ఆర్టీసీ సమ్మె యోచన వాయిదా
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) నిధులను తిరిగి చెల్లించేందుకు అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయించారు. రూ.253 కోట్ల సీసీఎస్ నిధులను ఇప్పటి వరకు ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. వీటిని వెంటనే చెల్లించాలని కొంత కాలంగా కార్మికులు ఆందోళనలకు దిగినా.. యాజమాన్యం స్పందించకపోవడంతో శనివారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ యాజమాన్యం హడావుడిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను సంప్రదించి సమ్మె విరమింపజేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిపించింది.
ఈ నెల 20 నాటికి సీసీఎస్ నిధులను చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో ఇరు ప్రాంతాల్లో సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం రాత్రి ప్రకటించింది. కాగా, సీసీఎస్ రుణాల అంశంపై స్పష్టత రావడంతో సమ్మె యోచనను విరమించుకున్న ఎంప్లాయీస్ యూనియన్ ఇతర డిమాండ్లపై శనివారం మరో సమ్మెకు సంబంధించి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ, లీవ్ ఎన్క్యాష్మెంట్, డీఏ బకాయిల చెల్లింపు తదితర అంశాలపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించని నేపథ్యంలో సమ్మెకు ఉపక్రమించాలని నిర్ణయించింది.