రాజ్యసభ ఎన్నికలు; మహారాష్ట్రలో కలకలం
ముంబై: రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఎమ్మెల్యేలు తమ బ్యాలెట్ పత్రాలను తమ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వడంతో మహారాష్ట్రంలో వివాదం రాజుకుంది. మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. వీరి ఓట్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. యశోమతి ఠాకూర్(కాంగ్రెస్), జితేంద్ర అవద్(ఎన్సీపీ), సుహాస్ కాండే(శివసేన) తమ బ్యాలెట్ పేపర్లను తమ పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చారని బీజేపీ నేత పరాగ్ అలవానీ ఆరోపించారు. వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని రిటర్నింగ్ అధికారిని కోరారు.
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నాయకురాలు యశోమతి ఠాకూర్ కొట్టిపారేశారు. ‘ఎంవీఏ కూటమికి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఈ విషయం బీజేపీ కూడా తెలుసు. అందుకే వారు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నార’ని అన్నారు.
కాంగ్రెస్‌కు అసదుద్దీన్ అభయం
రాజ్యసభ ఎన్నికల్లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. కాగా, మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 16 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. (క్లిక్: ఎన్సీపీ నేతలకు షాక్.. జైల్లో ఉండడంతో ఓటింగ్‌కు నో)