భళా.. సాయి మేఘన మేధస్సు..
♦ క్రీ.శ. 1 నుంచి 9999 వరకు కేలండర్ జ్ఞాపకం
♦ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
కరీంనగర్ కల్చరల్: అద్భుత మేధస్సుతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది కరీంనగర్‌కు చెందిన ఎలగందుల సాయిమేఘన. జిల్లాకేంద్రానికి చెందిన డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్-సౌమ్య కుమార్తె సాయిమేఘన(14) కరీంనగర్లో అల్ఫోర్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. చేంజ్ లర్నింగ్ అకాడమీలో సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ పొందుతోంది. క్రీస్తుశకం 1వ సంవత్సరం నుంచి క్రీస్తుశకం 9999 వరకు సంవత్సరాల కేలండర్లను జ్ఞాపకం పెట్టుకుంది. సంవత్సరం, నెల తేదీ చెబితే వెంటనే అది ఏ రోజో చెబుతోంది. వివిధ దేశాల్లో అనుసరించే అన్ని నెలలు, తెలుగు సంవత్సరాల పేర్లు చెబుతూ అబ్బుర పరుస్తోంది.
శుక్రవారం కరీంనగర్‌లోని శ్వేత హోటల్ హాల్లో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు బింగి నరేందర్, స్వర్ణశ్రీ సమక్షంలో సాయిమేఘన తన మేధస్సు ప్రదర్శించింది. ఆమె అద్భుత మేధాశక్తిని గుర్తించిన వారు రికార్డును నమోదు చేసుకుని జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో సాయి మేఘన తల్లిదండ్రులతో పాటు మెమరీ శిక్షకుడు హరీశ్‌కుమార్, చేంజ్ లర్నింగ్ అకాడమీ ప్రధాన శిక్షకుడు వేణుకుమార్, ఎస్సారార్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బి. మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.