World Economic Situation
-
భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత ఫైనాన్షియల్ వ్యవస్థ నియంత్రణలకు అనుగుణంగా పటిష్ట బాటలో ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 27వ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరిస్తూ, ‘‘భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఏదైనా తీవ్ర సమస్య సూచిక కనిపించిన వెంటనే మనం ఎల్లప్పుడూ అప్రమత్తం కావాలి. అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన కాలిపై మనం నిలబడాలి’’ అని అన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యం అలాగే క్రెడిట్ సూచీ ఎదుర్కొంటున్న ద్రవ్య పరమైన ఒత్తిడి గురించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. వీటి ప్రభావం మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై లేదని భావిస్తున్నాం. ► ప్రభుత్వ బాండ్ల మార్కెట్ విషయంలో సాంకేతికత వినియోగం మరింత పెంపొందేలా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. పెట్టుబడిదారులు ఆర్బీఐ లేదా సెబీ ఇన్ఫ్రా ద్వారా ఇందుకు సంబంధించి పొందుతున్న సదుపాయాలకన్నా, సాంకేతికత ద్వారా పొందుతున్న ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. ఇవే సాంకేతిక చర్యల మరింత పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం. ► అంతర్జాతీయంగా వస్తున్న ముందస్తు హెచ్చరిక సూచికలకు అనుగుణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకోవడం, ఆయా అంశాల్లో భారత్ సంసిద్ధత, నియంత్రణ నాణ్యతను మెరుగుపరచడం, దేశంలో కార్పొరేట్లు అలాగే గృహాల రుణ స్థాయిలు, కేవైసీ సరళీకరణ–క్రమబద్ధీకరణ, తద్వారా ఆర్థిక రంగంలో నియంత్రిత సంస్థలపై అనవసర భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై కౌన్సిల్ చర్చించింది. ఆయా అంశాలన్నీ డిజిటల్ ఇండియా అవసరాలను తీర్చడానికి మరింత పటిష్ట ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తాయని భేటీ భావించింది. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీ నిర్ణయాలు, ఎఫ్ఎస్డీసీ గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కార్యాచరణ వంటి అంశాలపైనా తాజా కౌన్సిల్ దృష్టి సారించింది. ► ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాషిస్ పాండా, దివాలా బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ రవి మిట్టల్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్‌గా కొత్తగా నియమితులైన దీపక్ మెహంతీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కృష్టారావు కరాద్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్‌జోషి, తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై దృష్టి... కాగా, ఎఫ్ఎస్డీసీ సమావేశం ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రెగ్యులేటర్లకు సూచించింది. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ చేశాయి. దాదాపు 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించిన ఈ మొత్తాలను గత 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. డిపాజిటర్లు, లబ్ధిదారులు వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయగల కేంద్రీకృత పోర్టల్ మూడు లేదా నాలుగు నెలల్లో సిద్ధమవుతుందని గత నెలలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. -
కష్ట కాలంలోనూ భారత్ ఎకానమీ దూకుడు
న్యూఢిల్లీ: క్లిష్టతరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లోనూ భారత్ 2023 సంవత్సరాలన్ని నెట్టుకురాగలుగుతుందన్న విశ్వాసాన్ని పారిశ్రామిక వేదిక– అసోచామ్ వ్యక్తం చేసింది. పటిష్ట వినియోగ డిమాండ్, మెరుగైన కార్పొరేట్ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ల సహాయంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన బాటలో నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ► రబీ పంటలు బాగుంటాయని తొలి సంకేతాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగం సానుకూల పనితీరును ఇది సూచిస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ). ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు– ఎరువులు వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుంది. ► పర్యాటకం, హోటళ్లు రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, విచక్షణతో కూడిన వినియోగదారు వస్తువుల కొనుగోళ్లు, ఆటోమొబైల్స్ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్ కనిపిస్తోంది. ► అయితే, అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల గురించి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరు, పర్యవసానాలపై భారత్ జాగరూకతలో ఉండాల్సిన అవసరం ఉంది. ► అభివృద్ధి చెందిన కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అంచనా వేసింది. అధిక వడ్డీ ప్రభావం భారత్ కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లపై కూడా ప్రతిబింబిస్తోంది. అయితే ఆయా ప్రతికూలతలను భారత్ కార్పొరేట్ రంగం అధిగమిస్తోంది. ► ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ 2022–23లో 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. 2023–24లో కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలూ ఉన్నాయి. -
బంగారం మరింత మెరిసే అవకాశం
కరోనా వైరస్ నేపథ్యం... పెట్టుబడిదారులను పసిడివైపు పరుగులు తీసేలా చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మాంద్యంలోకి జారుకుంటున్న పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఈక్విటీల్లో తీవ్ర ఆటుపోట్లు తత్సంబంధ పరిస్థితుల్లో పసిడి తిరిగి తన చరిత్రాత్మక గరిష్ట రికార్డు స్థాయి... ఔన్స్ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా దూసుకుపోయే అవకాశాలే సుస్పష్టమవుతున్నాయి. కరోనా కట్టడి జర క్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే, డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో 1,900 డాలర్లకు చేరడం ఖాయమన్న విశ్లేషణలూ ఉన్నాయి. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు –5 శాతంపైగా క్షీణతలోకి జారిపోతుందన్న అంచనాలు ఇక్కడ గమనార్హం. అటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతోపాటు, ఇటు వర్థమాన దేశాల విషయంలోనూ ఆర్థిక వ్యవస్థలు క్షీణతనే నమోదుచేస్తాయని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం పావుశాతంగా ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగెటివ్‌లోకి వెళితే, పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. 12వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో ఒక దశలో పసిడి 1,752 డాలర్ల స్థాయినీ చూడ్డం ఇక్కడ ముఖ్యాంశం. దేశంలోనూ రూ.50 వేలు దాటే అవకాశం అంతర్జాతీయ ధోరణే కాకుండా, డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి భారత్‌లో పసిడికి బలమవుతోంది. ఈ పరిస్థితుల్లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.50,000 దిశగా నడిచే అవకాశాలే స్పష్టమవుతున్నాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు శుక్రవారం రూ.47,334 వద్ద ముగిసింది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 4.8 శాతం:ఐరాస
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు 2013లో 4.8 శాతమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనాలను సమితి 6.1 శాతంగా పేర్కొంది. 2014 వృద్ధి రేటును కూడా 1.2 శాతం తగ్గించి 5.3 శాతానికి కుదించింది. 2015లో వృద్ధి రేటును 5.7 శాతంగా అంచనావేసింది. అమెరికా సహాయక ప్యాకేజీల ఉపసంహరణల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సిద్ధం కావాలని కూడా ఐక్యరాజ్యసమితి ఆర్థిక విశ్లేషణా నివేదిక సూచించింది. 2014లో ప్రపంచ వృద్ధి రేటు 3 శాతం ఉంటుందన్నది సమితి అంచనా. రూపాయిపై ‘ఫెడ్’ ప్రభావం: బీఆఫ్‌ఏ: కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్) నిర్ణయం స్వల్పకాలంలో భారత రూపాయి మారకపు విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఆఫ్‌ఏ మిరిల్ లించ్) పేర్కొంది.