16 ప్రపంచ టైటిళ్లు సాధించా.. ఇంకేం చేయాలి?
న్యూఢిల్లీ: 16 సార్లు ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ.. ఈ ఏడాది కూడా తనకు పద్మభూషణ్ అవార్డు రాకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఈ అవార్డు రావాలంటే ఇంకా సాధించాలో తనకు అర్థంకావడం లేదని ప్రశ్నించాడు.
బెంగళూరుకు చెందిన పంకజ్ గత ఎనిమిదేళ్లలో ఎనిమిది ప్రపంచ టైటిళ్లు సాధించాడు. భారత్ అత్యుత్తమ బిలియర్డ్స్, స్నూకర్ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. అతనికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వంతో పాటు భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య.. కేంద్రానికి సిఫారసు చేశాయి. కాగా బుధవారం పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు. దీంతో నిరాశకు గురైన పంకజ్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇటీవల పుణెలో 28వ జాతీయ టైటిల్‌ను గెల్చుకున్న పంకజ్‌ను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ అభినందించగా.. అందుకు అతను ధన్యవాదాలు తెలుపుతూ, తాను 16 ప్రపంచ టైటిళ్లు, ఆసియా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించానని, అయినా తనకు పద్మభూషణ్ అవార్డుకు పరిగణనలోకి తీసుకోలేదని, ఇంకా ఏం సాధించాలో తనకు అర్థంకావడం లేదంటూ కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. 2006లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు తీసుకున్న పంకజ్.. 2009లో పద్మశ్రీ అవార్డును స్వీకరించాడు.