దమ్ములేక దుశ్చర్యలు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేమని..ఓటమి తప్పదని భావించిన ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. చీరాల నియోజకవర్గంలో ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం నిర్వహించిన సభను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సభలో మైకులు పనిచేయనీయకుండా వైర్లు కట్ చేయడం, విద్యుత్ సరఫరా నిలిపేసేందుకు జనరేటర్లో పంచదార పోయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
తరువాత మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా తన అభ్యర్థులను రంగంలోకి దించారు.
సార్వత్రిక ఎన్నికలకు చీరాల పరిరక్షణ సమితి పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నికల్లో ఆటోరిక్షా గుర్తు కావాలని నవోదయ అనే గుర్తుతెలియని పార్టీకి చెందిన బీఫాం తెచ్చుకుని పోటీ చేశారు.
ప్రజల్లో ఇప్పటికే ఆయనపట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో తాను ఎన్నికలయ్యాక వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం చేయించారు.
ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలియజేసేందుకు ఆదివారం జగన్ ప్రయత్నించారు. అదే సమయానికి మైకులు పనిచేయడం మానేశాయి.
దాదాపు 35 వేల మంది జగన్ సభకు హాజరయ్యారు. వీరిలో ఆమంచి అనుచరులు కలసిపోయి ఈ చర్యలకు పాల్పడి ఉంటారని వైఎస్సార్ సీపీ చీరాల అభ్యర్థి యడం బాలాజీ ఆరోపించారు.
ఒకవైపు విద్యుత్ తీగలు తెగిపోవడం, మరోవైపు మైకులు పనిచేయకపోవడం, ఇంకా జనరేటర్ పనిచేయకుండా అందులో పంచదార వేయడం వంటివి ఒకేసారి యాదృచ్ఛికంగా జరగవని.. ఓటమి భయంతో ఉన్న ప్రత్యర్థులే దీనికి కారణమని చెప్పారు. ప్రచార రథానికి గాలి కూడా తీశారన్నారు.
ఆమంచి కృష్ణమోహన్‌ను ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని..ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉన్నారని బాలాజీ స్పష్టం చేశారు.
ఇటువంటి అడ్డంకులేవీ పార్టీ విజయాన్ని ఆపలేవన్నారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని బాలాజీ తెలిపారు.
ఇదిలా ఉండగా..టీడీపీ నాయకులు కూడా ఆమంచితో కుమ్మక్కై ఉండొచ్చనే అనుమానాలు ఇక్కడి ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు.
మావోయిస్టు నేపథ్యం ఉన్న టీడీపీ అభ్యర్థి అనుచరులు ఇటువంటి ఘటనలకు పాల్పడి ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది.
ఎన్నికల కమిషన్ దీనిపై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.