వనపర్తికి చెందిన లలిత భర్త నుంచి ప్రాణహానీ ఉందని, వరకట్న వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలనుకుంది. కానీ వనపర్తి జిల్లా మొత్తంలో ఎక్కడా మహిళా ఠాణా లేదు. సివిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోరని, సివిల్ అధికారులతో తన ఇబ్బందులు ఎలా చెప్పుకోవాలో తెలియక సతమతమవుతూ పుట్టింటికి దారిపట్టింది.
నిర్మల్ జిల్లాలో కృష్ణవేణి పరిస్థితి దాదాపు ఇలాంటిదే. భర్త పెట్టే హింసలు, వికృతచేష్టలను ఎవరితో చెప్పుకోలేక నరకం అనుభవిస్తోంది. మహిళలకంటూ ప్రత్యేకమైన పోలీస్‌స్టేషన్లు ఉంటే వారు సమస్యలను పూర్తి స్థాయిలో మహిళా సిబ్బందికి లేదా మహిళా అధికారులకు చెప్పుకోగలుగుతారు. అలాంటిది సివిల్ పోలీస్‌స్టేషన్‌లో పురుష అధికారులకు ఎలా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇదే సమస్య రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో తీవ్రతరమవుతోంది.
సాక్షి, హైదరాబాద్ : మహిళలపై వేధింపులు, వరకట్న కేసులు, విడాకులు.. పలు రకాలైన మహిళలకు సంబంధించిన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ మహిళా పోలీస్‌స్టేషన్లు కనుమరుగమ య్యే పరిస్థితి కనిపిస్తోంది. పాత జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఉండగా, కొత్త జిల్లాల్లో మాత్రం ఒక్క మహిళా పోలీస్‌స్టేషన్ కూడా ఏర్పాటు కాలేదు. అయితే పోలీస్ నియామకాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఇస్తున్న నేపథ్యంలో మహిళా పోలీస్ స్టేషన్ల అవసరం పెద్దగా లేదని భావిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. నియమాకాల్లో 33 శాతం రిజర్వేషన్‌కు, మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు లింకు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో 1,484 మందే మహిళా సిబ్బంది ఉన్నారు. అంటే మొత్తం పోలీస్ బలగాల్లో 3.13 శాతం మాత్రమే. ఇందులో కూడా ఎక్కువ శాతం కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లే ఉన్నారు. అధికారుల విషయానికొస్తే 17 మంది మహిళా ఇన్‌స్పెక్టర్లు, 34 మంది ఎస్‌ఐలు, 58 మంది ఏఎస్‌ఐలు ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో తప్ప మిగతా ప్రాంతాల్లో మహిళా అధికారులకు మహిళా పోలీస్‌స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలుగా పోస్టింగ్స్ ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
శాంతి భద్రతలకే పెద్దపీట..
మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయకపోతే శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్ అధికారి నేతృత్వంలోనే మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తారు. అయితే ప్రతిక్షణం బందోబస్తు, నేర నియంత్రణ ఇతరత్రా వ్యవహారాలతోనే సంబంధిత అధికారి బిజీగా ఉంటారు. మరి మహిళల సంబంధిత కేసులను ఎప్పుడు పర్యవేక్షిస్తారనేది ప్రశ్నగానే మిగులుతోంది.
హెల్ప్‌డెస్క్‌తో సరి?
మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఒక ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారితోపాటు మరో ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది వరకు కానిస్టేబుళ్లు ఉంటారు. రిజర్వేషన్ పెంపుతో నూతన పోలీస్‌స్టేషన్లు ఏర్పాటైతే వారిని ఎస్‌హెచ్‌ఓలుగా మహిళా ఎస్‌ఐలను నియమించొచ్చు. అలా కాదని నూతన జిల్లాల్లో మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయకుండా, శాంతి భద్రతల పోలీస్‌స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హెల్ప్ డెస్కుల్లో కానిస్టేబుల్/హెడ్‌కానిస్టేబుల్ ర్యాంకు సిబ్బందిని కూర్చోబెట్టాలని నిర్ణయించారు. మహిళా ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు ఉండరు. బాధిత మహిళలకు ఎస్‌ఐ లేదా ఏఎస్‌ఐ ర్యాంకు అధికారులు కౌన్సెలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. ఇవేవీ కాదన్నట్లు రిజర్వేషన్‌కు ముడిపెట్టడం వివాదాస్పదంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment