పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా ప్రసంగిస్తూ...
యూత్‌పార్లమెంటులో ప్రసంగించిన మన గిరిపుత్రిక పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.. అయామ్ మౌనిక... ఫ్రం తెలంగాణ.. అని పరిచయం చేసుకుని వాజ్‌పేయి జీవితంపై అద్భుత ప్రసంగం చేసి సర్వత్రా ప్రశంసలు అందుకున్న మౌనిక గురించి...
దివంగత ప్రధాని వాజ్‌పేయి జీవితంపై యూత్‌పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసగించడానికి దేశ వ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా, వారిలో ఏడుగురికి భారత పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రసంగించే అవకాశం దొరికింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేతావత్ మౌనిక ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అంతేకాదు, ఈ ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని, తన అద్భుతమైన ప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకుంది మౌనిక.
చురుకైన ప్రసంగాలు...
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారంకు చెందిన కేతావత్ నర్సింలు, సునీతల కుమార్తె మౌనిక. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌కే పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్లు్య చదువుతోంది. తండ్రి నర్సింలు డీసీఎం డ్రైవర్‌గా, తల్లి సునీత బీడీ కార్మికురాలిగా కామారెడ్డి పట్టణంలో ఉండి తమ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. మౌనిక ఆర్‌కే కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, అదే కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు చురుకైన ప్రసంగాలతో కాలేజీలో అందరి మన్ననలను అందుకున్న మౌనికను కాలేజీ సీఈవో ఎం.జైపాల్‌రెడ్డి ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా యూత్ పార్లమెంటుకు కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడానికి కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీలు నిర్వహించారు. అన్నింటా మౌనిక ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇతర రాష్ట్రాలకు చెందిన యూత్‌పార్లమెంటుకు ఎన్నికైన యువతులతో మౌనిక
యూత్ పార్లమెంటు కోసం..
దేశవ్యాప్తంగా యూత్‌పార్లమెంటు ఎంపిక కోసం వివిధ దశల్లో వర్చువల్ పద్ధతిలో ప్రసంగ పోటీలు నిర్వహించారు. మౌనికతోపాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ నుంచి ఏడుగురికి అవకాశం కల్గింది. అందులో మౌనిక మూడోస్థానంలో మాట్లాడే అవకాశం వచ్చింది. మొదట కళాశాల స్థాయిలో పోటీలు నిర్వహించగా ‘మేకిన్ ఇండియా– మేడిన్ ఇండియా’ అంశాన్ని తీసుకుని ఉపన్యసించి ప్రథమ స్థానంలో నిలిచింది. తరువాత జిల్లా స్థాయి పోటీల్లో ‘స్టార్టప్ ఇండియా– స్టాండప్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించి ప్రథమ స్థానం సాధించింది. ఆ తరువాత రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది. తద్వారా పార్లమెంటులో మాట్లాడే అవకాశం లభించింది.
పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా....
యూత్ పార్లమెంటులో భాగంగా ఈ నెల 25న పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో కేతావత్ మౌనిక మాట్లాడాలని నిర్వహకులు కోరారు. దీంతో ‘ఐ యామ్ మౌనిక ఫ్రం తెలంగాణ’ అంటూ ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. దివంగత ప్రధాని వాజ్‌పేయి గురించి మౌనిక చేసిన ప్రసంగానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిపెరిగిన మౌనిక తల్లిదండ్రులు తమ చదువుల కోసం పడుతున్న శ్రమను చూసి కష్టపడి చదువుతూనే ప్రతిభకు కూడా పదును పెట్టుకుంటోంది. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయిలో నిలవాలన్న లక్ష్యంతో మౌనిక మామూలు చదువుతో పాటు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకుంది. యూత్ పార్లమెంటుకు ఎంపికై, తన అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న మౌనికను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కళాశాల అధ్యాపకులు అభినందించారు.
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment