలని నిర్ణయించారు. మహిళా ఎస్ఐలు, ఏఎస్ఐలు ఉండరు. బాధిత మహిళలకు ఎస్ఐ లేదా ఏఎస్ఐ ర్యాంకు అధికారులు కౌన్సెలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. ఇవేవీ కాదన్నట్లు రిజర్వేషన్‌కు ముడిపెట్టడం వివాదాస్పదంగా మారుతోంది. -
మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు
న్యూఢిల్లీ: నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలను ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్భయ నిధుల్లో నుంచి ఖర్చు చేయనున్న మొత్తం రూ.2,919.55 కోట్లలో ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వీడియో పర్యవేక్షణ,ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, వీడియో ఫీడ్ షేరింగ్ ఉన్న పెట్రోలింగ్ వ్యాన్లను, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేస్తారు. -
ఐటీ కారిడార్ లో మహిళా పోలీస్ స్టేషన్లు: కేటీఆర్
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, జిల్లా పరిధిలో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ లో పదిరోజుల్లోగా మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు వెల్లడించారు. నాస్ కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో పనిచేసే మహిళలకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సిల్, ఐటీ పరిశ్రమ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లతో వారంలోగా సమావేశం ఏర్పాటు చేసి.. ఐటీ కంపెనీలో పనిచేసే మహిళ భద్రతకు పక్కా ప్రణాళికను రూపొందిస్తామన్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులున్నారని.. అందులో 25 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.