y.v. subbareddy
-
వెలిగొండకు వెయ్యికోట్లివ్వండి
► రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి ► జిల్లాలోనే మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి ► పొగాకుకు కిలో రూ.165 ధర ఇవ్వాలి ► భూమా మరణం మమ్మల్ని బాధించింది ► ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో వందలాది మంది మరణాలకు కారణమైన ఫ్లోరైడ్ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యమని, జిల్లా వాసులకు తాగు, సాగు నీటికి ఈ ప్రాజెక్టు ఏకైక మార్గమని ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెయ్యి కోట్ల రూపాయల నిధులిచ్చి వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . సోమవారం ఒంగోలులోని స్వగృహంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కారు సకాలంలో నిధులు కేటాయించకపోవడం వలనే ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యాయని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బాబు, మూడేళ్లు దాటుతున్నా పనులు పూర్తి చేయలేదన్నారు. మొక్కుబడి నిధుల కేటాయింపు వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని మండిపడ్డారు. తక్షణం వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెలిగొండ నీరు తప్ప జిల్లా వాసులకు మరో ఆధారం లేదన్నారు. ప్రస్తుతం గుక్కెడు తాగునీరు కూడా అందే పరిస్థితి లేదని చెప్పారు. తక్షణం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు నీళ్లు వస్తే ఫ్లోరైడ్ సమస్య తీరే అవకాశం ఉందన్నారు. గిట్టుబాటు ధరల్లేక జిల్లా రైతాంగం తీవ్ర నష్టాలపాలైందని, కందులు కొనే వారే లేరన్నారు. గతేడాది కందులు సైతం నిల్వ ఉన్నాయని చెప్పారు. కందికి గిట్టుబాటు ధర కల్పించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. మూడేళ్ల వరుస కరువుతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ఇక పొగాకు రైతులకు సైతం గిట్టుబాటు ధర లేదన్నారు. తీవ్రంగా నష్టపోయి దాదాపు 48 మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ ఆత్మహత్యలను నిరోధించాలంటే గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కిలో రూ.165కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డులు రైతులపై ఆంక్షలు పెట్టడం మాని వ్యాపారులను, దళారులను అదుపులో పెట్టాలని ఎంపీ సూచించారు. గిట్టుబాటు ధర రాక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతేడాది క్వింటాలు మిర్చి రూ.13 వేల వరకు ఉంటే ఈ ఏడాది రూ.4,500 మాత్రమే ధర ఉందని రైతులకు కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఎంపీ పేర్కొన్నారు. క్వింటా మిర్చి రూ.10 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు గుంటూరు మిర్చి యార్డుకు పంట తరలించాలంటే ట్రాన్స్‌పోర్టు అదనపు భారంగా మారిందన్నారు. ప్రకాశం జిల్లాలోనే మిర్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఎంపీ డిమాండ్ చేశారు. భూమా మరణం బాధించింది నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తమనెంతో బాధించిందని ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూమాను వైఎస్ కుటుంబంలో సభ్యులుగానే భావిస్తామన్నారు. ఆయన మృతితో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంతగా కలత చెందామని చెప్పారు. నాగి రెడ్డి పిల్లలకు దేవుడు మనోధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నామన్నారు. భూమా కుటుంబానికి రాజకీయాలకతీతంగా వైఎస్సార్ కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని ఎంపీ చెప్పారు. శోభానాగిరెడ్డి చనిపోవడమే ఆ కుటుంబానికి పెద్ద లోటుగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో భూమా చనిపోవడం మరింత బాధాకరమన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్ నేత వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇక దద్దవాడకు మహర్దశ
గిద్దలూరు: వెనుకబడిన గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉన్న దద్దవాడ పంచాయతీని సంసాద్ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నుకోవడంతో ఆ గ్రామానికి మహర్దశ పట్టనుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక తన నివాసంలో దద్దవాడ గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఐదేళ్ల కాలంలో మూడు గ్రామాలను ఎన్నుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. అందులో దద్దవాడను చేర్చాలని కోరిన వెంటనే ఎంపీ ప్రకటించడం ఆనందదాయకమన్నారు. గిద్దలూరు ప్రాంతంలో జవాన్లు అధికంగా ఉన్నారని సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని కోరగానే ఎంపీ రక్షణశాఖ మంత్రిని కలిసి ప్రతిపాదనలు చేశారన్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డికి నియోజకవర్గ ప్రజలు, దద్దవాడ ప్రజల తర ఫున కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వ తీరు దారుణం: ఎన్నికల సమయంలో అధి కారం కోసం టీడీపీ వ్యవసాయ రుణాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రూ.87 వేల కోట్లుఉన్న రుణాలను రూ.5 వేల కోట్లకు తగ్గించేందుకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. రేషన్‌కార్డుకు, ఆధార్‌కార్డుకు ఒక్క అక్షరం తప్పు ఉన్నా రుణమాఫీ చేయకుండా కొర్రీ వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రైతులను అబద్ధపు హామీలతో మోసగించేకన్నా...తన కు చేతకాదని చెప్పి వారికి క్షమాపణ చెప్పవచ్చుకదా అని ఎద్దేవా చేశారు. వేలాది మంది లబ్ధిదారులను విచారించేందుకు, వారి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు తీసుకునేందుకు రెండు రోజుల సమయం ఇస్తే వారు ఎలా సర్వే నిర్వహిస్తారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు అప్పగిస్తే ఈసర్వే పూర్తి చేసి 15వ తేదీలోగా బ్యాంకులో అప్లోడ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టం విడిపోయిన నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితిని గమనించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యంకాదని హామీ ఇవ్వలేదని, హామీలు ఇచ్చి రైతులను మోసం చేయడం ఇష్టం లేకనే చెప్పలేదన్నారు. టీడీపీ మోసపూరిత హామీలు ఇచ్చి కమిటీలు, సాధికార సంస్థల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బూటకపు రుణమాఫీ హామీ వలన రైతులు తీసుకున్న రుణాలకు అధిక వడ్డీలు చెల్లించాల్సి పరిస్థితి నెలకొందన్నారు. రుణాలు చెల్లించకపోవడంతో పంటల బీమా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆయన వెంట దద్దవాడ సర్పంచి గులాం చిన్నవీరయ్య, ఉపసర్పంచి బిజ్జం వెంకటరెడ్డి, కొమరోలు వైస్ ఎంపీపీ బి.చిన్నఆంజనేయులు, మాజీ సర్పంచి బిజ్జం వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, నాయకులు రోశిరెడ్డి, నారు వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, కైపా కోటేశ్వరరెడ్డి ఉన్నారు.