తరగని ఆదరణ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ నేతలకు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజా సమస్యలను దృష్టికి తెస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. 14వ రోజు గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు 5వ డివిజన్లోని మహేంద్రనగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి వెళ్లి బాలినేని ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికిన ప్రజలను నగరంలోని ప్రధానంగా తాగునీటి సమస్యలు, మురికి కాలువల్లో పూడిక తీయకపోవడం, తద్వారా దోమల బెడద తదితర సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ పంచాచతీ అక్కచెరువుతండాలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పర్యటించారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి వరికూటి అమృతపాణి దేశాయిపేటలో ఇంటింటి పర్యటన చేశారు. మార్టూరు మండలం చీమిర్రిబండలో పర్చూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్, కంభం మండలం లింగాపురంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు.