Womens series
-
తొలి వన్డేలో టీమిండియా ఓటమి
లక్నో: 5 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు శుభారంభం లభించింది. లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక జట్టు 8 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మిథాలి రాజ్ (85 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్), వైస్ కెప్టెన్ హర్మాన్‌ప్రీత్‌కౌర్ (41 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత జట్టులో దీప్తి శర్మ (46 బంతుల్లో 27; 3 ఫోర్లు), మంధాన (20 బంతుల్లో 14; 3 ఫోర్లు), పూనమ్ రౌత్ (29 బంతుల్లో 10; ఫోర్)లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సఫారీ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (10-3-28-3) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు మ్లాబా(2/41), కాప్ (1/25), ఖాకా (1/29), కెప్టెన్ లస్ (1/23)లు రాణించారు. ఆనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు.. లిజెల్ లీ (122 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), వొల్‌వార్డ్డ్ (110 బంతుల్లో 80; 12 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో 40.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామికి (2/38) మాత్రమే వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 కీలకమైన వికెట్లు తీసుకున్న షబ్నిమ్ ఇస్మాయిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా (మార్చి 9) మంగళవారం జరుగనుంది. -
భారత్ రెండో విజయం
హిరోషిమా (జపాన్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెం ట్లో భారత్ రెండో విజయం నమోదు చేసింది. శనివారం ఉరుగ్వేపై ప్రదర్శించిన జోరును పోలాండ్‌పైనా చూపింది. ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో 5–0తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (28వ, 35వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జ్యోతి (21వ నిమిషంలో), వందనా కటారియా (26వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో రష్యా 6–0తో మెక్సికోపై, చిలీ 3–1తో జపాన్‌పై, ఉరుగ్వే 4–0తో ఫిజీపై గెలుపొందాయి. భారత్ గ్రూప్‌లోని తన చివరి మ్యాచ్‌ను మంగళవారం ఫిజీతో ఆడనుంది. -
మహిళల సిరీస్‌పై సందిగ్ధత
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ఈ నెలలో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ సందిగ్ధంలో పడింది. యూఏఈలో ఈ నెలలో జరగాల్సిన ఈ టోర్నీలో ఆడేందుకు ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఎదురు చూస్తోంది. ఒకవేళ భారత్ ఈ సిరీస్‌లో ఆడకపోతే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోతుంది. భారత్ ఆడకపోతే పాక్‌కు ఆరు పాయింట్లు ఇస్తారు. తద్వారా ఆ జట్టు వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో పాటు 2017 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. భారత్ మాత్రం మరో 9 దేశాలతో కలిసి క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి వస్తుంది. -
భారత జట్టులో కల్పన
న్యూజిలాండ్‌తో మహిళల సిరీస్‌కు ఆంధ్ర క్రికెటర్ సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టులో ఆంధ్ర క్రీడాకారిణి ఆర్. కల్పనకు స్థానం లభించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌వుమన్ అయిన కల్పన మొదటి సారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకుంది. ఆంధ్ర తరఫున ఒక మహిళా క్రికెటర్ భారత జట్టుకు ఎంపిక కావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్, కివీస్‌ల మధ్య ఈ నెల 28నుంచి బెంగళూరులో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. కల్పనను ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు సోమయాజులు, కార్యదర్శి గంగరాజు తదితరులు అభినందించారు.