తల్లి తరిమేస్తే.. కేంద్రమంత్రి అయ్యారు!
అనుప్రియా పటేల్.. ఈ పేరు కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా వినిపించినా, చాలా ప్రముఖంగానే వినిపించింది. నరేంద్రమోదీ కొత్తగా తీసుకున్న 19 మందిలో ఈమె ఒకరు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 35 ఏళ్ల ఎంపీ.. మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు. అయితే.. ఆమె మంత్రి అయినందుకు అనుప్రియ తల్లి మాత్రం అస్సలు సంతోషించడం లేదట. యూపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్ అధ్యక్షురాలు కృష్ణా పటేల్ కూతురే అనుప్రియా పటేల్. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న పేరుతో గత సంవత్సరమే తన కూతురిని కృష్ణాపటేల్ ఆరేళ్ల పాటు పార్టీనుంచి బహిష్కరించారు.
వాస్తవానికి 2009లో అప్నాదళ్ వ్యవస్థాపకుడు, అనుప్రియ తండ్రి సోనేలాల్ మరణించినప్పటి నుంచి పార్టీ అధ్యక్ష పదవి కోసం తల్లీ కూతుళ్ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వచ్చే సంవత్సరం యూపీలో ఎన్నికలు జరగనుండటంతో అనుప్రియను తీసుకోవడం మంచిదని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. ఆమె కుర్మి కులానికి చెందినవారు కావడం.. ఆ కులం యూపీలో రాజకీయంగా పట్టున్న బీసీ కులం కావడం కూడా కలిసొచ్చే అంశాలని భావిస్తున్నారు. కుర్మి కులానికే చెందిన బిహార్ సీఎం నితీష్ కుమార్కు చెక్ పెట్టడానికి ఈమె ఉపయోగపడతారని అనుకుంటున్నారు.
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరామ్ కాలేజి నుంచి సైకాలజీలో డిగ్రీతో పాటు ఎంబీఏ కూడా చేసిన అనుప్రియా పటేల్ మంచి వక్తగా పేరొందారు. 2012 యూపీ ఎన్నికల్లోనే తొలిసారిగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండేళ్ల తర్వాత లోక్సభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో కూడా ఆమె తన ప్రశ్నలతో, వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. అప్నాదళ్ పార్టీకి లోక్సభలో ఇద్దరే ఎంపీలున్నారు. ఒకరు అనుప్రియ కాగా, మరొకరు హరివంశ్ సింగ్. ఆయన పటేల్ తల్లికి అనుచరుడు. తన కూతురిని మంత్రిగా చేస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటామని కూడా ఇటీవలే కృష్ణాపటేల్ బెదిరించినట్లు తెలిసింది.