సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళా పోలీస్ ఠాణాల ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ ఠాణాల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియని దుస్థితి ఏర్పడింది. ఐదేళ్లు పూర్తి కావచ్చినా నూతన జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై పోలీస్ శాఖ ఉలుకూపలుకు లేకుండా ఉండటం చర్చనీయాంశమైంది.
కొత్త జిల్లాల్లో అవసరమే..
కొత్త జిల్లాలుగా ఏర్పడిన కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, నారాయణపేట, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో మహిళా ఠాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని కమిషనరేట్లలో ఒకే ఒక మహిళా ఠాణా ఉంది. ఉదాహరణకు రామగుండం కమిషనరేట్‌లో మహిళా పోలీస్‌స్టేషన్ మంచిర్యాలలో ఉండగా, పెద్దపల్లి జిల్లా నుంచి అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి డీసీపీ పరిధిలో మరో ఠాణా ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు.
మహిళా స్టేషన్లలో పురుష ఇన్‌స్పెక్టర్లు..
రాష్ట్రంలో ప్రస్తుతమున్న మహిళా స్టేషన్లలో కొన్ని చోట్ల పురుష ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించడం వివాదాస్పదమవుతోంది. మహిళలు తమ సమస్యలను పురుషులకు ఎలా చెప్పుకుంటారన్న కనీస అవగాహన లేకుండా పోస్టింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉదాహరణకు సైబరాబాద్ పరిధిలోని మహిళా ఠాణాకు పురుష ఇన్‌స్పెక్టర్ ఎస్‌హెచ్‌ఓగా పని చేస్తున్నారు.
అలాగే కరీంనగర్ కమిషనరేట్‌లో ఉన్న మహిళా ఠాణా ఎస్‌హెచ్‌ఓగా పురుష ఇన్‌స్పెక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. రామగుండం కమిషనరేట్‌లోని ఉమెన్స్ పోలీస్‌స్టేషన్‌కు కూడా పురుష ఇన్‌స్పెక్టర్ బాధ్యతలు నిర్వర్తించడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ కమిషనరేట్‌లో ఉన్న రెండు మహిళా ఠాణాల్లో ఇద్దరు ఎస్‌హెచ్‌ఓలూ పురుష ఇన్‌స్పెక్టర్లే కావడం విమర్శలకు దారితీస్తోంది.
పెరుగుతున్న మహిళా సిబ్బంది..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన పోలీస్ నియామకాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేసింది. సివిల్ (లా అండ్ ఆర్డర్) విభాగంలో 33 శాతం, ఆర్మ్‌డ్ (ఏఆర్) కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీనితో పోలీస్ శాఖలో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామకాల్లో పోలీస్ శాఖలోకి వచ్చిన మహిళా అధికారులంతా నాన్ ఫోకల్ పోస్టుల్లో, డిప్యూటేషన్ విభాగాల్లో కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న మహిళా ఇన్‌స్పెక్టర్లను కనీసం మహిళా ఠాణాల్లో ఎస్‌హెచ్‌ఓలుగా నియమించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment