youth parliament
-
Youth Parliament: అయామ్ మౌనిక
యూత్పార్లమెంటులో ప్రసంగించిన మన గిరిపుత్రిక పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.. అయామ్ మౌనిక... ఫ్రం తెలంగాణ.. అని పరిచయం చేసుకుని వాజ్‌పేయి జీవితంపై అద్భుత ప్రసంగం చేసి సర్వత్రా ప్రశంసలు అందుకున్న మౌనిక గురించి... దివంగత ప్రధాని వాజ్‌పేయి జీవితంపై యూత్‌పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసగించడానికి దేశ వ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా, వారిలో ఏడుగురికి భారత పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రసంగించే అవకాశం దొరికింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేతావత్ మౌనిక ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అంతేకాదు, ఈ ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని, తన అద్భుతమైన ప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకుంది మౌనిక. చురుకైన ప్రసంగాలు... రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారంకు చెందిన కేతావత్ నర్సింలు, సునీతల కుమార్తె మౌనిక. కామారెడ్డి పట్టణంలోని ఆర్కే పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్లు్య చదువుతోంది. తండ్రి నర్సింలు డీసీఎం డ్రైవర్‌గా, తల్లి సునీత బీడీ కార్మికురాలిగా కామారెడ్డి పట్టణంలో ఉండి తమ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. మౌనిక ఆర్కే కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, అదే కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు చురుకైన ప్రసంగాలతో కాలేజీలో అందరి మన్ననలను అందుకున్న మౌనికను కాలేజీ సీఈవో ఎం.జైపాల్‌రెడ్డి ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా యూత్ పార్లమెంటుకు కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడానికి కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీలు నిర్వహించారు. అన్నింటా మౌనిక ప్రథమ స్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన యూత్పార్లమెంటుకు ఎన్నికైన యువతులతో మౌనిక యూత్ పార్లమెంటు కోసం.. దేశవ్యాప్తంగా యూత్పార్లమెంటు ఎంపిక కోసం వివిధ దశల్లో వర్చువల్ పద్ధతిలో ప్రసంగ పోటీలు నిర్వహించారు. మౌనికతోపాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ నుంచి ఏడుగురికి అవకాశం కల్గింది. అందులో మౌనిక మూడోస్థానంలో మాట్లాడే అవకాశం వచ్చింది. మొదట కళాశాల స్థాయిలో పోటీలు నిర్వహించగా ‘మేకిన్ ఇండియా– మేడిన్ ఇండియా’ అంశాన్ని తీసుకుని ఉపన్యసించి ప్రథమ స్థానంలో నిలిచింది. తరువాత జిల్లా స్థాయి పోటీల్లో ‘స్టార్టప్ ఇండియా– స్టాండప్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించి ప్రథమ స్థానం సాధించింది. ఆ తరువాత రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది. తద్వారా పార్లమెంటులో మాట్లాడే అవకాశం లభించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.... యూత్ పార్లమెంటులో భాగంగా ఈ నెల 25న పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కేతావత్ మౌనిక మాట్లాడాలని నిర్వహకులు కోరారు. దీంతో ‘ఐ యామ్ మౌనిక ఫ్రం తెలంగాణ’ అంటూ ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. దివంగత ప్రధాని వాజ్‌పేయి గురించి మౌనిక చేసిన ప్రసంగానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిపెరిగిన మౌనిక తల్లిదండ్రులు తమ చదువుల కోసం పడుతున్న శ్రమను చూసి కష్టపడి చదువుతూనే ప్రతిభకు కూడా పదును పెట్టుకుంటోంది. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయిలో నిలవాలన్న లక్ష్యంతో మౌనిక మామూలు చదువుతో పాటు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకుంది. యూత్ పార్లమెంటుకు ఎంపికై, తన అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న మౌనికను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కళాశాల అధ్యాపకులు అభినందించారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
‘అలాంటి అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది’
సాక్షి, పనాజీ : భారత్‌లో మద్యం సేవించే యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని సర్వేలో స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు కూడా బీర్లు తాగటం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని ఆయన అంటున్నారు. ‘‘అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిపోయింది. అది పరిమితి ఎప్పుడో దాటి పోయింది. బీర్లు ఎగబడి తాగేస్తున్నారు. ఇది నాకు ఎంతో భయాన్ని కలగజేస్తోంది’ అని పారికర్ పేర్కొన్నారు. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ కు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మాట అమ్మాయిలందరినీ ఉద్దేశించి నేను అనటం లేదు. ఇక్కడున్న వాళ్లలో ఆ అలవాటు లేకపోలేదు. కానీ, గోవాలో గత రెండేళ్లలో మద్యం సేవిస్తున్న అమ్మాయిల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పారికర్ అభిప్రాయపడ్డారు. ఇక గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై ఆయన మాట్లాడుతూ.. డ్రగ్ నెట్ వర్క్ ను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. కాలేజీలో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని తాను భావించడం లేదని.. కానీ, మొత్తానికి లేదన్న వాదనతో మాత్రం తాను ఏకీభవించబోవని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. చట్టంలోని లోపాలతో నిందితులు త్వరగతిన బయటపడుతున్నారని.. అందుకే శిక్షాస్మృతిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక నిరోద్యోగ సమస్యపై స్పందిస్తూ... గోవా యువత కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదని... సింపుల్ వర్క్ వైపే మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గవర్నమెంట్ జాబ్ అంటే పని ఉండదనే భావంతో ఉన్నారని పారికర్ అసహనం వ్యక్తం చేశారు. -
ఆకట్టుకున్న ‘యూత్ పార్లమెంట్’
నిజాంసాగర్, న్యూస్‌లైన్: నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘యూత్ పార్లమెంట్’ కార్యక్రమం అతిథులను ఆకట్టుకుంది. నవోదయ విద్యాలయ సమితి న్యూఢిల్లీ వారి ఆదేశాను సారంగా స్థానిక విద్యాలయంలో 17వ జాతీయ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని భావిక లోక్‌సభ స్పీకర్, శ్రీకాంత్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఎంతశాతం మంది ప్రజలు ఉన్నారు..పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమిటి.. అని ప్రతిపక్ష ఎంపీలు సమావేశంలో ప్రధానమంత్రిని ప్రశ్నించారు. దీనికి కార్మిక మంత్రి సమాధానం ఇస్తు దేశంలో 21.9 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారన్నారు. ఇలా సమావేశంలో ప్రతి పక్ష ఎంపీలు ప్రశ్నలు సంధించగా, ఆయా శాఖల మంత్రులు సమాధానాలు చెప్పారు. సుమారు నాలుగు గంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను, గ్రామస్తులను ఆకట్టుకుంది. విద్యాలయంలోని 37 మంది విద్యార్థులు మంత్రు లుగా, ఎంపీలుగా వ్యవహరించారు. పార్లమెంట్ గురించి ప్రజలకు చెప్పాలి యూత్ పార్లమెంట్ కార్యక్రమం చాలా బాగుందని జుక్కల్ ఎమ్యెల్యే హన్మంతుసింధే అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలపైన ప్రజలకు అవగాహన కల్పిం చాల్సిన అవసరం ఉందన్నారు.