ప్చ్.. బాగోలేదు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనా పగ్గాలు చేపట్టి ఏడాదైంది. చంద్రబాబు ఏడాది పాలనపై జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ యంత్రాంగం సర్వే నిర్వహించింది. వివిధ వర్గాల ప్రజలను పలకరించింది. నియోజకవర్గం నుంచి వంద చొప్పున మొత్తం 1,500 శాంపిల్స్ సేకరించింది. ఏడాది పాలన బాగోలేదని 72 శాతం మంది కుండబద్దలు కొట్టగా.. 18 శాతం మంది బాగుందని.. 7 శాతం మంది ఫరవాలేదని.. 3 శాతం మంది ఏమీ చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అయినా బాబు పాలనా తీరులో మార్పు వస్తుందనుకుంటున్నారా అన్న ప్రశ్నకు అత్యధికులు పెదవి విరిచారు. ఇకనైనా హామీలు నెరవేరతాయని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు నమ్మకం లేదని సమాధానమిచ్చారు.
- సాక్షి ప్రతినిధి, ఏలూరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :రాష్ట్రంలో తెలుగుదేశం పాలన ఏడాది మైలురాయి దాటిందని ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతుంటే.. గుదిబండ పాలన ఇంకా నాలుగేళ్లు భరించాలని సామాన్య ప్రజ అల్లాడిపోతోంది. సమైక్యాంధ్రప్రదేశ్ ముక్కలైన తరుణంలో తొమ్మిదేళ్లు పరి పాలించిన అనుభవం, రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగులకు భృతి వంటి వాగ్దానాలతో చంద్రబాబును నమ్మిన ‘పశ్చిమ’ వాసులు ఇప్పుడు నట్టేట మునిగామని ఆందోళన చెందుతున్నారు. అరకొర రుణమాఫీతో రైతులు.. అసలు మాఫీనేకాక, వడ్డీలు కట్టలేని స్థితిలో డ్వాక్రా మహిళలు.. ఎడాపెడా పింఛన్ల కోతతో వృద్ధులు, వికలాంగులు.. ఉద్యోగాల్లేక, నిరుద్యోగ భృతి రాక నిరుద్యోగులు.. రుణాలు అందక యువకులు, నిధుల లేక కేవలం సమీక్షలకే పరిమితమైన ఉద్యోగులు.. నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలతో నడ్డి విరిగిన సామాన్యులు చంద్రబాబు ఏడాది పాలనపై తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారు. సహజంగా ఎక్కడైనా పాలకుల తీరుపై ఎన్నో ఆశలు, అంచనాలతో ఉన్న సామాన్యుడి పెదవి విరుపు సర్వసాధారణమే కానీ అంతా దగా.. నిలువునా మోసం.. అని సరిగ్గా ఏడాదికే ప్రజలు సర్కారుపై రగిలిపోవడం ఇదే తొలిసారని విశ్లేషకులు చెబుతున్నారు.
సర్వే ఇలా..
టీడీపీ ఏడాది పాలనపై జిల్లా ప్రజానీకం ఏమనుకుంటోంది.. వివిధ రంగాల ప్రతినిధులు సర్కారు తీరుపై ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారనే అంశాలపై ‘సాక్షి’ యంత్రాంగం శాస్త్రీ య సర్వే నిర్వహించింది. రైతులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు.. ఇలా అన్నిరంగాల వారిని కలిసి అభిప్రాయాలు సేకరించింది. ఏడాది పాలన ఎలా ఉందనే ప్రశ్నకు ‘బాగుంది.. బాగోలేదు.. ఫరవాలేదు.. ఏమీ చెప్పలేం’ అనే కేటగిరీల కింద ఒక్కో నియోజకవర్గం నుంచి 100 శాంపిల్స్..
మొత్తంగా జిల్లానుంచి 1,500 శాంపిల్స్ సేకరించింది. ‘రుణమాఫీ కాక రైతులు నరకం చూస్తున్నారు.. ఇటు పాత అప్పు తీరక.. కొత్త అప్పు అందక కాడికింద పడేసే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు’ అనే అభిప్రాయమే రైతుల నుంచి వ్యక్తమైంది. అరకొర రుణమాఫీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 72శాతం మంది రైతులు ప్రభుత్వ తీరు బాగోలేదని చెప్పారు. 18శాతం మంది మాత్రం రుణమాఫీపై సంతృప్తిగానే ఉన్నామన్నారు. డ్వాక్రా మహిళలైతే సర్కారుపై భగ్గుమన్నారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంపై ప్రతి మహిళ సర్కారును ఆడిపోసుకుంది. మొత్తంగా 81శాతం మంది మహిళలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేయగా, 9శాతం మంది ఫరవాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగులు, నిరుద్యోగ భృతి రాని యువత సర్కారుపై నిప్పులు చెరి గింది. 70శాతం యువత ప్రభుత్వ ఏడాది పాలనలో ఏమీ ఒరగలేదన్న అభిప్రాయం వ్యక్తం చేయగా, 20 శాతం మంది ఇంకా వేచిచూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా తొలి ఏడాదిలో తప్ప(ప్పు)టడుగులు వేసిన సర్కారులో వచ్చే ఏడాదైనా మార్పు వస్తుందన్న నమ్మ కం కూడా లేదని చాలామంది పేర్కొనడం ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను స్పష్టం చేసింది.
అన్నీ అమలు చేస్తున్నారు
చంద్రబాబు అన్ని హామీలు అమలు చేస్తున్నారు. ఆ విషయాలను నవ నిర్మాణ దీక్షలో ప్రజాప్రతినిధులుగా ప్రజలకు వివరిస్తాం. రైతు రుణమాఫీని దాదాపుగా మెరుగైన రీతిలోనే చేశారు. డ్వాక్రా మహిళలకు ఈ నెల మూడో తేదీ నుంచి వారి ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు.
- తోట సీతారామలక్ష్మి, ఎంపీ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు
అన్ని వర్గాలనూ మోసగించారు
చంద్రబాబు ఏడాది పాలనంతా మోసపూరితంగా సాగింది. రైతులు, డ్వాక్రా రుణమాఫీ విషయంలో ఎవరికి పూర్తి న్యాయం చేయలేదు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో యువత ఓట్లను కొల్లగొట్టినప్పటికీ వారి అభ్యున్నతికి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.
- రఫీయుల్లా బేగ్, డీసీసీ అధ్యక్షుడు
హామీల అమలులో వైఫల్యం
చంద్రబాబు ఏడాది పాలనలో ఏ విధ మైన న్యాయం చేయలేకపోయారు. రైతు రుణమాఫీలో పూర్తి వైఫల్యం చెందారు. రూ.50వేల మాఫీ విషయంలో కౌలు రైతులకు న్యాయం జరగలేదు. డ్వాక్రా రుణాల మాఫీ సంగతి అంతే. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే విషయంలో ఏడాదిగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యువతను పట్టించుకోలేదు.
- కొత్తపల్లి సుబ్బారాయుడు, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ