ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. వరుసగా ఆరోసారి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. 21వ వార్షిక ర్యాంకింగ్స్‌లో ఈ ఏడాది నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో నిలిచారు.ప్రతీ ఏడాది వినోద, వ్యాపార, రాజకీయ, దాతృత్వం, తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్‌లను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రభావాన్ని చూపిస్తున్న మహిళా వ్యాపారవేత్తలు, ఎంటర్టైనర్లు, రాజకీయ నాయకులు, దాతలు, విధాన రూపకర్తలతో కూడిన వార్షిక జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది. నిర్మలా సీతారామన్‌తోపాటు, ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా 81వ స్థానంలో నిలవగా, బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 82వ స్థానంలో ఉన్నారు.ఇక శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం, 2022లో 36వ స్థానం, 2023లో 32వ స్థానంలో నిలిచారు. యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వరుసగా మూడోసారి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , మొదటి ఐదు స్థానాల్లో కొత్తవారు మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ చోటు దక్కించుకున్నారు.