WTA tournament
-
ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన సబలెంకా
అడిలైడ్: గత ఏడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సబలెంకా ఈ సంవత్సరాన్ని టైటిల్‌తో ప్రారంభించింది. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో సబలెంకా 6–2, 7–6 (7/4)తో క్వాలిఫయర్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ టోర్నీలో సబలెంకా ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సబలెంకా కెరీర్లో ఇది 11వ టైటిల్‌కాగా... ఆమెకు 1,20,150 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 98 లక్షల 92 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెరెనాకు చుక్కెదురు
లెక్సింగ్టన్ (అమెరికా): కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో... ఆరు నెలల విరామం తర్వాత తాను ఆడుతున్న తొలి టోర్నమెంట్లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్ సీడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సెరెనా 6–1, 4–6, 6–7 (5/7)తో అమెరికాకే చెందిన ప్రపంచ 116వ ర్యాంకర్ షెల్బీ రోజర్స్ చేతిలో ఓడిపోయింది. తన 25 ఏళ్ల అంతర్జాతీయ ప్రొఫెషనల్ కెరీర్లో సెరెనా ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో టాప్–100 బయట ఉన్న వారి చేతిలో పరాజయం పాలైంది. టాప్–100లో లేని క్రీడాకారిణి చేతిలో సెరెనా ఓడిపోవడం చివరిసారి 2012లో జరిగింది. -
అక్క ఫై చెల్లిదే ఫైచెయ్యి...
లెక్సింగ్టన్ (అమెరికా): కరోనా విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో టైటిల్ దిశగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో అడుగు వేసింది. కెంటకీలో జరుగుతున్న టాప్ సీడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో సెరెనా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 3–6, 6–3, 6–4తో తన అక్క వీనస్ విలియమ్స్ (అమెరికా)పై గెలిచింది. తమ 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముఖాముఖిగా తలపడటం ఇది 31వసారి కాగా వీనస్‌పై సెరెనా గెలవడం ఇది 19వ సారి కావడం విశేషం. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 14 ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి వీనస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నిర్ణాయక మూడో సెట్లో ఒకదశలో సెరెనా 2–4తో వెనుకబడినా... ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు 40 ఏళ్ల వీనస్ ఈ మ్యాచ్‌లో 11 డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో అమెరికాకే చెందిన షెల్బీ రోజర్స్‌తో సెరెనా ఆడుతుంది. ‘నా కెరీర్లో తొలి టైటిల్ సాధించేందుకు ఇక్కడకు రాలేదు. విరామం తర్వాత నా ఆటతీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి, నా ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి వచ్చాను’ అని 38 ఏళ్ల సెరెనా వ్యాఖ్యానించింది. -
తొలి చాంప్ ఫియోనా
పలెర్మో (ఇటలీ): కరోనా వైరస్‌తో మార్చి రెండో వారంలో అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లకు బ్రేక్ పడింది. ముఖ్యంగా కరోనా దెబ్బకు విలవిల్లాడిన దేశాల్లో ఇటలీ ఒకటి. అయితే ఇటలీతోపాటు యూరోప్ దేశాల్లో క్రమక్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా గత నెలలో యూరోప్‌లోని కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా ఎగ్జిబిషన్ టెన్నిస్ టోర్నీలు జరిగాయి. అంతా సవ్యంగా ఉందనిపించడంతో ఆగస్టు 3న ఇటలీలోని పలెర్మో పట్టణంలో మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఆధ్వర్యంలో అధికారిక టోర్నమెంట్ పలెర్మో ఓపెన్ మొదలైంది. ఐదు నెలల విరామం తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ అధికారిక టెన్నిస్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ రైజింగ్ స్టార్ క్రీడాకారిణి ఫియోనా ఫెరో చాంపియన్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్, ప్రపంచ 53వ ర్యాంకర్ ఫియోనా ఫెరో 6–2, 7–5తో ప్రపంచ 22వ ర్యాంకర్, నాలుగో సీడ్ అనెట్ కొంటెవి (ఎస్తోనియా)పై విజయం సాధించింది. -
ప్రాంజల జంట ఓటమి
ముంబై: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల–కర్మన్‌కౌర్ థండి (భారత్) జోడీ 4–6, 2–6తో దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా)–ఇరీనా ఖరోమచెవా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత ఆశాకిరణం అంకిత రైనా 6–2, 6–2తో పియెంగ్టర్న్ ప్లిపుయెచ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ డబ్ల్యూటీఏ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అమన్డైన్ హెసీ (ఫ్రాన్స్)తో అంకిత ఆడుతుంది. -
ఐదేళ్ల తర్వాత భారత్‌లో డబ్ల్యూటీఏ టోర్నీ
న్యూఢిల్లీ: డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు మరోసారి భారత్ వేదికైంది. ఐదేళ్ల తర్వాత ముంబైలో ఈ టోర్నీ జరగనుంది. 2012లో చివరిసారిగా పుణేలో డబ్ల్యూటీఏ టోర్నీ జరిగింది. దీని వల్ల ప్రపంచ టాప్–50 క్రీడాకారిణులతో తలపడే అవకాశం భారత అమ్మాయిలకు లభిస్తుంది. మెయిన్ డ్రా, క్వాలిఫయింగ్‌లో చెరో నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇస్తారు. చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నీ కూడా ఈ సారి మహారాష్ట్రకు తరలింది. ఇప్పుడిది ‘మహారాష్ట్ర ఓపెన్’ పేరుతో పుణేలో జరగనుంది. -
సెమీస్‌లో సానియా జోడీ
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ సింగపూర్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో సానియా-కారా బ్లాక్ 6-3, 2-6, 12-10తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)లపై గెలిచారు. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను మూడుసార్లు చొప్పున కోల్పోయాయి. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో ఆధిక్యం దోబూచులాడినా తుదకు సానియా జంటనే విజయం వరించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటతో సానియా జోడీ తలపడుతుంది. పెశెక్, స్రెబోత్నిక్తో జరిగిన క్వార్టర్స్‌లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ ద్వయం 1-2తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. ఈ టోర్నీలో కుద్రయెత్సేవా (రష్యా)-రొడియోనోవా (ఆస్ట్రేలియా); సు వీ సెయి (చైనీస్ తైపీ)-పెంగ్ షుయె (చైనా) జంటలు కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.