‘కోట్లా’టలో నెగ్గేదెవరు?
టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ నేడు
ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ అమీతుమీ
రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
ఒకవైపు వరుస విజయాలతో అజేయంగా నిలిచిన జట్టు... మరోవైపు తడబడుతూనే అయినా అంచనాలను దాటి సెమీస్ చేరిన జట్టు... ఒకరేమో మాజీ చాంపియన్... మరొకరేమో తొలిసారి ఫైనల్‌కు చేరాలనే పట్టుదలతో ఉన్న బృందం... ఇరు జట్లలోనూ ఆల్‌రౌండ్ నైపుణ్యం... పిచ్ చూస్తేనేమో అనిశ్చితికి మారుపేరు... ఏ రోజు ఏ మ్యాచ్‌కు ఎలా ప్రవర్తిస్తుందో తెలియని ఫిరోజ్ షా కోట్లా పిచ్‌పై... న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరి ఈ సమఉజ్జీల ‘కోట్లా’టలో నెగ్గేదెవరో..!
న్యూఢిల్లీ: గత ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో న్యూజిలాండ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు కూడా అదే తరహా టీమ్ స్పిరిట్ కనబరుస్తున్న ఆ జట్టు టి20 ప్రపంచకప్‌లోనూ తుది పోరుకు అర్హత సాధించాలని భావిస్తోంది. అయితే ఆ జట్టుకు ఇంగ్లండ్ రూపంలో సమఉజ్జీ ఎదురుగా నిలిచింది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. కివీస్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉండగా, తొలి మ్యాచ్ తర్వాత కోలుకున్న ఇంగ్లండ్ సవాల్ విసురుతోంది. ఇంగ్లండ్ 2010లో టైటిల్ గెలుచుకోగా, న్యూజిలాండ్ ఒక్కసారీ ఫైనల్‌కు చేరలేదు.
ఓటమి లేకుండా...
ప్రపంచకప్‌కు ముందు బ్రెండన్ మెకల్లమ్ దూరం కావడం, చెప్పుకోదగ్గ స్టార్లు లేకపోవడంతో భారత్‌లో జరిగే టోర్నీలో న్యూజిలాండ్ జట్టుపై ఎవరికీ అంచనాల్లేవు. కానీ లీగ్ దశలో అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా ఇప్పుడు కివీస్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. 162 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ జట్టు తరఫున టాప్‌స్కోరర్‌గా నిలిచిన ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌కు... రాస్ టేలర్, రోంచీ, విలియమ్సన్ అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ తొణకకుండా జట్టును నడిపిస్తుండగా... రోంచీ, ఇలియట్ కూడా ధాటిగా ఆడగల సమర్థులు. అండర్సన్ రూపంలో కీలక ఆల్‌రౌండర్ ఆ జట్టుకు ఉన్నాడు. అన్నింటికి మించి ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం బాగా పని చేసింది. నాథన్ మెకల్లమ్ ఆఫ్ స్పిన్, సోధి లెగ్‌స్పిన్‌కు తోడు వెటోరికి డూప్లికేట్‌గా కనిపిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ శాంట్నర్ కివీస్‌కు బలంగా మారారు. ముగ్గురు కలిసి టోర్నీలో ఇప్పటికి 20 వికెట్లు పడగొట్టారు. మరోసారి కివీస్ తమ స్పిన్‌ను బలంగా నమ్ముతోంది. దూకుడైన ఆటకు మారుపేరుగా మారిన ఈ జట్టును ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు సులువు కాదు.
ఇంగ్లండ్ మారిపోయింది
తొలి మ్యాచ్‌లో క్రిస్ గేల్ చేతిలో చావుదెబ్బ తిన్న తర్వాత ఇంగ్లండ్ కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు. దక్షిణాఫ్రికాతో 230 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఛేదించడం అనూహ్యం. అఫ్ఘానిస్తాన్‌తో తడబడినా, శ్రీలంకపై ఆ జట్టు బ్యాట్స్‌మెన్ మళ్లీ మెరిశారు. టి20 స్పెషలిస్ట్‌లతో టోర్నీకి వచ్చిన ఆ జట్టు మంచి ఫలితాలే సాధిం చింది. ముఖ్యంగా బట్లర్ మరోసారి తన దూకుడైన ఆటతో చెలరేగిపోతుండగా... జేసన్ రాయ్ మంచి ఆరంభం ఇస్తున్నాడు.
టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు ఉన్న జో రూట్ కూడా 150 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం ఇంగ్లండ్ ఆటతీరు మారిందనడానికి నిదర్శనం. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల రూట్‌తో పాటు కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ కూడా ఆ జట్టు బలం. ఇంగ్లండ్ బౌలింగ్ మాత్రం అంత గొప్పగా లేదు.
జట్లు (అంచనా): న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, అండర్సన్, రాస్ టేలర్, రోంచీ, గ్రాంట్ ఇలియట్, శాంట్నర్, సోధి, మిల్నే, మెకల్లమ్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, హేల్స్, రూట్, బట్లర్, మోర్గాన్, స్టోక్స్, అలీ, జోర్డాన్, విల్లీ, ప్లంకెట్/టోప్లీ.
పిచ్, వాతావరణం
టోర్నీలో చాలా వేదికల్లాగే ఫిరోజ్ షా కోట్లాలో నెమ్మదైన పిచ్ ఉంది. ఇంగ్లండ్ ఇప్పటికే ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడింది. వాతావరణం సాధారణంగా ఉంది. వర్షం పడే అవకాశం లేదు.
ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య ఇప్పటివరకూ 13 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 8 గెలిచి, నాలుగు ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లలో మాత్రం నాలుగు మ్యాచ్‌లు జరిగితే చెరో రెండు గెలిచాయి.