కాసుల కోసం కక్కుర్తి !
యాదాద్రిలో కాంట్రాక్టర్లతో దేవస్థానం అధికారుల కుమ్మక్కు
రూపాయి అదనంగా టెండర్ వేసుకోమని సలహా
దేవస్థానంపై ఏడాదికి రూ.1.50 లక్షల అదనపు భారం
యాదగిరికొండ : ‘యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుకుందాం.. ఇందులో అందరూ కంకణబద్ధులు కావాలి. ఎలాంటి అక్రమాలకు తావివ్వొద్దు.’
ఇవీ.. సీఎం కేసీఆర్ నిత్యం చెబుతున్న మాటలు. వీటిని దేవస్థానం అధికారులు పట్టించుకున్నట్లు లేరు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆలయంపై అదనపు భారం పడే విధంగా వ్యవహరిస్తున్నారు. లడ్డూ తయారీ కాంట్రాక్ట్ వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దేవస్థానం అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి లడ్డూ తయారీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ దారులు ఎంత తక్కువకు టెండరు వేస్తే దాన్ని దేవస్థానం అధికారులు ఖరారు చేసేవారు. ఈసారి ఇందుకు భిన్నంగా జరిగింది. గత సంవత్సరం కన్నా అదనంగా మరో రూపాయి ఎక్కువగా టెండర్ వేసుకోమని దేవస్థానం అధికారులే.. లడ్డూ తయారీదారులను పురమాయించారు. గతంలో పెద్ద లడ్డుకు (400 గ్రాములు) రూ.13.50.. చిన్న లడ్డుకు(100 గ్రాములు) రూ.14.50 ఉండగా.. పెంచిన రూపాయితో పెద్ద లడ్డుకు రూ.14.50, చిన్న లడ్డుకు రూ.15.50 చొప్పున కాంట్రాక్టర్కు దేవస్థానం చెల్లించాల్సి వస్తోంది.
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. అధికారుల వత్తాసు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో లడ్డూ తయారీకి టెండర్లు నిర్వహించారు. అయితే భద్రాచలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కూడా తక్కువ ధరకే టెండర్ దాఖలు చేసినట్టు సమాచారం. దీంతో స్థానిక కాంట్రాక్టర్లు కుమ్మక్కై అతడిని బెదిరించి టెండర్ ఉపసంహరించుకునేలా చేసినట్లు వినికిడి. ఇందులో స్థానిక అధికారుల ప్రమేయం ఉన్నట్లు.. వారు స్థానిక కాంట్రాక్టర్లకు వత్తాసు పలికినట్టు ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్ నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కాసుల కోసం కక్కుర్తి పడి గత ఏడాది కంటే రూపాయి అదనంగా కట్టబెట్టడం గమనార్హం.
రాబడి నిల్
యాదాద్రి దేవస్థానం అభివృద్ధి పేరుతో ఈ ఏడాది కొండపైన ఉన్న వసతి గదులను తొలగించడం, ప్రధానాలయంలోకి భక్తులను అనుమతించకపోవడంతో ఆలయానికి ఆదాయ వనరులు భారీగానే తగ్గిపోయాయి. దీంతో అధికారుల, సిబ్బంది వేతనాలను చెల్లించడం కష్టతరంగా మారింది. ఈ తరుణంలో ఆలయంపై అదనపు భారం పడేలా అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు తూట్లు
లడ్డూ తయారీదారులు కనీస నిబంధనలు కూడా పాటించడం లేదనే విమర్శలు లేకపోలేదు. గతంలో లడ్డూ తయారీదారులు ఇష్టారీతిన వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. లడ్డూలో వెంట్రుకలు ఇతరత్రా వస్తుండడంతో తయారీదారుల చేతులకు, నోటికి, తలకు గ్లౌసులు ధరించాలని నిబంధన పెట్టారు. ప్రస్తుతం ఆ నిబంధనలను తుంగలో తొక్కి ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా.. పతి షిఫ్టులోను పది మందితో లడ్డు ప్రసాదాలను తయారు చేయాలి. కానీ.. కాంట్రాక్టర్ పైసలకు కక్కుర్తి పడి ఉన్న పది మందినే ప్రతి షిఫ్టులోను చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం దేవస్థానం అధికారులకు తెలిసినా.. పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు ఆమ్యమ్యాలు ముట్ట చెబుతుండడంతో దేవస్థానం అధికారులు చూసీచూడనట్లు వ్యవహ రిస్తున్నారని.. అందులో పని చేసే సిబ్బంది చెబుతున్నారు. ఒక్కోసారి రాత్రి పూట టెకెట్లు లేకుండా లడ్డు ప్రసాదాలను విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఆరోపణలు అవాస్తవం
టెండర్ల నిర్వహణలో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలో నిజం లేదు. నిబంధనల ప్రకారం టెండర్ తక్కువ వేసిన వారికే లడ్డూ ప్రసాదాల కాంట్రాక్ట్ అప్పగించాం. టెండర్లకు సంబంధించిన ప్రక్రియను కమిషనర్ ఆదేశాల మేరకే పూర్తి చేశాం.
- గీతారెడ్డి, దేవస్థానం ఈఓ