World T20 Semis
-
టీమిండియా వ్యూహం ఫలించింది..
ముంబై: వెస్టిండీస్‌తో టి-20 ప్రపంచ కప్ సెమీస్‌లో టీమిండియా వ్యూహం ఫలించింది. ఈ టోర్నీలో రాణించలేకపోతున్న ఓపెనర్ శిఖర్ ధవన్‌ను పక్కనబెట్టి అతని స్థానంలో అజింక్యా రహానెను తుది జట్టులోకి తీసుకోవడం సత్ఫలితాన్నిచ్చింది. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానె శుభారంభాన్నందించారు. రోహిత్, రహానె తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. కాగా 31 బంతుల్లో మూడేసి ఫోర్లు, సిక్సర్లతో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న రోహిత్ (43).. బద్రీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక రహానె తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రహానె భారీ షాట్లకు ప్రయత్నించకున్నా.. రోహిత్‌కు, ఆ తర్వాత కోహ్లీకి అండగా ఉంటూ వేగంగా పరుగులు రాబట్టాడు. రహానె 35 బంతుల్లో 40 పరుగులు చేశాడు. -
ధవన్ స్థానంలో రహానె వచ్చాడు..
ముంబై: వెస్టిండీస్‌తో టి-20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేశారు. ఈ మెగా ఈవెంట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ఓపెనర్ శిఖర్ ధవన్‌ను కీలక సెమీస్ పోరుకు పక్కనబెట్టారు. రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైన అజింక్యా రహానెను ధవన్ స్థానంలో ఓపెనర్‌గా తీసుకున్నారు. ఇక గాయం కారణంగా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ దూరమవడంతో మనీశ్ పాండేకు తుది జట్టులో చాన్స్ దక్కింది. టీమిండియా కెప్టెన్ ధోనీ అండ్ కో బస చేసిన హోటల్లో ఈ రోజు సమావేశమై తుది జట్టులో మార్పుల గురించి చర్చించారు. ఈ టోర్నీలో టీమిండియా ఎక్కువగా విరాట్ కోహ్లీపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో విరాట్‌కు ధోనీ, యువరాజ్ మాత్రమే అండగా ఉంటున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధవన్‌తో పాటు సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా కూడా రాణించలేకపోతున్నారు. దీనికితోడు యువరాజ్ గాయంతో దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టులో మార్పులు చేశారు. రహానె, పాండేలకు అవకాశం ఇచ్చారు. -
'టీమిండియా.. మేమంతా మీ వెనుకే ఉన్నాం'
ముంబై: మరికొన్ని గంటల్లో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే టి-20 ప్రపంచ కప్ సెమీస్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఎంతో ఉత్సుకతో ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని మాస్టర్ వెల్లడించలేదు. 'ఇది ఓపెన్ గేమ్' అని వ్యాఖ్యానించాడు. 'క్రికెట్‌ను ఆస్వాదించండి. ఆటపైనే దృష్టిపెట్టండి. ఫలితం వస్తుంది. మేమంతా మీ వెనుకే ఉన్నాం' అని టీమిండియాకు సచిన్ శుభాకాంక్షలు తెలిపాడు. 'నా మనసు ఎప్పుడూ భారతే అనే చెబుతోంది. మరొకటి ఉండదు. అయితే ఈ రోజు జరిగే సెమీస్ ఓపెన్ గేమ్. హోరాహోరీ పోరాటం ఉండవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ అత్యుత్తమ క్రికెట్ ఆడుతోంది. ఆ జట్టులో కొందరు మేటి ఆటగాళ్లున్నారు. మనోళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో గత మ్యాచ్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సత్తాచాటింది. భారత్ ఇదే జోరు కొనసాగిస్తుందని ఆశిస్తున్నా' అని సచిన్ అన్నాడు.