ఐఏఎస్ కు రాజీనామాచేసి ట్యూటర్ గా..
21వ ఏట తొలిప్రయత్నంలోనే సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించి సంచనం సృష్టించిన రోమన్ షైనీ మరో అనూహ్యనిర్ణయం తీసుకున్నారు. గడిచిన మూడేళ్లుగా జబల్ పూర్ అసిస్టెండ్ కలెక్టర్ గా పనిచేస్తోన్నఆయన ఉన్నతోద్యోగానికి రాజీనామాచేసి, పూర్తికాలం ఉచిత విద్యాబోధనకు పునరంకితం కానున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు.
'ఉన్నత ఉద్యోగాలు చేయాలనుకునే పేద అభ్యర్థులు అకాడమీలకు వెళ్లి లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేరు. అలాంటివాళ్లకోసం ప్రారంభమైందే అన్అకాడమీ. ప్రస్తుతం ఇండియాలో లార్జెస్ట్ యూట్యూబ్ ఇదే. లక్షలాది మంది విద్యార్థులు కోటికి పైగా పాఠాలను అన్ అకాడమీద్వారా ఉచితంగా నేర్చుకున్నారు. దీని వ్యవస్థాపకుడు గౌరవ్ ముఝాల్ నా ఆప్తమిత్రుడు. రెండేళ్ల నుంచి నేను కూడా అన్ అకాడమీలో పాఠాలు చెబుతూనే ఉన్నా. అయితే అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందిప్పుడు. ఐఏఎస్ అధికారిగా కంటే ఉచితంగా పాఠాలు చెప్పే ట్యూటర్ గా ఉండాలనే నిర్ణయించుకున్నా' అంటూ తన మనోగతాన్ని వెల్లడించాడు రోమన్ షైనీ. సెప్టెంబర్ లోనే షైనీ రాజీనామా చేశాడని, ఈ నెలలో డీవోపీటీ శాఖ నిర్ణయం వెలువడుతుందని జబల్ పూర్ కలెక్టర్ ఎస్ ఎన్ రూప్లా చెప్పారు.