ఆ రెజ్లర్ ఎవరికీ కనిపించకుండా...
సోఫియా: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది ఏ ఆటగాడికైనా అంతిమ లక్ష్యం. అయితే అనుకోకుండా ఇలాంటి అవకాశం వచ్చినా.. ఓ రెజ్లర్ మాత్రం విచిత్రంగా ఎవరికీ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోయేసరికి అతడి స్థానంలో తమ జూనియర్ జాతీయ జట్టు కోచ్‌ను బరిలోకి దింపుతున్నారు. బల్గేరియాకు చెందిన 27 ఏళ్ల ఫ్రీస్టయిల్ రెజ్లర్ ల్యూబెన్ ఇలీవ్ ఒలింపిక్స్‌లో 125కేజీ కేటగిరీలో పాల్గొనాల్సి ఉంది. అయితే రష్యాలో శిక్షణ శిబిరంలో పాల్గొన్న అనంతరం ఈనెల 4న ఆటగాళ్లంతా బల్గేరియాకు చేరుకున్నా ఇలీవ్ మాత్రం మిస్ అయ్యాడు.
‘అతడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీడం లేదు. మేం అతడిని చేరుకోలేకపోతున్నాం. అందుకే తన స్థానంలో జూనియర్ కోచ్ డిమిటర్ కుమ్చెవ్ను ఆడిస్తున్నాం’ అని ఫ్రీస్టయిల్ కోచ్ వాలెంటిన్ రేచెవ్ అన్నారు. మేలో జరిగిన యూరోపియన్ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో బెలారస్ రెజ్లర్ యూసుప్ జలిలౌ డోపింగ్‌లో పట్టుబడడంతో ఇలీవ్ రియో బెర్త్ దక్కించుకున్నాడు.